breaking news
srisalam officer
-
శ్రీశైల భ్రమరాంబిక ఆలయ ఉద్యోగులపై వేటు
సాక్షి, కర్నూలు: స్థానిక శ్రీ శ్రీశైల భ్రమరాంబ ఆలయ కుంభకోణంలో భాగస్వాములైన ఉద్యోగులపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపక్రమించింది. 11 మంది దేవస్థాన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు ఆంధ్రాబబ్యాంకు, ఇతర ఏజెన్సీల ఉద్యోగులు మొత్తం 33 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రూ. 2.56 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. దేవాదాయశాఖ విచారణ అనంతరం వీరిపై చర్యలు తీసుకోనుంది. (శ్రీశైలం దేవస్థానంలో రూ.3 కోట్లకు పైగా అక్రమాలు) -
శివ శివా.. ఇదేమి సేవ!
సాక్షి, కర్నూలు : ప్రముఖుల సేవలో శ్రీశైలం అధికారులు తరించారు. సామాన్యులకే పెద్దపీట వేస్తున్నామంటూ చేసిన ఆర్భాటపు ప్రకటనలు మరిచారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి మల్లన దర్శనానికి వచ్చిన శివభక్తులకు చుక్కలు చూపించారు. శ్రీశైల చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో వీఐపీ పాసులు జారీ చేసి తమ ప్రాధాన్యాన్ని, అంతరంగాన్ని బయటపెట్టారు. క్షణ కాలమైనా భూలోకకైలాసుడిని కనులార దర్శించుకుందామని తరలివచ్చిన భక్తులు విధిలేని పరిస్థితుల్లో నిరసనలు, నీలదీతల బాట పట్టాల్సి వచ్చింది. శివదీక్షాభక్తులతో గురువారం శ్రీశైల ప్రధాన వీధులన్నీ కిటకిటలాడాయి. ఉదయం నుంచి మందకొడిగా ప్రారంభమైన శివభక్తుల సందడి మధ్యాహ్న సమయానికి ఊపందుకుంది. దీంతో ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. పారంభ సమయంలో గంటలోపు శివదర్శనం కలిగినా.. రాను రాను ఆ సమయం పెరుగుతూ వచ్చింది. తర్వాత క్యూలైన్లు నత్తనడకన సాగాయి. భ్రామరీ కళామందిరంలో ప్రారంభమైన క్యూ నిడివి సుమారు అరకిలోమీటరు పైనే ఉంటుంది. మదినిండా మహేశ్వర దర్శనం కోసం వచ్చిన భక్తజనులకు శివదర్శనానికి గంటల సేపు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రముఖుల పేరిట విచ్చలవిడిగా జారీ చేసిన టికెట్ల వల్లే ఈ జాప్యం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎమ్మేల్యేలు, ఎంపీలు, అధికారుల బంధువులకు రాచమర్యాదలు చేయడంలో అధికారులు నిమగ్నమవ్వడంతోనే ఈ పరిస్థితి నెలకొందని భక్తులు ఆరోపిస్తున్నారు. వీఐపీ టిక్కెట్లతోనే..: పెద్దల పేరిట జారీ చేసిన వీఐపీ టిక్కెట్లు దళారులకు పరోక్షంగా కాసులు కురిపించాయి. కంచే చేను మేసిన చందంగా ధర్మకర్తల మండలి సభ్యులు కొందరు వ్యవహరించారు. తమ కోటా కింద కేటాయించిన టిక్కెట్లను ఆలయ సిబ్బంది, కొందరు దళారుల ద్వారా అధిక ధరలకు విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు వీఐపీ టిక్కెట్లు ఇచ్చామన్నా ముసుగులో అధికారులు, ఆలయ సిబ్బంది ఒక్కో టిక్కెట్టును రూ. 400 నుంచి రూ. 500 అమ్మేసుకున్నారు. శివ భక్తుల ఆందోళన..: ఉదయం నుంచి మల్లన దర్శనానికి క్యూలైన్లలో నిలబడ్డ శివభక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సామాన్య భక్తులూ సహనం కోల్పోయారు. శివనామస్మరణ చేయాల్సిన చోట శ్రీశైల ఆలయ అధికారులకు వ్యతిరేకంగా డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. వీఐపీలకు రాచమర్యాదలు చేసి మమ్మల్ని పట్టించుకోరా..అంటూ ఆందోళనకు దిగారు. ఇంత నిర్లక్ష్యమా : మహేష్ హైద్రాబాద్ దేవస్థానం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. శివస్వాములకు ప్రాధాన్యం తగ్గించారు. రెండు గంటలకు పైగా ఒకే చోట క్యూలో నిలబెట్టారు. దాహంతో అల్లాడుతున్న వారికి మంచినీటిని ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదు. మేం ఇక్కడి నుంచి ఆందోళన చేస్తున్నాం. అంతా గందరగోళం: సుంకప్ప, ఆదోని ఇరుముడి స్వాములకు క్యూలు చాలా ఎక్కువగా చేశారు. అందులోనే మమల్ని కూడా పంపుతున్నారు. క్యూలోనే గంటలకు పైగా తిరగాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తోడు ఇరుముడుస్వాములు ఏ క్యూలో వెళ్లాలో కూడా తెలియడం లేదు. శివస్వాములకు, సాధారణ భక్తులను కలపి పంపడం సరికాదు. ఇబ్బందులు తప్పడం లేదు : రాజమోహన్‌రెడ్డి, కర్నూలు సాధారణ భక్తులతో పాటు శివస్వాములకు కూడా అనుమతి ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల వరకు క్యూ ముందుకు సాగలేదు. ఎందుకు నిలిపివేశారో తెలియడం లేదు. ఇలా గంటల తరబడి క్యూలు నిలిపివేయడం దేవస్థానం నిర్వాహకులకు సరైన పద్ధతికాదు