breaking news
sriramsagar
-
హోరు గోదావరి.. భద్రాచలం వద్ద మళ్లీ అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ఎగువన శ్రీరాంసాగర్ నుంచి దిగువన భద్రాచలం ఆవలిదాకా గోదావరి నది హోరెత్తి ప్రవహిస్తోంది. ప్రధాన నది పొడవునా జలకళ ఉట్టిపడుతోంది. ప్రాణహిత నుంచి ప్రవాహం కాస్త తగ్గినా.. ఎగువ నుంచి వస్తున్న నీరు, కడెం, ఇతర వాగులు, వంకలు కలసి మళ్లీ వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం మెల్లగా పెరుగుతూ వస్తోంది. ఎగువ గోదావరి ఉరకలేస్తూ.. శనివారం రాత్రి 7 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,57,496 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 56.94 టీఎంసీలకు పెరిగింది. మరో 34 టీఎంసీలు చేరితే ఈ ప్రాజెక్టు నిండిపోతుంది. శ్రీరాంసాగర్ దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,92,529 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 20గేట్లు ఎత్తి 2,55,320 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు ప్రాణహిత జలాలు కలసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలోకి 6,10,250 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. మధ్యలో ఇంద్రావతి ఉపనది నీరూ తోడై.. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీలోకి 8,79,450 క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. ఈ నీటిని అలాగే మొత్తంగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు, మధ్యలో ఉప నదులు, వాగుల నుంచి కలుస్తున్న జలాలు మొత్తం భద్రాచలం, పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద మళ్లీ అప్రమత్తం శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం దాకా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ నీరంతా వాగులు, వంకల ద్వారా ప్రాణహితలోకి చేరి గోదావరికి వరద పెరగనుంది. దీనితోపాటు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలు కలసి.. సోమవారం నాటికి భద్రాచలం వద్ద వరద 11 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గోదావరిలో నీటి మట్టం మెల్లగా పెరుగుతూ వస్తోంది. భద్రాచలంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 39 అడుగుల వద్ద నిలిచిన నీటిమట్టం.. రాత్రి 8 గంటలకు 41.01 అడుగులకు చేరింది. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర నేతలు గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కృష్ణాలో పెరుగుతున్న ప్రవాహం పశ్చిమ కనుమల్లో వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద మెల్లగా పెరుగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 83,945 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నీటి నిల్వ 45.50 టీఎంసీలకు చేరింది. మరో 84 టీఎంసీలు వస్తే ఈ డ్యామ్ నిండుతుంది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్‌లోకి ఇన్‌ఫ్లో ఏమీ లేదు. ఇక కృష్ణా ఉప నది అయిన తుంగభద్రలో వరద కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 34,071 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 16.65 టీఎంసీలకు పెరిగింది. ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాలు నిండితే.. దిగువకు వరద రానుంది. ఈ నెలాఖరులోగా శ్రీశైలం జలాశయానికి ప్రవాహాలు మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన వరద మొదలు పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో ప్రవాహం ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మున్నేరు పరవళ్లు తొక్కుతోంది. ఆ నీరంతా కృష్ణాలోకి చేరుతుండటంతో.. శనివారం ప్రకాశం బ్యారేజీలోకి 17,377 క్యూసెక్కులు వరద వస్తోంది. దీంతో కృష్ణా డెల్టాకు 7,087 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. సింగరేణికి వాన దెబ్బ భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. 14 ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ (బొగ్గుపొరలపై ఉన్న మట్టి) వెలికితీత పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీల్లో చేరుతున్న వరద నీటిని తోడిపోసేందుకు భారీ మోటార్లను వినియోగిస్తున్నారు. కోతకు గురైన కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన తెలంగాణ–మహారాష్ట్రల మధ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర వంతెన కోతకు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి వచ్చిన భారీ వరద తాకిడికి మహారాష్ట్ర వైపు ఉన్న చివరిభాగం దెబ్బతిన్నది. అక్కడ వంతెనకు ఆనుకుని పోసిన గ్రావెల్, ఎర్రమట్టి కుంగిపోయింది. గత ఏడాది జూలైలో కూడా ఇదే ప్రాంతంలో కోతకు గురై 20 రోజుల పాటు రాకపోకలు నిలిచిపోవడం గమనార్హం. -
శ్రీరాంసాగర్ నీటిని వినియోగించుకోవాలి
మోతె: మండల రైతులు శ్రీరాంసాగర్ సాగు నీటిని వినిమోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ర్‌రావు, టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని రాఘవాపురం, నామారం గ్రామాల్లో పర్యటించి శ్రీరాంసాగర్ కాల్వలను పరిశీలించారు. మోతె మండలంలో చెర్వులు, కుంటలు పూర్తిగా నింపుకొనుటకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. రాఘవాపురం ,సిరికొండ, భల్లుతండాల్లోని ఎస్సారెస్పీ కెనాల్లలోకి సాగు నీరు వస్తున్నందుకు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరి వెంట రాఘవాపురం సర్పంచ్ మూడు కృష్ణ, ఎంపీటీసీ మధు, టీఆర్ఎస్ మండల నాయకులు, ఏలూరి వెంకటేశ్వరరావు, జి సుదర్శన్‌రెడ్డి, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. -
శ్రీరాంసాగర్‌కు భారీగా వరద నీరు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 90 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55 టీఎంసీల నీరు ఉంది. -
ప్రాజెక్టుల రీడిజైన్‌తో ప్రతి ఎకరాకు నీరు
బాల్కొండ: ప్రాజెక్టుల రీ డిజైన్‌తో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందుతుందని స్పీకర్ మధుసుదనా చారి తెలిపారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తూ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధన దిశగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సారెస్పీని ఆధునిక దేవాలయంగా తొలి ప్రధాని జవహర్లా నెహ్రూ పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ ఆధునిక దేవాలయం ద్వారా 18 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టును కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్‌లోకి వచ్చిన ఇన్‌ఫ్లో, కాలువల ద్వారా నీటి విడుదల వివరాలను ప్రాజెక్టు ఎస్ఈ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ డ్యాంపై ఫ్లడ్ కంట్రోల్ రూంలో ఎస్సారెస్పీ నిర్మాణానికి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపిన చేసినప్పటి ఫొటోను గోడపై నుంచి తీసి పరిశీలించి చూశారు. స్పీకర్ మధుసుదనా చారిని అధికారులు సన్మానించారు. ప్రాజెక్ట్ సమస్యలపై స్పీకర్‌కు విన్నవించారు. ప్రాజెక్ట్ ఈఈ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.