శ్రీరాంసాగర్ నీటితో చెరువులు నింపాలి
తిరుమలాయపాలెం: శ్రీరాంసాగర్ సాగర్ జలాలతో కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంలోని అన్ని చెరువులు నింపాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని సుబ్లేడు, బచ్చోడు తదితర ప్రాంతాలలో శ్రీరాంసాగర్, తానంచర్ల వరద కాల్వలను రైతు సంఘం నాయకుల ప్రతినిధి బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్లేడు చెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలని కోరారు. తానంచర్ల వరద కాల్వకు నిధులు కేటాయించి శ్రీరాంసాగర్ కాల్వకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సాగునీటి వనరులు లే క నిత్యం కరువుకు గురయ్యే తిరుమలాయపాలెం మండలానికి సాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
వైరారిజర్వాయర్ను సాగర్‌జలాలతో నింపాలి
వైరా: వైరా రిజర్వాయర్‌ను రెండు టీఎంసీల సాగర్ జలాలతో నింపాలని అఖిలభారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వైరా రిజర్వియర్ను రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించిన ఆయన అనంతరం మాట్లాడారు. సాగర్ జలాలతో నింపకపోతే వర్షాధారంగా ఉన్న రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉందన్నారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ త్వరితగతిన పూర్తిచేసి ఖమ్మం జిల్లా రైతుల కష్టాలను తొల గించాలన్నారు. వైరా రిజర్వాయర్ నీటిని ఇతర అవసరాలకు వాడటం సరికాదని, ఇటువంటి చర్యలు చట్టవ్యతిరేకమైనవని అన్నారు.
బయ్యారం చెరువు అలుగు పెంచాలి
బయ్యారం: కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు అలుగు ఎత్తును రెండు అడుగుల మేర పెంచాలని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన నేతృత్వంలోని రైతు సంఘం నాయకులు బయ్యారం పెద్ద చెరువును పరిశీలించారు. అనంతరం బయ్యారంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటివనరుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామని తెలిపారు.
బయ్యారం పెద్ద చెరువు కాల్వలకు శాశ్వత మరమ్మతులు నిర్వహించాలని కోరారు. ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దులో ఉన్న తులారాం ప్రాజెక్టు ఎత్తుని పెంచి మండలంలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరందించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నున్నా నాగే శ్వరరావు, మాదినేని రమేష్, సీపీఎం డివిజన్ నాయకులు మామిండ్ల సంజీవరెడ్డి, ఎస్డి జియాఉద్దిన్, సంజీవ రెడ్డి, ఆళ్ళ వెంకటరెడ్డి, మచ్చా నర్సింహరావు మండా రాజన్న పాల్గొన్నారు.