శ్రీయా ఇన్ఫోటెక్ నుంచి ఫార్మా లైవ్ యాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన మొబైల్ అప్లికేషన్స్ అభివృద్ధి చేసే శ్రీయా ఇన్ఫోటెక్ తనతొలి మొబైల్ యాప్ ‘ఫార్మాలైవ్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫార్మా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మరింత సరళతరం చేసే విధంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసామని, దీంతో ఎంతో విలువైన సమయంతో పాటు, నగదు ఆదా అవుతుందని శ్రీయా ఇన్ఫోటెక్ డెరైక్టర్ శ్రీధర్ నర్రా తెలిపారు. గురువారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంతో కొత్తగా వచ్చిన స్టాక్ రిటైలర్‌కి చేరడానికి మూడు రోజుల సమయం పడుతోందని, అలాగే ఈ సమాచారాన్ని క్రోడీకరించడానికి దేశవ్యాప్తంగా 6 లక్షల గంటల సమయం వృధా అవుతోందన్నారు.
దేశవ్యాప్తంగా లక్ష మందికిపైగా ఫార్మా స్టాకిస్టులు ఉండగా, మూడు లక్షల మంది అమ్మకందారులు ఉన్నట్లు అంచనా. ఫార్మా స్టాకిస్ట్‌లు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్స్‌కు ఈ ఫార్మాలైవ్ యాప్ ఉపయోగపడుతుందని, కొత్త స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు తెలియడంతోపాటు, ఆర్డర్ కూడా వెంటనే చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ యాప్‌ను వినియోగించడానికి సంవత్సరానికి రూ.5,000 రుసుము వసూలు చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. అదే టాబ్‌తో కలిసి అయితే రూ.13,000 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల కాలంలో కనీసం 2,000 మందికి ఈ యాప్‌ను విక్రయించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు శ్రీధర్ వివరించారు. ఈకామర్స్, ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి యాప్‌ను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే మూడు నెలల్లో దీన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.