breaking news
Sridevi Entertainment
-
ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది
‘‘కొత్త దర్శకుడినైనా... తొలిసారి కథ చెప్పగానే హీరో ఆది సినిమా చేయడానికి అంగీకరించారు. నాపై పూర్తి నమ్మకాన్ని కనబరిచారు సాయికుమార్. వారిద్దరూ అందించిన ప్రోత్సాహంతోనే ‘రఫ్’ సినిమాని అంత బాగా తీయగలిగాను. కమర్షియల్ అంశాలతో కూడిన మాస్ సినిమా చేయడమంటేనే నాకు ఇష్టం. తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సీహెచ్ సుబ్బారెడ్డి. సహాయ దర్శకునిగా కెరీర్‌ని ఆరంభించిన ఆయన ‘రఫ్’తో దర్శకుడయ్యారు. ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా అభిలాష్ మాధవరం నిర్మాణంలో రూపొందిన ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎమ్. సుదర్శన్‌రావు సమర్పించారు. చిత్ర దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలివీ... ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ‘రఫ్’ తొమ్మండుగురు దర్శకుల దగ్గర పదకొండు చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాను. ఆ అనుభవం నా తొలి సినిమాకి బాగా పనికొచ్చింది. ఎక్కడా ఇబ్బంది పడకుండా ‘రఫ్’ చిత్రాన్ని తెరకెక్కించగలిగానంటే కారణం అదే. ‘అశోక్’, ‘గుడుంబా శంకర్’ లాంటి చిత్రాలకు నేను సహాయ దర్శకునిగా పనిచేశాను. వాటి ప్రభావం నాపై ఎక్కువగా ఉంటుంది. అందుకే మాస్ సినిమాల్ని చేయడానికే ఇష్టపడుతుంటాను. ఆ ఆలోచనలకి ప్రతిరూపమే ‘రఫ్’. అందరూ కలిసి చూసేలా ఉండాలని కథ రాసుకున్నా. అభిలాష్ మాధవరం కథని నమ్మి ఈ సినిమా నిర్మించారు. కమర్షియల్‌గా సినిమా మంచి ఫలితాన్ని సాధించిందంటే కారణం నిర్మాతే. బి, సి కేంద్రాల్లో చిత్రానికి లభిస్తున్న స్పందన చాలా బాగుంది. యాక్షన్, వినోదం, కుటుంబ అనుబంధాలు... ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది. మొత్తంగా ‘రఫ్’ రూపంలో ఒక మంచి సినిమా చేశామన్న తృప్తి లభించింది. శ్రీహరి నన్ను మెచ్చుకున్నారు! సినిమా కోసం ఆది పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రెండేళ్ల ప్రయాణంలో ఆయన ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఎనిమిది నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశారు. ఆ సన్నివేశాల్లో ఆది నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఆదిలోని మాస్ హీరోని బయటికి చూపించగలిగాను. ఆయన ఈ సినిమా కోసం పడిన కష్టం వృథా కాలేదు. శ్రీహరి గారు మరో పిల్లర్‌లా ఈ సినిమాని మోశారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత మళ్లీ అంత మంచి పాత్ర ఇచ్చావ్... అంటూ ఆయన నన్ను మెచ్చుకొంటూ, ప్రోత్సహిస్తూ ఈ సినిమా చేశారు. ఆయన సలహాలతోనే ఈ సినిమా బయటకు రాగలిగింది. మేం స్విట్జర్లాండ్‌లో పాటలు చిత్రీకరించాలని వెళుతుంటే... శ్రీహరి గారు ఇంటికి పిలిపించి ‘ముందు నాపై సన్నివేశాలు తీయండి, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌కి వెళ్లండి’ అని చెప్పారు. దీంతో ముందుగా ఆయన సన్నివేశాల్ని తీశాం. ఈ రోజు శ్రీహరి గారు మా మధ్య లేకపోవడం బాధగా ఉంది. ఆయనలా స్టయిలిష్‌గా తీశానంటున్నారు! నేను ఎవరి దగ్గరైతే పని చేశానో వారందరి ప్రభావం నాపై చాలా ఉంది. ‘రఫ్’ చూసినవాళ్లు ‘మీ గురువు సురేందర్ రెడ్డిలా స్టైలిష్ సినిమా తీశావ్’ అని కొద్దిమంది అన్నారు. ఆ కామెంట్ నాకు తృప్తినిచ్చింది. ఏదైతే అనుకొన్నామో అది పక్కాగా తెరపైకి తీసుకురావాలనేది నా అభిమతం. అందుకోసం ఎంతైనా కష్టపడతాను. తర్వాత కూడా ‘రఫ్’ లాంటి కమర్షియల్ సినిమాలే చేస్తాను. రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే నా రెండో చిత్రం వివరాల్ని ప్రకటిస్తా. -
భవిష్యత్తులో ఎలాంటి సినిమానైనా నిర్మించగలననే ధైర్యాన్నిచ్చింది రఫ్
‘‘క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అటు యువతరానికీ, ఇటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఓ మంచి సినిమా తీయాలనుకున్నాం. ‘రఫ్’తో ఆ ప్రయత్నం నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అభిలాష్ మాధవరం. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘రఫ్’. ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించారు. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. యమ్. సుదర్శన్‌రావు సమర్పకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ప్రారంభ వసూళ్లను తెచ్చిపెట్టిందంటున్న అభిలాష్ మాధవరంతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివి... మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘రఫ్’. కథలో అందరినీ అలరించే అంశాలున్నాయి. అందుకే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బి, సి కేంద్రాల్లో సినిమాకి చక్కటి ఆదరణ దక్కుతోంది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు ఇదొక యావరేజ్ సినిమానే అయినప్పటికీ...వాళ్లు కూడా ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్నారు. మౌత్ టాక్‌తో ఇంకా వసూళ్లు పెరుగుతాయని మా నమ్మకం. దర్శకుడు సుబ్బారెడ్డి ఎక్కడా తడబాటు లేకుండా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథని నమ్మి చేసిన చిత్రమిది. దర్శకుడు తొలిసారి కథ చెప్పినప్పుడే సినిమాపై మాకు నమ్మకం కలిగింది. ఆయన ఏం చెప్పాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. ఆది, రకుల్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండేళ్ల ప్రయాణం ఈ సినిమా. నిర్మాతగా నాకు ఇదే తొలి చిత్రం. చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా చిత్రాన్ని పూర్తి చేశాం. నిర్మాతగా ఒక మంచి అనుభవాన్నిచ్చిందీ సినిమా. భవిష్యత్తులో ఎలాంటి సినిమానైనా నిర్మించగలననే ధైర్యాన్నిచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేను. మణిశర్మ, సెంథిల్ కుమార్, అరుణ్ కుమార్ లాంటి సాంకేతిక బృందంతో కలిసి మేం పనిచేశామని చెప్పుకోవడం కంటే... వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నానని చెబుతాను. సినిమా కోసం ఆది పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎనిమిది నెలల పాటు తను కఠోరంగా శ్రమించి సిక్స్ ప్యాక్ చేశాడు. తన ప్రతిభా పాటవాలన్నీ ఈ సినిమా కోసం ఉపయోగించాడు. ‘‘సినిమా పరిశ్రమతో నాకు అనుబంధమేమీ లేదు. కేవలం అభిరుచే ఇటు వైపు తీసుకొచ్చింది. నేను స్విట్జర్లాండ్‌లో బిజినెస్ అండ్ ఫైనాన్స్‌లో డిగ్రీ చేశాను. ఆ సమయంలో ఇండియన్ సినిమా గురించి ఓ థీసిస్ సమర్పించాను. ‘సినిమా ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్’ అనే అంశంపై కొంచెం పరిశోధన చేశాను. ఆ సమయంలోనే సినిమాపై మరింత ప్రేమ పెరిగింది. దీంతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టా. ప్రస్తుతం ‘రఫ్’ హడావుడిలోనే ఉన్నాం. తదుపరి సినిమా కోసం రెండు కథలు సిద్ధం చేశాం. ఒకటి కుటుంబ కథ, మరొకటి ఆఫ్ బీట్ సినిమా చేయబోతున్నాం.