ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది | Rough is a dream come true: Ch Subba Reddy | Sakshi
Sakshi News home page

ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది

Dec 1 2014 10:42 PM | Updated on Sep 2 2017 5:28 PM

ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది

ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది

‘‘కొత్త దర్శకుడినైనా... తొలిసారి కథ చెప్పగానే హీరో ఆది సినిమా చేయడానికి అంగీకరించారు. నాపై పూర్తి నమ్మకాన్ని కనబరిచారు

 ‘‘కొత్త దర్శకుడినైనా... తొలిసారి కథ చెప్పగానే హీరో ఆది సినిమా చేయడానికి అంగీకరించారు. నాపై పూర్తి నమ్మకాన్ని కనబరిచారు సాయికుమార్. వారిద్దరూ అందించిన ప్రోత్సాహంతోనే ‘రఫ్’ సినిమాని అంత బాగా తీయగలిగాను. కమర్షియల్ అంశాలతో కూడిన మాస్ సినిమా చేయడమంటేనే నాకు ఇష్టం. తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సీహెచ్ సుబ్బారెడ్డి. సహాయ దర్శకునిగా కెరీర్‌ని ఆరంభించిన ఆయన ‘రఫ్’తో దర్శకుడయ్యారు. ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా అభిలాష్ మాధవరం నిర్మాణంలో రూపొందిన ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎమ్. సుదర్శన్‌రావు సమర్పించారు. చిత్ర దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలివీ...
 
 ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ‘రఫ్’
 తొమ్మండుగురు దర్శకుల దగ్గర పదకొండు చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాను. ఆ అనుభవం నా తొలి సినిమాకి బాగా పనికొచ్చింది. ఎక్కడా ఇబ్బంది పడకుండా ‘రఫ్’ చిత్రాన్ని తెరకెక్కించగలిగానంటే కారణం అదే. ‘అశోక్’, ‘గుడుంబా శంకర్’ లాంటి చిత్రాలకు నేను సహాయ దర్శకునిగా పనిచేశాను. వాటి ప్రభావం నాపై ఎక్కువగా ఉంటుంది. అందుకే మాస్ సినిమాల్ని చేయడానికే ఇష్టపడుతుంటాను. ఆ ఆలోచనలకి ప్రతిరూపమే ‘రఫ్’. అందరూ కలిసి చూసేలా ఉండాలని కథ రాసుకున్నా. అభిలాష్ మాధవరం కథని నమ్మి ఈ సినిమా నిర్మించారు. కమర్షియల్‌గా సినిమా మంచి ఫలితాన్ని సాధించిందంటే కారణం నిర్మాతే. బి, సి కేంద్రాల్లో చిత్రానికి లభిస్తున్న స్పందన చాలా బాగుంది. యాక్షన్, వినోదం, కుటుంబ అనుబంధాలు... ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది. మొత్తంగా ‘రఫ్’ రూపంలో ఒక మంచి సినిమా చేశామన్న తృప్తి లభించింది.
 
 
 శ్రీహరి నన్ను మెచ్చుకున్నారు!
 సినిమా కోసం ఆది పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రెండేళ్ల ప్రయాణంలో ఆయన ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఎనిమిది నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశారు. ఆ సన్నివేశాల్లో ఆది నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఆదిలోని మాస్ హీరోని బయటికి చూపించగలిగాను. ఆయన ఈ సినిమా కోసం పడిన కష్టం వృథా కాలేదు. శ్రీహరి గారు మరో పిల్లర్‌లా ఈ సినిమాని మోశారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత మళ్లీ అంత మంచి పాత్ర ఇచ్చావ్... అంటూ ఆయన నన్ను మెచ్చుకొంటూ, ప్రోత్సహిస్తూ ఈ సినిమా చేశారు. ఆయన సలహాలతోనే ఈ సినిమా బయటకు రాగలిగింది. మేం స్విట్జర్లాండ్‌లో పాటలు చిత్రీకరించాలని వెళుతుంటే... శ్రీహరి గారు ఇంటికి పిలిపించి ‘ముందు నాపై సన్నివేశాలు తీయండి, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌కి వెళ్లండి’ అని చెప్పారు. దీంతో ముందుగా ఆయన సన్నివేశాల్ని తీశాం. ఈ రోజు శ్రీహరి గారు మా మధ్య లేకపోవడం బాధగా ఉంది.
 
 ఆయనలా స్టయిలిష్‌గా తీశానంటున్నారు!
 నేను ఎవరి దగ్గరైతే పని చేశానో వారందరి ప్రభావం నాపై చాలా ఉంది. ‘రఫ్’ చూసినవాళ్లు ‘మీ గురువు సురేందర్ రెడ్డిలా స్టైలిష్ సినిమా తీశావ్’ అని కొద్దిమంది అన్నారు. ఆ కామెంట్ నాకు తృప్తినిచ్చింది. ఏదైతే అనుకొన్నామో అది పక్కాగా తెరపైకి తీసుకురావాలనేది నా అభిమతం. అందుకోసం ఎంతైనా కష్టపడతాను. తర్వాత కూడా ‘రఫ్’ లాంటి కమర్షియల్ సినిమాలే చేస్తాను. రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే నా రెండో చిత్రం వివరాల్ని ప్రకటిస్తా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement