
భవిష్యత్తులో ఎలాంటి సినిమానైనా నిర్మించగలననే ధైర్యాన్నిచ్చింది రఫ్
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అటు యువతరానికీ, ఇటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఓ మంచి సినిమా తీయాలనుకున్నాం.
‘‘క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అటు యువతరానికీ, ఇటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఓ మంచి సినిమా తీయాలనుకున్నాం. ‘రఫ్’తో ఆ ప్రయత్నం నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అభిలాష్ మాధవరం. శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘రఫ్’. ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించారు. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. యమ్. సుదర్శన్‌రావు సమర్పకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ప్రారంభ వసూళ్లను తెచ్చిపెట్టిందంటున్న అభిలాష్ మాధవరంతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివి...
మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘రఫ్’. కథలో అందరినీ అలరించే అంశాలున్నాయి. అందుకే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బి, సి కేంద్రాల్లో సినిమాకి చక్కటి ఆదరణ దక్కుతోంది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు ఇదొక యావరేజ్ సినిమానే అయినప్పటికీ...వాళ్లు కూడా ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్నారు. మౌత్ టాక్‌తో ఇంకా వసూళ్లు పెరుగుతాయని మా నమ్మకం. దర్శకుడు సుబ్బారెడ్డి ఎక్కడా తడబాటు లేకుండా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథని నమ్మి చేసిన చిత్రమిది. దర్శకుడు తొలిసారి కథ చెప్పినప్పుడే సినిమాపై మాకు నమ్మకం కలిగింది. ఆయన ఏం చెప్పాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. ఆది, రకుల్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
రెండేళ్ల ప్రయాణం ఈ సినిమా. నిర్మాతగా నాకు ఇదే తొలి చిత్రం. చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా చిత్రాన్ని పూర్తి చేశాం. నిర్మాతగా ఒక మంచి అనుభవాన్నిచ్చిందీ సినిమా. భవిష్యత్తులో ఎలాంటి సినిమానైనా నిర్మించగలననే ధైర్యాన్నిచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేను. మణిశర్మ, సెంథిల్ కుమార్, అరుణ్ కుమార్ లాంటి సాంకేతిక బృందంతో కలిసి మేం పనిచేశామని చెప్పుకోవడం కంటే... వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నానని చెబుతాను. సినిమా కోసం ఆది పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎనిమిది నెలల పాటు తను కఠోరంగా శ్రమించి సిక్స్ ప్యాక్ చేశాడు.
తన ప్రతిభా పాటవాలన్నీ ఈ సినిమా కోసం ఉపయోగించాడు. ‘‘సినిమా పరిశ్రమతో నాకు అనుబంధమేమీ లేదు. కేవలం అభిరుచే ఇటు వైపు తీసుకొచ్చింది. నేను స్విట్జర్లాండ్‌లో బిజినెస్ అండ్ ఫైనాన్స్‌లో డిగ్రీ చేశాను. ఆ సమయంలో ఇండియన్ సినిమా గురించి ఓ థీసిస్ సమర్పించాను. ‘సినిమా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రిటర్న్’ అనే అంశంపై కొంచెం పరిశోధన చేశాను. ఆ సమయంలోనే సినిమాపై మరింత ప్రేమ పెరిగింది. దీంతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టా. ప్రస్తుతం ‘రఫ్’ హడావుడిలోనే ఉన్నాం. తదుపరి సినిమా కోసం రెండు కథలు సిద్ధం చేశాం. ఒకటి కుటుంబ కథ, మరొకటి ఆఫ్ బీట్ సినిమా చేయబోతున్నాం.