అర్చకులను పరుగులు తీయించిన పాములు
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ప్రముఖ శ్రీవల్లీదేవసేన సమేత వీర వేంకట కుమార త్రిముఖ లింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రెండు పాములు హల్చల్ చేశాయి. ఇవి గర్భగుడిలో ప్రవేశించడంతో స్వామి నిత్యపూజలకు ఆటంకం కలిగింది. ఆలయ పురోహితులు కైతేపల్లి దత్తప్రసన్న శర్మ, శ్యాం సుందర్ శర్మ కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం పురోహితులు ఆలయాన్ని తెరిచి గర్భగుడిలోకి ప్రవేశించారు. స్వామివారిని శుభ్రపరిచి నిత్య పూజలు, అభిషేకాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలో రెండు పాములు గర్భాలయంలో లింగాకారంలో ఉన్న కుమారస్వామి విగ్రహం వద్ద తిరుగుతూ కనిపించాయి. దీంతో భయపడిన పురోహితులు బయటకు పరుగులు తీశారు.
కొంతసేపటి తర్వాత అభిషేకాల కోసం వచ్చిన భక్తుల సాయంతో పాములను బయటకు తరిమేందుకు యత్నించారు. వాటిని బయటకు రప్పించడానికి వస్త్రాలను కాల్చి పొగబెట్టారు. తొలుత రెండు పాములు కనిపించగా ఓ పాము గోడకు ఉన్న కన్నంలో దూరి ఉండిపోయింది. ఇక చేసేది లేక నిత్య అభిషేక పూజలను అంతరాలయంలోని ఉత్సవ విగ్రహానికి చేశారు. అనంతరం రంధ్రంలోకి నీటిని కొట్టడంతో పాము బయటకొచ్చింది. దీనిని స్థానికుడొకరు పట్టుకుని దూరంగా విడిచిపెట్టారు.