breaking news
sprinkled
-
మురుగులో మెరుపులు.. ఆకలిలో ఆశలు
నెల్లూరు: ముక్కు పుటరాలు అదిరే మురుగులో స్వర్ణ రేణువుల కోసం.. నిత్యం ఆకలి ఆశలు జల్లెడ పడుతుంటాయి. ఈ విభిన్న జీవన వాస్తవాలకు అద్దం పట్టే దృశ్యం నెల్లూరులోని కాపువీధిలో నిత్యం కనిపిస్తోంది. ఇక్కడ బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణాలు వరుసగా ఉంటాయి. మెరిసే ఉంగరాలు, కంఠహారాలు సిద్ధమైన తర్వాత మిగిలిపోయే సూక్ష్మ బంగారు రేణువులు వేస్ట్‌గా కాలువల్లోకి వెళ్లిపోతాయి. అవే నగరానికి చెందిన కొన్ని కుటుంబాలకు జీవనాధారం. ఆ పేదలు పొట్ట నింపుకోవడానికి రోజూ ఆకలి పోరాటం చేస్తుంటారు. మురుగు కాలువ వెంబడి నడిచే వారు ముక్కు మూసుకునే వెళ్లేవారెందరో... అయితే అదే కాలువల్లో పేరుకుపోయిన మట్టిని చేతులతో తీసి, జల్లెడ పట్టి, అందులో బంగారపు కణాలు చిక్కుతాయేమోనని వెతుకుతుంటారు. ఈ దృశ్యాలు వారి ఆకలి పోరాటాని, జీవిత వాస్తవానికి దర్పణంగా నిలుస్తాయి. -
రాజమండ్రి జైలు ఖైదీలకు పుష్కరభాగ్యం
రాజమండ్రి: గోదావరి మహాపుష్కరాల సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోని సుమారు 1500 మంది ఖైదీలు పుష్కర స్నానంతో పునీతులయ్యారు. ఏంటీ, వాళ్లంతా ఒకేసారి గోదావరికి వెళ్లి స్నానాలు చేశారని అనుకుంటున్నారా? కాదు.. మరెలా అంటే.. ఈ మహాపుష్కరాల సందర్భంగా అందరిలాగే ఖైదీలు కూడా గోదాట్లో స్నానం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా జైలు అధికారులకు ఓ వినతిపత్రం ఇచ్చారు. 500 మంది మహిళా ఖైదీలతో సహా సుమారు 1500 మంది ఖైదీలు తమకు పుష్కర స్నాన పుణ్యం ప్రసాదించమంటూ అర్జీ పెట్టుకున్నారు. అయితే వీరందరికీ భద్రత కల్పించడం కష్టమనే కారణంతో జైలు అధికారులు అనుమతిని నిరాకరించారు. దాంతో అహోబిలం మఠం వారు స్పందించారు. పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి ఖైదీల మీద చిలకరించారు. అలా ఆ ఖైదీలంతా మహా పుష్కరాల్లో స్నానం చేసిన పుణ్య ఫలాన్ని దక్కించుకున్నారన్నమాట. కేవలం భద్రతా కారణాల రీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని జైలు సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు.


