breaking news
Special Protection
-
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన చట్టాలను అందుబాటులోకి తెచ్చి రక్షణ కల్పించడమే మహిళా కమిషన్ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు త్రిపురాన వెంకటరత్నం అన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్‌ను నియమించినట్టు తెలిపారు. కమిటీలో ఒక చైర్పర్సన్, ఆరుగురు మహిళా సభ్యులు ఉంటారని తెలిపారు. కమిటీ సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు అధికారాలు కలిగి ఉంటుందని తెలిపారు. వరకట్నం వేధింపులు, గృహ హింస, లైంగిక వేధింపులపై కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు తదితర సర్వీసుకు సంబంధించి మహిళలకు అన్యా యం జరిగినట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరకట్నం, గృహహింస వేధింపులపై పోలీసు సూపరింటెండెంట్‌కు లేఖ రాసిన వారంలోగా విచారణ చేయిస్తామన్నారు. లైంగికదాడి బాధితులకు వైద్యసహాయం చేస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా విడతల వారీగా ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. మారుమూల గ్రామీణ మహిళలకు న్యాయం చేస్తామని, టెలిఫోన్, లేఖలు, మెయిల్ ద్వారా తమకు బాధితులు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులను స్వయంగా చదివి సంబంధిత శాఖలకు చర్యల నిమిత్తం పంపిస్తున్నట్టు వెల్లడించారు. పతి ప్రభుత్వ కార్యాలయంలోను ఒక సీనియర్ అధికారి, ఒక ఎస్‌జీఓలతో ఇంటర్నల్ ఇంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కళాశాలల్లో యుక్తవయసు యువతీ, యువకులు కోసం సైకాలజిస్టులచే ప్రత్యేక సలహాలు, సూచనలు అందించాలన్నారు. జిల్లాలో మహిళల కోసం స్వాధాన్ హోమ్ మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. ఇటీవల విద్యా వ్యవస్థ విభిన్నంగా మారిందని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. రాజ్యసభలో పాస్ అయిన మహిళా బిల్లు లోక్‌సభలో ఆమోదానికి కృషి చేస్తున్నామ్నారు. యువత సంప్రదాయాలను తెలుసుకుని క్రమశిక్షణతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు విస్తారంగా మహిళా చట్టాలపైన, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై విసృ్తత ప్రచారం చేస్తామని తెలిపారు. విలువలతో కూడిన సమాజం నిర్మాణానికి వ్యక్తిగత క్రమశిక్షణ అవసరమని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆమెతో పాటు కమిటీ సభ్యురాల ఎం.కస్తూరి ఉన్నారు. ఆదిత్యుడిని దర్శించుకున్న త్రిపురాన అరసవల్లి: ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాణస్వామి వారిని త్రిపురాన వెంకట రత్నం గురువారం ఉదయం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆమెకు స్వామివారి ఆశీర్వచనాలు, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.