breaking news
smartphones theft
-
నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!
సాగర్ (మధ్యప్రదేశ్): కోట్లు విలువచేసే స్మార్ట్ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్‌ను నలుగురు దొంగలు లూటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా మహరాజ్‌పూర్ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. అయితే ఆ ఫోన్లన్నింటినీ 24 గంటల్లోపే పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మాత్రం పారిపోయారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన ఈ మొబైల్ ఫోన్లను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా హరియాణాలోని గురుగ్రామ్‌కు తీసుకెళ్తున్నారు. ట్రక్కును గురువారం రాత్రి నలుగురు దుండగులు అడ్డుకుని డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. నరసింగాపూర్ వద్ద అతన్ని దింపేసి ఫోన్లను కంటైనర్ నుంచి తమ ట్రక్కులోకి మార్చుకుని పారిపోయారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలికి 400 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డగించడంతో ట్రక్కును వదిలేసి పారిపోయారు. మొత్తం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్ చెప్పారు. -
అందంగా కారులో వచ్చి.. ఫోన్లు కొట్టేస్తోంది!
ఆమె అందమైన యువతి.. మహా అయితే పాతికేళ్లు ఉంటాయేమో. ఖరీదైన హోండా బ్రయో కారులో వస్తోంది. మంచి బ్రాండెడ్ దుస్తులు, వాటికి మ్యాచ్ అయ్యే చెవి రింగులు, గాజులు అన్నీ పెట్టుకుంటుంది. బ్రహ్మాండంగా ఇంగ్లీషు మాట్లాడుతుంది. అంతవరకు బాగానే ఉంది గానీ.. అమాయకులైన కుర్రాళ్ల మీద వల విసిరి.. వాళ్ల చేతుల్లో ఉన్న ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను తీసుకుని పారిపోతోంది!! ఈ వెరైటీ దొంగ యువతి బాధితులంతా పోలీసులను ఆశ్రయించడంతో వాళ్లు ఆ లేడీ కిలాడీని పట్టుకోడానికి రంగంలోకి దిగారు. ఆ యువతి కారులో వచ్చి, చేతిలో మంచి ఫోన్ ఉన్న యువకుల పక్కనే ఆపుతోంది.. కారు అద్దం దించి ఏదో ఒక ఎడ్రస్ చెప్పి అక్కడకు ఎలా వెళ్లాలని అడుగుతుంది. పనిలో పనిగా తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని, ఒక్క కాల్ చేసుకుంటానని చెప్పి వాళ్ల ఫోన్లు తీసుకుంటుంది. అప్పటికే స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న కారును ఒక్కసారిగా ముందుకు దూకించి ఆ ఫోనుతో సహా పారిపోతోంది. ఆమెను పట్టుకోడానికి ఇప్పటికి నాలుగు బృందాలను పోలీసులు నియమించినా, ఇంకా ఆమె దొరకలేదు. గత మూడు రోజుల్లోనే నలుగురు కుర్రాళ్లు ఆమె చేతివాటం బారిన పడి లబోదిబోమంటున్నారు. తాజాగా ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఆమె తన చేతివాటం చూపించింది. ఆమె నిజంగానే ఏదో ఇబ్బందిలో ఉందనుకున్నానని, ఆమె చాలా చదువుకున్న దానిలాగే కనిపించిందని, అత్యవసరంగా తనవాళ్లకు ఫోన్ చేసుకోవాలని చెబితే తన ట్యాబ్ ఇచ్చానని.. తీరా ఆమె కాస్తా అది తీసుకుని వెళ్లిపోయిందని చేతన అనే విద్యార్థిని తెలిపింది. టాబ్ ఆమెకు ఇచ్చిన తర్వాత దగ్గరగా కూడా వెళ్లకుండా.. ఆమెను గౌరవించాలని కొంత దూరంలోనే నిలబడ్డానని, ఆమె కాల్ చేస్తున్నట్లు నటించి, అంతలోనే ఎక్సలేటర్ తొక్కి.. పారిపోయిందని, తాను ఆమెను వెంబడించేందుకు ప్రయత్నించినా దొరకలేదని చేతన వివరించింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయగా.. మరికొద్ది నిమిషాల్లోనే అలాంటిదే మరో ఫిర్యాదు వచ్చింది. అక్కడ మొబైల్ ఫోన్ పోయింది. కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన ముఖర్జీ నగర్లో విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని ఈ యువతి విజృంభిస్తోంది.