breaking news
smart card distribution
-
దోపిడీలో స్మార్ట్ రి‘కార్డు’
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాంకేతికత పేరుతో నిత్యం ప్రజలను మోసం చేస్తోంది. టెక్నాలజీ సాయంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామంటూ కోతలు కోస్తోంది. ఇందులో భాగంగానే ప్రజా పంపిణీ వ్యవస్థలో (పీడీఎస్) ‘స్మార్ట్ కార్డుల పంపిణీ’ని ఘనకీర్తిగా ప్రచారం చేసుకుంటూ అభాసుపాలవుతోంది. వాస్తవానికి, ప్రభుత్వం కొత్తగా పంపిణీ చేసే కార్డులు పేరుకే స్మార్ట్.. అందులో ఎటువంటి సాంకేతికతను అనుసంధానించే చిప్ వ్యవస్థ లేదు. చిన్న సైజులో కార్డులను ముద్రించి దానికి సాంకేతిక పరిభాషలోని ‘స్మార్ట్’ను జోడించి లబ్ధిదారులను మభ్యపెడుతోంది. దీని కోసం ఏకంగా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయడం గమనార్హం. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల లబ్ధిదారులకు కొత్త కార్డుల పంపిణీ చేపట్టనుంది. అదనపు లబ్ధి శూన్యం! కేంద్ర ప్రభుత్వం పీడీఎస్‌ను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించింది. వన్ నేషన్.. వన్ రేషన్ నినాదాన్ని తీసుకొచి్చంది. అంటే, వేలిముద్ర వేసి దేశంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఆధార్ నంబర్ ద్వారా కూడా రేషన్ పొందొచ్చు. కేవలం ప్రభుత్వంలోని అమాత్యులు, కొందరు అధికారులు కమీషన్ల కోసం ఇలాంటి కొత్త ఆలోచనలను సృష్టించి స్మార్ట్‌గా వెనకేసుకుంటున్నట్టు వినికిడి. పైగా పాత కార్డులో కుటుంబ సమేతంగా రేషన్ లబ్దిదారులు ఫొటోలు ఉండేవి. స్మార్ట్ కార్డులో ఇంటి యజమానురాలి పాస్‌పోర్టు సైజు ఫొటో తప్ప ఇతరులు కనిపించరు. కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. అది కూడా మూడు పేర్ల వరకు బాగానే కనిపిస్తాయి. అంతకు మించి ఎక్కవ మంది లబ్దిదారులు ఒకే కార్డులో ఉంటే వారి పేర్లు కుచించుకుపోవడం, లేదా లేకుండా ఉండటమే ఈ స్మార్టు కార్డు ప్రత్యేకత. దీనికి ఒక క్యూఆర్ కోడ్‌ను పెట్టి మిగిలిన వారి పేర్లు అందులో జోడిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి, ఈ–పోస్ మెషిన్‌కు, బియ్యం తూకం వేసే ఎలక్ట్రిక్ కాటాకు అనుసంధానం ఉండాలి. లబ్ధిదారుడి వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ కాటాలో సరైన తూకంలో బియ్యం వేస్తేనే ఈపోస్ మెషిన్ అంగీకరించి లావాదేవీని అనుమతిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిబంధన మేరకు ప్రవేశపెట్టిన ప్రక్రియ. కానీ, కూటమి పాలనలో కొందరు డీలర్లు ఈ–పోస్ మెషిన్లను చేతుల్లో పెట్టుకుని తిరుగుతూ ఇష్టారీతిలో పీడీఎస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే.. ప్రభుత్వం బయట గొప్పలు చెప్పుకుంటోంది. స్మార్ట్ కోతలు.. పంపిణీలోనూ కోతలే! రేషన్ సరుకుల పంపిణీలోనూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఒక్క బియ్యం మినహా మరే సరుకులూ ఇవ్వడం లేదు. కందిపప్పు, పామాయిల్, చింతపండు, గోధుమ పిండి తదితర సరుకులన్నీ ఎక్కడా ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం 18 రకాల నిత్యావసరాలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా, అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం ఇస్తున్న సరుకులన్నింటినీ ఆపేశారు. రూ.220 కోట్లకుపైగా కందిపప్పు బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు సరఫరాకు కూడా ముందుకు రావట్లేదు. -
ముంగిట్లో ఆసరా!
‘ఆసరా’ లబ్ధిదారులకు శుభవార్త. బ్యాంకు ఖాతాలోని నగదును ఏటీఎం ద్వారా తీసుకునే తరహాలో.. ఆసరా పింఛన్లను అందించేందుకు యంత్రాంగం అడుగులు వేస్తోంది. నెలకోసారి సొంత గ్రామ పంచాయతీ వద్దకు పరుగెత్తకుండా.. అందుబాటులో ఉన్న గ్రామంలోనే పింఛన్లు అందుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ దిశగా జిల్లా యంత్రాంగం ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపమిస్తే త్వరలోనే లబ్ధిదారులకు పెద్ద ఊరట కలుగనుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఆసరా పథకం కింద 2,75,586 మందికి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఈ జారీ ప్రక్రియ అంతా సాధారణ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారుల అర్హత కార్డులను పరిశీలించి వివరాలు రిజిస్టర్లో నమోదు చేసుకున్న అనంతరం వారికి పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. ఇదంతా అధికారగణానికి తలనొప్పి కావడంతోపాటు అక్రమాలకు ఊతమిచ్చినట్లు అవుతోంది. ఈ పరిస్థితిని అధిగమించి.. అసలైన లబ్ధిదారుడికే ఆసరా అందించాలనే లక్ష్యంతో కలెక్టర్ రఘునందన్‌రావు సరికొత్త ఆలోచన చేశారు. గతంలో పాటించిన స్మార్ట్‌కార్డ్ పంపిణీ కంటే మెరుగైన పద్ధతిని అనుసరించి పూర్తిగా బయోమెట్రిక్ విధానంతో పింఛన్లు అందించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో అవకతవకలకు కళ్లెం వేయడంతోపాటు రిజిస్టర్ల నమోదు ప్రక్రియకు స్వస్తి పలికేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆధార్ అనుసంధానం చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల్లో ‘ఆధార్’ విశిష్ట గుర్తింపు సంఖ్యను కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆసరాకూ ఆధార్‌ను జోడించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. సంబంధిత అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల నుంచి ఆధార్, యూఐడీ సంఖ్యను సేకరించి కంప్యూటరీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పింఛన్ల పంపిణీ కోసం తలపెట్టే కొత్త పద్ధతిలో ఆధార్ సంఖ్య ద్వారానే బయోమెట్రిక్ పద్ధతిలో పింఛన్లు అందిస్తారు. ఈ క్రమంలో లబ్ధిదారుల వేలిముద్రలు తప్పనిసరి కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం సొంత గ్రామ పంచాయతీ పరిధిలోనే పింఛన్లు తీసుకోవాలనే నిబంధనలు సైతం మారనున్నాయి. జిల్లాలో ఏచోట నుంచైనా లబ్ధిదారుడు పింఛన్ పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులకు క్యూలో గంటలతరబడి వేచి ఉండాల్సి అవసరం ఉండదు. అంతేగాకుండా వృద్దులు ముఖ్యంగా మగ సంతానం లేని మహిళ లు/పురుషులు తమ పిల్లలుండే చోటకు నెలలతరబడి పోయే అవకాశమున్నందున.. ప్రతి నెలా వారు స్వగ్రామానికి వచ్చి పింఛన్ తీసుకునే బాధ తప్పుతుంది. కలెక్టర్ చొరవ.. ‘ఆధార్’ వినియోగంపై స్పష్టమైన అవగాహన, సెర్ప్‌లో పనిచేసిన విశేష అనుభవం ఉన్న కలెక్టర్ రఘునందన్‌రావు.. పింఛన్ల జారీలో అక్రమాలకు ముకుతాడు వేసే అంశంపై ఇప్పటికే కింది స్థాయి అధికారులతో చర్చించారు. కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లోకి లబ్ధిదారులను చేర్చడం, ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తికాగానే.. సరికొత్త విధానం అమలుచేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదే శ్ ప్రభుత్వం కూడా ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టే అంశం, కమీషన్ చెల్లింపుపై బ్యాంకులతో చర్చిస్తున్నందున.. ఆ చర్చల సారాంశానికి అనుగుణంగా ఇక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ విధానం అమలుతో పింఛన్ల పంపిణీలో పారదర్శకత పాటించవచ్చని గట్టిగా విశ్వసిస్తున్న కలెక్టర్ రఘునందన్‌రావు.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే చర్చించాలని యోచిస్తున్నారు.