
కొత్త రైస్ కార్డుల ఖర్చు రూ.8 కోట్లు
పేరుకే స్మార్ట్.. సాంకేతికత ఎక్కడ
నిత్యావసర సరుకులు అపేసి కొత్త కార్డులిస్తే సామాన్యులకు లాభమేంటి
కేవలం కమీషన్ల కోసమే కొత్త కార్డులు ఇస్తున్న ప్రభుత్వం
కొత్త కార్డుల పంపిణీని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కూటమి
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాంకేతికత పేరుతో నిత్యం ప్రజలను మోసం చేస్తోంది. టెక్నాలజీ సాయంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామంటూ కోతలు కోస్తోంది. ఇందులో భాగంగానే ప్రజా పంపిణీ వ్యవస్థలో (పీడీఎస్) ‘స్మార్ట్ కార్డుల పంపిణీ’ని ఘనకీర్తిగా ప్రచారం చేసుకుంటూ అభాసుపాలవుతోంది.
వాస్తవానికి, ప్రభుత్వం కొత్తగా పంపిణీ చేసే కార్డులు పేరుకే స్మార్ట్.. అందులో ఎటువంటి సాంకేతికతను అనుసంధానించే చిప్ వ్యవస్థ లేదు. చిన్న సైజులో కార్డులను ముద్రించి దానికి సాంకేతిక పరిభాషలోని ‘స్మార్ట్’ను జోడించి లబ్ధిదారులను మభ్యపెడుతోంది. దీని కోసం ఏకంగా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయడం గమనార్హం. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల లబ్ధిదారులకు కొత్త కార్డుల పంపిణీ చేపట్టనుంది.
అదనపు లబ్ధి శూన్యం!
కేంద్ర ప్రభుత్వం పీడీఎస్‌ను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించింది. వన్ నేషన్.. వన్ రేషన్ నినాదాన్ని తీసుకొచి్చంది. అంటే, వేలిముద్ర వేసి దేశంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఆధార్ నంబర్ ద్వారా కూడా రేషన్ పొందొచ్చు. కేవలం ప్రభుత్వంలోని అమాత్యులు, కొందరు అధికారులు కమీషన్ల కోసం ఇలాంటి కొత్త ఆలోచనలను సృష్టించి స్మార్ట్‌గా వెనకేసుకుంటున్నట్టు వినికిడి. పైగా పాత కార్డులో కుటుంబ సమేతంగా రేషన్ లబ్దిదారులు ఫొటోలు ఉండేవి.
స్మార్ట్ కార్డులో ఇంటి యజమానురాలి పాస్‌పోర్టు సైజు ఫొటో తప్ప ఇతరులు కనిపించరు. కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. అది కూడా మూడు పేర్ల వరకు బాగానే కనిపిస్తాయి. అంతకు మించి ఎక్కవ మంది లబ్దిదారులు ఒకే కార్డులో ఉంటే వారి పేర్లు కుచించుకుపోవడం, లేదా లేకుండా ఉండటమే ఈ స్మార్టు కార్డు ప్రత్యేకత. దీనికి ఒక క్యూఆర్ కోడ్‌ను పెట్టి మిగిలిన వారి పేర్లు అందులో జోడిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి, ఈ–పోస్ మెషిన్‌కు, బియ్యం తూకం వేసే ఎలక్ట్రిక్ కాటాకు అనుసంధానం ఉండాలి.
లబ్ధిదారుడి వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ కాటాలో సరైన తూకంలో బియ్యం వేస్తేనే ఈపోస్ మెషిన్ అంగీకరించి లావాదేవీని అనుమతిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిబంధన మేరకు ప్రవేశపెట్టిన ప్రక్రియ. కానీ, కూటమి పాలనలో కొందరు డీలర్లు ఈ–పోస్ మెషిన్లను చేతుల్లో పెట్టుకుని తిరుగుతూ ఇష్టారీతిలో పీడీఎస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే.. ప్రభుత్వం బయట గొప్పలు చెప్పుకుంటోంది.
స్మార్ట్ కోతలు.. పంపిణీలోనూ కోతలే!
రేషన్ సరుకుల పంపిణీలోనూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఒక్క బియ్యం మినహా మరే సరుకులూ ఇవ్వడం లేదు. కందిపప్పు, పామాయిల్, చింతపండు, గోధుమ పిండి తదితర సరుకులన్నీ ఎక్కడా ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం 18 రకాల నిత్యావసరాలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా, అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం ఇస్తున్న సరుకులన్నింటినీ ఆపేశారు. రూ.220 కోట్లకుపైగా కందిపప్పు బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు సరఫరాకు కూడా ముందుకు రావట్లేదు.