ముంగిట్లో ఆసరా! | Aasara soonly reached people | Sakshi
Sakshi News home page

ముంగిట్లో ఆసరా!

Feb 18 2015 8:43 AM | Updated on Mar 28 2018 11:11 AM

‘ఆసరా’ లబ్ధిదారులకు శుభవార్త. బ్యాంకు ఖాతాలోని నగదును ఏటీఎం ద్వారా తీసుకునే తరహాలో.. ఆసరా పింఛన్లను అందించేందుకు యంత్రాంగం అడుగులు వేస్తోంది.

 ‘ఆసరా’ లబ్ధిదారులకు శుభవార్త. బ్యాంకు ఖాతాలోని నగదును ఏటీఎం ద్వారా తీసుకునే తరహాలో.. ఆసరా పింఛన్లను అందించేందుకు యంత్రాంగం అడుగులు వేస్తోంది. నెలకోసారి సొంత గ్రామ పంచాయతీ వద్దకు పరుగెత్తకుండా.. అందుబాటులో ఉన్న గ్రామంలోనే పింఛన్లు అందుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ దిశగా జిల్లా యంత్రాంగం ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపమిస్తే త్వరలోనే లబ్ధిదారులకు పెద్ద ఊరట కలుగనుంది.
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఆసరా పథకం కింద 2,75,586 మందికి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఈ జారీ ప్రక్రియ అంతా సాధారణ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారుల అర్హత కార్డులను పరిశీలించి వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేసుకున్న అనంతరం వారికి పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. ఇదంతా అధికారగణానికి తలనొప్పి కావడంతోపాటు అక్రమాలకు ఊతమిచ్చినట్లు అవుతోంది. ఈ పరిస్థితిని అధిగమించి.. అసలైన లబ్ధిదారుడికే ఆసరా అందించాలనే  లక్ష్యంతో కలెక్టర్ రఘునందన్‌రావు సరికొత్త ఆలోచన చేశారు. గతంలో పాటించిన స్మార్ట్‌కార్డ్ పంపిణీ కంటే మెరుగైన పద్ధతిని అనుసరించి పూర్తిగా బయోమెట్రిక్ విధానంతో పింఛన్లు అందించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో అవకతవకలకు కళ్లెం వేయడంతోపాటు రిజిస్టర్ల నమోదు ప్రక్రియకు స్వస్తి పలికేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు.
 
 
ఆధార్ అనుసంధానం చేసి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల్లో ‘ఆధార్’ విశిష్ట గుర్తింపు సంఖ్యను కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆసరాకూ ఆధార్‌ను జోడించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. సంబంధిత అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల నుంచి ఆధార్, యూఐడీ సంఖ్యను సేకరించి కంప్యూటరీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పింఛన్ల పంపిణీ కోసం తలపెట్టే కొత్త పద్ధతిలో ఆధార్ సంఖ్య ద్వారానే బయోమెట్రిక్ పద్ధతిలో  పింఛన్లు అందిస్తారు. ఈ క్రమంలో లబ్ధిదారుల వేలిముద్రలు తప్పనిసరి కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం సొంత గ్రామ పంచాయతీ పరిధిలోనే పింఛన్లు తీసుకోవాలనే నిబంధనలు సైతం మారనున్నాయి. జిల్లాలో ఏచోట నుంచైనా లబ్ధిదారుడు పింఛన్ పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులకు క్యూలో గంటలతరబడి వేచి ఉండాల్సి అవసరం ఉండదు. అంతేగాకుండా వృద్దులు ముఖ్యంగా మగ సంతానం లేని మహిళ లు/పురుషులు తమ పిల్లలుండే చోటకు నెలలతరబడి పోయే అవకాశమున్నందున.. ప్రతి నెలా వారు స్వగ్రామానికి వచ్చి పింఛన్ తీసుకునే బాధ తప్పుతుంది.
 
కలెక్టర్ చొరవ..
‘ఆధార్’ వినియోగంపై స్పష్టమైన అవగాహన, సెర్ప్‌లో పనిచేసిన విశేష అనుభవం ఉన్న కలెక్టర్ రఘునందన్‌రావు.. పింఛన్ల జారీలో అక్రమాలకు ముకుతాడు వేసే అంశంపై ఇప్పటికే కింది స్థాయి అధికారులతో చర్చించారు. కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లోకి లబ్ధిదారులను చేర్చడం, ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తికాగానే.. సరికొత్త విధానం అమలుచేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదే శ్ ప్రభుత్వం కూడా ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టే అంశం, కమీషన్ చెల్లింపుపై బ్యాంకులతో చర్చిస్తున్నందున.. ఆ చర్చల సారాంశానికి అనుగుణంగా ఇక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ విధానం అమలుతో పింఛన్ల పంపిణీలో పారదర్శకత పాటించవచ్చని గట్టిగా విశ్వసిస్తున్న కలెక్టర్ రఘునందన్‌రావు.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే చర్చించాలని యోచిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement