breaking news
shooting practice
-
సిద్ధిఖీ కేసు: ‘యూట్యూబ్ చూసి నిందితుల గన్ షూటింగ్ ప్రాక్టిస్’
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీను హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు గుర్మైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్‌లు యూట్యూబ్ వీడియోలు చూసి షూట్ చేయడం నేర్చుకున్నారని ముంబై పోలీసుల వర్గాలు వెల్లడించాయి. ఈ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరీరాలో ఉన్న వారిని వెతకడానికి పోలీసులు బృందాలను గాలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ హత్య కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు. 7.62 ఎంఎం తుపాకీతో కూడిన ఓ నల్ల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.‘‘సిద్ధిఖీని గుర్తించడానికి నిందితులకు ఆయన ఫోటోను ఇచ్చారు. ఘటనకు 25 రోజుల ముందు నిందితులు ఆయన నివాసం, కార్యాలయాన్ని పరిశీలించారు. గుర్మైల్ సింగ్ , ధరమ్‌రాజ్ కశ్యప్ యూట్యూబ్ నుంచి షూటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. ముంబైలో బుల్లెట్ మ్యాగజైన్ లేకుండా గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేశారు’’ అని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.ఇక.. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్కు చెందిన 23 ఏళ్ల హరీష్‌కుమార్ బాలక్రామ్గా ఈ హత్యకేసులో నాలుగో నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు ఆర్థిక సహాయం అందించడం, లాజిస్టిక్స్‌ను సమన్వయం చేశాడని పోలీసులు తెలిపారు. బాలక్‌రామ్ పూణెలో స్క్రాప్ షాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు బాలక్రామ్గా స్క్రాప్ షాపులో పనిచేసేవారని పోలీసులు వెల్లడించారు.చదవండి: సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర -
ISSF Junior World Cup 2023 : గురి తప్పలేదు!
చిన్నప్పుడు విల్లు ఎక్కుపెట్టింది... లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు పిస్టల్ గురిపెట్టింది... వరుసగా పతకాలు సాధిస్తోంది. ఆ మధ్యలో రైఫిల్‌తో కూడా సాధన చేసింది... మేఘన సాదుల. ‘నాన్న దగ్గర వెపన్ చూస్తూ పెరిగాను మరి’... అంటూ... షూటింగ్ ప్రాక్టీస్... సాధించిన పతకాల గురించి చెప్పింది. హైదరాబాద్‌లో బీటెక్ చేస్తున్న మేఘన సాదుల... అంతర్జాతీయ క్రీడాకారిణి. లక్ష్యానికి గురి పెట్టిందంటే పతకం తోనే వెనుదిరుగుతుంది. గడచిన జూన్‌లో సూల్ (జర్మనీ)లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది. అంతకంటే ముందు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్, భోపాల్‌లో జరిగిన నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటీషన్స్‌లోనూ పతకాలు సాధించింది, ఖేలో ఇండియా స్కీమ్‌కి కూడా ఎంపికైంది. ఈ నెలలో సౌత్‌కొరియాలో జరిగే పోటీల్లో పాల్గొననుంది. షూటింగ్లో బుల్లెట్లా దూసుకుపోతున్న మేఘన షూటింగ్ విషయాలతోపాటు తన ఇష్టాలు, అభిరుచులను సాక్షితో పంచుకుంది. నాన్నే నాకు ఆదర్శం మా నాన్న సారంగపాణి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతస్థాయి అధికారి. నాన్నే నా రోల్‌మోడల్. నాకు నాన్న వెపన్ మీద క్రేజ్ ఉండేది. కానీ యూనిఫామ్ సర్వీస్‌లోకి రావాలనే ఆసక్తి పెద్దగా కలగలేదు. బుల్లెట్ ఎలా లోడ్ చేస్తారు, ఎలా ఎయిమ్ చేస్తారనే ఆసక్తి పిల్లలకు సహజంగానే ఉంటుంది. అయితే నాకు సిక్స్త్ క్లాస్‌లో ఆర్చరీ (విలువిద్య) ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది. ఖమ్మం ఆర్చరీ అసోసియేషన్‌లో పుట్టా శంకరయ్య నా మెంటార్. టెన్త్‌క్లాస్ వరకు కంటిన్యూ చేశాను. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ట్వెల్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్న షూటింగ్ రేంజ్లో రైఫిల్ ప్రాక్టీస్ చేశాను. కానీ అదంత సీరియస్ ప్రాక్టీస్ కాదు. రోజూ పది నిమిషాలకంటే అవకాశం ఉండేది కాదు. సీరియస్‌గా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టింది మాత్రం కరోనా టైమ్‌లోనే. కలా... నిజమా! కరోనా టైమ్‌లో క్లాసులు ఆన్లైన్లో జరిగేవి. ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది. అప్పుడు మా కోచ్ ప్రసన్న కుమార్ సూచనతో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నేను పూర్తిస్థాయిలో పిస్టల్ షూటింగ్ ప్రారంభించిన నాటికి మూడు వారాల్లో రాష్ట్రస్థాయి పోటీలున్నాయి. ఆ పోటీల్లో పాల్గొనడం, గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం అంతా కలలా జరిగిపోయింది. అదే ఏడాది రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు రావడంతో నా మీద నాకు నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాను. ఉస్మానియా తరఫున ఆల్ ఇండియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. మనదేశం తరఫున ఆడటం గర్వంగా ఉంది. సాంత్వన అమ్మ ఫోన్‌తోనే! ఖేలో ఇండియా క్యాంప్‌లో మాకు సౌకర్యాలు చాలా బాగుంటాయి. నిపుణులు సూచించిన ఆహారం, ప్రాక్టీస్‌కు అనువైన వాతావరణం ఉంటుంది. నేను ఏమాత్రం షూటింగ్లో సరిగ్గా రాణించనట్లు అనిపించినా, మొదట చేసే పని అమ్మకు ఫోన్ చేయడమే. అమ్మ ఇచ్చే కౌన్సెలింగ్ నన్ను తిరిగి నా లక్ష్యం మీద దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. నా ప్రతి మూమెంట్లో మా అమ్మానాన్న, అన్నయ్య ఉంటారు. అన్నయ్య స్పెయిన్‌లో చదువుకుంటున్నాడు. పోటీల్లో పాల్గొనడం ఒకవైపు... ఇంజినీరింగ్‌లో క్లాసులు మరోవైపు... ఈ రెండింటినీ బాలెన్స్ చేయడం కష్టమవుతోంది. అందుకే బీటెక్‌లో ఓ ఏడాది విరామం తీసుకుని ప్రాక్టీస్ మీదనే దృష్టి పెట్టాను. షూటింగ్ లో అత్యున్నత స్థాయికి చేరాలనేది నా ఆకాంక్ష. ఆ తర్వాత బీటెక్ మైనింగ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, సివిల్ లేదా మైనింగ్ ఫీల్డ్‌లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనేది నా ఆశయం. ఇప్పటికైతే ఇదే, ఆ తర్వాత అభిప్రాయం మారవచ్చేమో’’ అని నవ్వేసింది మేఘన. సంగీతంతో స్నేహం ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఉంది. రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాను. మధ్యాహ్న భోజనం తర్వాత రెండు–మూడు గంటల విరామం. సాయంత్రం ఫిట్నెస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఏకాగ్రత సాధన కోసం మెడిటేషన్ చేస్తాను. ఉదయం షూటింగ్ తగ్గినప్పుడు సాయంత్రం ఓ గంట– రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్‌లో బాగా రాణించినప్పటికీ ఒక్కోసారి పోటీల్లో రాణించలేకపోవచ్చు. నాకూ కొన్ని అనుభవాలున్నాయి. అందుకు నాకు నేనుగా ఆలోచించుకుని ఒక రొటీన్‌ని డిజైన్ చేసుకున్నాను. ఇంట్లో ఎలాగైతే షూటింగ్ తర్వాత మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతానో, కాంపిటీషన్లకు వెళ్లినప్పుడు కూడా అదే రొటీన్‌ని కొనసాగించాలనుకున్నాను. ఈ గేమ్‌లో లక్ష్యాన్ని ఛేదించడానికి మెదడును చాలా కండిషన్ చేసుకుంటాం. మైండ్ అదే కండిషన్లో కొనసాగకూడదు, తప్పనిసరిగా రిలాక్స్ కావాలి. అలా నాకు మ్యూజిక్ ఒత్తిడిని తగ్గించే బెస్ట్ ఫ్రెండ్. సినిమాలు బాగా చూస్తాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
హైదరాబాద్ శివార్లలో ఐసిస్ సభ్యుల షూటింగ్ ప్రాక్టీసు
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భగ్నం చేసింది. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు.. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఐసిస్ సానుభూతిపరులు షూటింగ్ ప్రాక్టీసు చేసినట్లు తెలిసింది. మీర్ చౌక్, మొగల్ పురా, భవానీ నగర్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలలో ఎన్ఐఏ తనిఖీలు సాగాయి. పోలీసుల అదుపులో మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ,అబ్దుల్లా బిన్ మహ్మద్ అల్మోడీ, అబిన్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్, ముజఫర్ హుస్సేన్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణపై వారిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వీళ్ల వద్ద రెండు 9 ఎంఎం పిస్టళ్లతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విదేశీ కరెన్సీ, ఎలక్ట్రికల్ వస్తులు, అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 15 లక్షల నగదును కూడా ఎన్ఐఏ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ సందర్భంలో ఇబ్రహీం కుటుంబ సభ్యులు మీడియాపై దాడి చేశారు. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంటికి వెళ్లిన సమయంలో కూడా.. ఐదు నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇబ్రహీం కుటుంబ సభ్యులు బెదిరించినట్లు సమాచారం.