breaking news
shoes thrown
-
సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..
నాటకాలు బాగా ప్రదర్శిస్తున్న రోజుల్లో ఓ సరదా సంభాషణ ప్రాచుర్యంలో ఉండేది. ‘ఏమోయ్.. నాటకం బాగా రక్తి కట్టిందటగా ఏ మాత్రం కలెక్ష వచ్చిందేమిటి?’.. కొంచెం వ్యంగ్యంగా అన్న ప్రశ్నకు.. ‘మహా బాగా వచ్చాయి.. బాటా తొంభై, నాటు నలభై.. అన్నీ ఎడమ కాలివే..’ అని నిష్ఠూరపు సమాధానం. ఇప్పుడు నాటకాలు పాలిటిక్స్‌లో బాగా రక్తి కడుతుండడంతో ఆ బాటా, నాటు జోళ్ల అవసరం, ప్రస్తావన ఇక్కడ బాగా పెరిగింది.. ఏదైనా పరస్పర విరుద్ధం అని చెప్పడానికి ఉప్పు, నిప్పు అంటారు. రాజకీయాల్లో విరుద్ధమైన రెండింటికీ ‘చెప్పు’ ఒక్కటే చాలు. స్వామిభక్తిని చాటడానికైనా. నిరసన తెలప డానికైనా.. ‘చెప్పు’ చేతపడితే చాలు. ఇలారండి .. భారత రాజకీయాలు ఎలా చెప్పుచేతుల్లో ఉన్నాయో చూద్దాం.. ‘షూ’ట్ ఎట్ షార్ట్‌కట్.. నిజానికి చెప్పుల కథ ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టంగానీ.. రామ భరతుల కాలంనాటి ‘పాదుకా పట్టాభిషేకం’ మనకు ఎరుకే. ఆ తర్వాత బాగా పాపులర్ అయ్యింది.. ఎమర్జెన్సీ రోజుల్లో నాటి యూపీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ. అసలు ఏ అధికార పదవిలోనూ లేని సంజయ్ గాంధీ చెప్పులు తివారీ చేతందు కోవడం మొదలు తరచుగా నాయకులు పాదుకా స్పర్శలో ‘అమితా’నందాన్ని పొందుతూనే ఉన్నారు. నిన్నటి బండి సంజయ్ – అమిత్ షా చెప్పుల ఉదంతం చూశాం... ఎప్పుడో 2015 నాటి నారాయణసామి – రాహుల్ చెప్పుల కథను ప్రధాని మోదీ ప్రస్తావించడం.. ఇప్పుడది ట్రోల్ అవుతుండటం చూస్తున్నాం.. నాడు రాహుల్ కాళ్లకు ఎక్కడ బురద అంటుకుంటుందోనని.. కాంగ్రెస్ నేత నారా యణసామి చెప్పులు చేతబట్టుకుని మరీ కాపలా కాశారు. రాహుల్ బూట్లు అలా విప్పగానే చటుక్కున తన చెప్పులు ఆయన కాళ్ల వద్ద పెట్టి స్వామి భక్తిని ‘చెప్పు’కున్నారు. ‘రాహుల్ వంటి సీనియర్‌ను గౌరవించుకోవడం తప్పా..?’ అని కూడా ఈ 68 ఏళ్ల వయసున్న పెద్దాయన అప్పట్లో చెప్పారు. 2010లో మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి రమేశ్ బాగ్వే ముంబైకి వచ్చిన రాహుల్ గాంధీ చెప్పులను కాసేపు ‘గౌరవం’గా చేత పట్టుకున్నారు. ఇదే రాహుల్‌గాంధీ ఆమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ‘చెప్పు’డు విమర్శ లకు దిగారు. తాము అమిత్‌షా నివాసానికి వెళితే ఇంటి బయటే చెప్పులు విప్పించారని, లోపల అమిత్‌షా మాత్రం చెప్పులు వేసుకునే ఉన్నారని మణిపూర్ ప్రజాప్రతినిధులు తనతో చెప్పారంటూ.. అమిత్‌షా క్షమాపణ చెప్పా లంటూ డిమాండ్ చేశారు కూడా. కొన్నేళ్ల కింద బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి.. ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు మోసేందుకే అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత క్షమాపణలు చెప్పుకున్నా రనుకోండి ‘షూ’ట్ ఎట్ ఫైట్ ఇక యూపీలోని సంత్ కబీర్‌నగర్‌లో ఇద్దరు బీజేపీ నేతలు పబ్లిక్ ముందే చెప్పులాటకు దిగారు. శిలాఫలకంపై తన పేరు లేదన్న ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ బఘేల్‌ను చెప్పుతో కొడితే.. రాకేశ్ తిరిగి లెంపకాయతో బదులిచ్చారు. ‘షూ’ట్ ఎట్ సైట్ ఎప్పుడూ భక్తి తన్మయత్వమేనా.. అప్పు డప్పుడూ నిరసనల కోపం కూడా చెప్పులను చేతబట్టించింది. ► 2009లో దైనిక్ జాగరణ్ రిపోర్టర్ జర్నైల్ సింగ్ నాటి కేంద్ర మంత్రి చిదంబరంపై విసిరిన బూటు దేశంలో కలకలం రేపింది. ► 2016లో యూపీలోని సీతాపూర్ జిల్లాలో రోడ్‌షో చేస్తున్న రాహుల్ గాంధీ వైపు హరిఓం మిశ్రా అనే సామాజిక కార్యకర్త విసిరిన నిరసన బూటు దూసుకొచ్చింది. 2012లో డెహ్రాడూన్‌లో జరిగిన ఓ రాజకీయ సభలోనూ రాహుల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ► 2016లోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్లో మాట్లాడుతుంటే.. వేద ప్రకాశ్ శర్మ అనే రాజకీయ కార్యకర్త చెప్పు విసిరి తన నిరసన చెప్పుకున్నాడు. ► విమానంలో బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వలేదంటూ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలూ వచ్చాయి. ► అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్పపై చెప్పుదాడి జరగడంతో.. చెప్పుల లొల్లి చెప్పలేనంత తలనొప్పిగా మారిందని నాటి ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ తల పట్టుకున్నారు. ఈ ‘ట్రెండ్’ను ఆపడానికి ఏదో ఒకటి చేయాలనీ అన్నారు. ‘షూ’ట్ ఎట్ హైట్ కొందరు రాజకీయ నేతలు చెప్పుల ఎత్తు పెంచుకుని.. కొత్త ఎత్తులకు వెళ్లారని పాశ్చాత్య మీడియా అప్పుడప్పుడూ కోడై కూస్తుంటుంది. లీడర్ల అసలు ఎత్తుకు, అధికారికంగా చెప్పే ఎత్తుకు సంబంధం ఉండదని అంటూ ఉంటుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎత్తు బూట్లు వేసుకుని ఎత్తయిన వ్యక్తిలా కనిపించే ప్రయత్నం చేస్తారని అది ఆయన విజయ రహస్యమనీ చాలాసార్లు వార్తలూ వచ్చాయి. కొన్నేళ్ల కింద అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి వెళ్లిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తు చెప్పులు వేసుకెళ్లారని గోల చేశారు కూడా. ఇక మన దీదీ మమతా బెనర్జీ హవాయి చెప్పుల ‘సింప్లిసిటీ’కి ఎంత ఇమేజ్ ఉందో తెలిసిందే కదా! నువ్వేం ‘షూ’టర్? అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్‌పై ఓ నిరసనకారుడు బూటు విసిరాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ జోక్.. బూటు విసిరిన వ్యక్తికి జడ్జి మూడేళ్లు జైలుశిక్ష వేశారు. ‘కేవలం బూటు విసిరితే మూడేళ్లు జైలా?’ అని నిందితుడు వాపోతే.. ‘కాదు.. విసిరినందుకు ఒక్క ఏడాదే.. అది తగలకుండా మిస్సయినందుకు మిగతా రెండేళ్లు జైలు’ అని జడ్జి ఆగ్రహం! (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) ఇది ‘షూ’పర్.. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మన అమ్మల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ‘చెప్పు’ లేనట.. ఆ భయం చూపి.. అల్లరిపిల్లలను దారిలో పెడుతున్నారని సరదా కామెంట్. ఇలా అమ్మలు వారి ఆయుధాన్ని విరివిగా వాడి పిల్లలను డిసిప్లిన్‌లో పెడితే... ముందు తరాల రాజకీయాల్లో చెప్పుల అవసరం బాగా తగ్గుతుందని ఓ నెటిజన్ ఉవాచ. -
తిరుపూరులో పెరియార్ విగ్రహం ధ్వంసం
చెన్నై/తిరుపూరు: ప్రఖ్యాత ద్రవిడ ఉద్యమకారుడు పెరియార్ 139వ జయంతిరోజైన సోమవారమే తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఆయన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చెన్నైలోనూ పెరియార్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తుండగా ఓ వ్యక్తి విగ్రహంపైకి బూటు విసిరాడు. తిరుపూరులోని ధరపురంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినవారి కోసం గాలిస్తున్నామనీ, బూటు విసిరిన యువకుడిని ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, ఈ పార్టీల మాతృసంస్థ ద్రవిడార్ కళగం, ఇతర పార్టీలు ఈ ఘటనలను ఖండించాయి. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ చెప్పగా, నిందితులపై జాతీయ భద్రతాచట్టం కింద కేసు నమోదు చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. -
నవాజ్ షరీఫ్‌కు షూ దెబ్బ!
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం జమియా నమీయా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో ఓ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నవాజ్‌పై ఓ విద్యార్థి షూ విసిరాడు. ఆయన ప్రసంగించేందుకు మైక్ వద్దకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షూ నేరుగా నవాజ్ భుజాలు, చెవులకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడితో పాటు అతని సహాయకుడ్ని భద్రతాధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. -
కన్హయ్యపై చెప్పులు విసిరిన యువకులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సమావేశం రసాభాసగా మారింది. కన్హయ్య తన ప్రసంగం మొదలుపెట్టబోతుండగానే అతడి వ్యతిరేకులలో 'గోరక్షాదళ్'కు చెందిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. 'భారత్ మాతాకీ జై' అంటూ కన్హయ్యపై చెప్పులు విసిరారు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ మీడియా ఉన్నవైపు రావడంతో.. మీడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. వాళ్లను ఏమీ అనొద్దని, ఊరుకొమ్మని కన్హయ్య కుమార్ చెబుతున్నా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే, కావాలనే ఈ సమావేశానని రసాభాస చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ అన్నారు. దీనిపై ఆ తర్వాత ప్రసంగించిన కన్హయ్య కూడా స్పందించాడు. కొంతమంది తనను కొట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారని, కానీ చెప్పులు, రాళ్లు విసిరితే ప్రయోజనం ఉండదని చెప్పాడు. ఈ రోజు తన మీద చెప్పులు విసిరిన వాళ్ల మీద గానీ, నిన్న తనను కొట్టినవాళ్ల మీద గానీ తనకు ఏమాత్రం కోపం లేదని.. వాళ్ల వల్ల తనకు మరింత మేలు జరుగుతుందని అన్నాడు. చివరకు తనను జైలుకు పంపినవారి మీద కూడా ఎలాంటి కోపం లేదని అన్నాడు. రాళ్లు, చెప్పులు మీమీదే వేసుకుంటున్నారని రేపు మీకు అర్థం అవుతుందని తెలిపాడు.