ఐదుగురు మత్స్యకారుల కోసం గాలింపు
వేటకు వెళ్లి 9 రోజులైనా ఒడ్డుకు చేరని వైనం
గాలింపు చేపట్టిన కోస్టు గార్డు, మెరైన్ సిబ్బంది
కుటుంబాల సభ్యుల ఆందోళన
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రం కావడంతో.. సముద్రంలో వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారుల ఆచూకీ తెలియడం లేదంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి జాడ కోసం మత్స్య శాఖ, కోస్టు గార్డు అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నెల 9వ తేదీన వేటకు వెళ్లిన వారు ఇంతవరకూ చేరలేదు. వేటలో వారిని కలిసిన ఇతర బోట్లలోని మత్స్యకారులందరూ ఒడ్డుకు చేరిపోయారు. ఐదు రోజుల క్రితం బోటు ఇంజన్ చెడిపోయిందని చెప్పిన వారి నుంచి ఆ తర్వాత ఏ సమాచారం చేరలేదు. దీంతో వీరి జాడ కోసం తీర ప్రాంత గ్రామాలు టెన్షన్ పడుతున్నాయి.
====
పిఠాపురం : కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన కోడ కృష్ణకు చెందిన బోటుపై రంగంపేటకు చెందిన రాకాతి రాము, కందుల సింహాచలం (కొండయ్య), చొక్కా అప్పారావు, మాయాపట్నంకు చెందిన మేరుగు కృష్ణ, దుమ్ములపేటకు చెందిన చేపల రాజులు ఈ నెల 9వ తేదీన ఆదివారం ఉప్పాడ నుంచి చేపల వేటకు వెళ్లారు. వీరందరూ చేపల వేట ముగించుకుని నాలుగు లేదా ఐదు రోజుల్లో ఇంటికి తిరిగి రావాల్సి ఉంది. అయితే తొమ్మిది రోజులైన తిరిగి రాకపోవడంతో వారు ప్రమాదంలో చిక్కుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి విశాఖ తీరానికి చేరుకున్న వారు 10వ తేదీ సోమవారం ఉదయం తిరిగి చేపల వేట కోసం (సూరల వేట) తీరం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరం సముద్రంలోకి వెళ్లారు. అక్కడ చేపల వేట సాగిస్తుండగా వారితో పాటు ఇతర బోట్లపై వెళ్లిన మత్స్యకారులకు కనిపించారు. ఆ బోట్లు నాలుగు రోజుల క్రితమే ఒడ్డుకు చేరుకున్నాయి. ఈ ఐదుగురు ఉన్న బోటు మాత్రం తొమ్మిది రోజులైనా ఒడ్డుకు చేరలేదు. ఐదు రోజుల క్రితం బోటు ఇంజన్ చెడిపోయిందని వారు సెల్ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని, అనంతరం వారి నుంచి ఏ సమాచారం లేదని వారి బంధువులు చెబుతున్నారు. వీరి కోసం వారి కుటుంబీకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సెల్ఫోన్ పనిచేయకపోవడంతో పాటు వాయుగుండం కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో వారిలో ఆందోళన ఎక్కువైంది
దోనెలోకి వెళ్లిపోయారా..?
ఇంజన్ చెడిపోవడంతో కేవలం గాలివాటంపై వారు దోనెకు (సముద్రం లోపలకు) వెళ్లి పోయి ఉంటారని స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం ప్రమాదకరంగా మారడంతో సముద్రంలో ఈదురుగాలులకు అత్యంత లోపలకు వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అందువల్లే వారు ఏ ఒడ్డుకూ చేరుకోలేదంటున్నారు. సాధారణంగా గాలివాటంపై ప్రయాణించే బోటు రెండు మూడు రోజులకు ఏదోఒక తీరానికి చేరతారు. అయితే ఈ బోటు ఇంజన్ చెడిపోయి ఐదు రోజులైనందని, ఇప్పటికీ వారు ఎక్కడికి చేరలేదని తెలుస్తోంది.
గాలింపు చర్యలు ప్రారంభం
కోస్టు గార్డు, మెరైన్, మత్స్యశాఖ అధికారులు గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వాతావరణం సక్రమంగా లేక హెలికాఫ్టర్పై గాలింపు కుదరడం లేదని మత్స్య శాఖ డీడీ జయరావు తెలిపారు. అధికారులు మంగళవారం మత్స్యకారుల వివరాలు సేకరించారు. ఎక్కడ నుంచి వేటకు వెళ్లారు, ఇతర బోట్లలోని వారికి ఎక్కడ కనిపించారనే విషయాలను సేకరించారు. ఆ దిశగా గాలింపు చేపట్టనున్నారు.