breaking news
septisimiya
-
రక్తానికీ ఇన్ఫెక్షన్
మన దేహంలోని ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ రావడం మనం చూస్తుంటాం. కళ్లకు వస్తే కళ్లకలక (కంజెక్టివైటిస్) అనీ, కాలేయానికి వస్తే హెపటైటిస్ అనీ, అపెండిక్స్‌కు వస్తే అపెండిసైటిస్ అని చెప్పుకోవడం మనందరికీ తెలిసిందే. మరి శరీరంలోని అన్ని అవయవాలకూ వచ్చినప్పుడు రక్తానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఉంది. కాకపోతే దీని గురించి మనకు అంతగా తెలియదు. రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ను మనం వాడుక భాషలో ‘రక్తం విషంగా మారిపోయింది’ అని వ్యవహరిస్తుంటాం. నిజానికి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైది. ప్రతి ఏటా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చే కండిషన్ బారిన పడుతున్నారు. వైద్య పరిభాషలో సెప్టిసీమియా లేదా సెప్సిస్ అని పిలిచే ఈ కండిషన్ ఎందుకు ఏర్పడుతుంది? అదెంత ప్రమాదకరం? అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?... ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. ముందుగా సెప్టిసీమియా అంటే ఏమిటో చూద్దాం. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో ఎలాంటి సూక్ష్మజీవులూ ఉండకూడదు. రక్తంలోకి బ్యాక్టీరియా లేదా వైరస్ చొరబడితే అవి రక్తప్రవాహంలోకి ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తూ ఉంటాయి. రక్తం మన దేహంలోని ప్రతి అవయవానికీ చేరి పోషకాలను అందిస్తుంది కాబట్టి... ఈ హానికారక సూక్ష్మజీవులు, అలాగే ఆ ప్రమాదకర రసాయనాలు సైతం ప్రతి అవయవానికీ చేరి అంతర్గత అవయవాలన్నీ వాచే ప్రమాదం ఉంది. అంటే ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్ వస్తే అది చాలా సేపటి వరకు ఆ అవయవానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందోమోగానీ... రక్తానికి ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం అది చాలా త్వరితంగా దేహమంతా పాకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలా రక్తం ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని సెప్టిసీమియా అంటారు. దీన్నే డాక్టర్లు సంక్షిప్తంగా ‘సెప్సిస్’ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఎందుకిలా జరుగుతుంది? నిజానికి సెప్సిస్ అనేది ఓ ప్రాణాంతకమైన పరిస్థితే అయిన్పటికీ... ఇది ఒక అనివార్యమైన స్థితి. ఎందుకంటే... మన దేహంలో ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్ సోకడమో, గాయాలు కావడమో జరిగినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. అలాంటి ప్రతిస్పందన కాస్తా వికటించి, దేహమంతా పాకుతూ పోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సెప్సిస్‌లో రకాలు సెప్సిస్ రెండు రకాలుగా కనిపిస్తుంది. 1. సెప్సిస్, 2. సెప్టిక్ షాక్. ఈ రెండు పరిస్థితుల్లోనూ యాంటీబయాటిక్స్ ఇస్తూ సదరు ఇన్ఫెక్షన్ను కట్టడి చేసేలా చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన స్థితి ఎవరెవరిలో... సెప్టిసీమియా లేదా సెప్సిస్ ఎవరికైనా సోకవచ్చు. అయితే కొంతమందిలో సెప్సిస్ ఏర్పడే పరిస్థితి మరింత ఎక్కువ. దీనికి తేలిగ్గా గురయ్యేవారు ఎవరంటే... ♦ బాగా పసివాళ్లు, పిల్లలు, వయోవృద్ధులు ♦ డయాబెటిస్, క్యాన్సర్, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడుతున్నవారు ♦ తీవ్రంగా ఒళ్లు కాలిపోయి గాయాలకు గురైనవారు, ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులు. ♦ శస్త్రచికిత్స చేయించుకున్న పేషెంట్లు ♦ రోగనిరోధకవ్యవస్థ బాగా బలహీనంగా ఉన్న ఎయిడ్స్ రోగులు, కీమోథెరపీ చేయించుకుంటున్న వ్యక్తులు. సెప్టిక్ షాక్‌లో... ♦ రోగి చురుకుదనాన్ని పూర్తిగా కోల్పోయి, అయోమయానికి గురవుతాడు. ♦ తన పరిస్థితి పూర్తిగా దిగజారిందనీ, మరణం ఖాయమని అనిపిస్తోందని చెబుతుంటాడు. ♦ తలతిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మాటలు తొట్రుపడుతుంటాయి. వేగంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ♦ పొట్టలో వికారం, వాంతులు, విరేచనాలు విపరీతమైన కండరాలనొప్పి మూత్రం కొద్దిగా మాత్రమే వస్తుంది. ♦ చర్మం చల్లబడుతుంది. వివర్ణమవుతుంది. స్పృహ ఉండదు. చికిత్స సెప్సిస్ ప్రధానంగా బ్యాక్టీరియా వల్లనే ఏర్పడుతుంది. అది ఏ బ్యాక్టీరియా కారణంగా వచ్చిందన్న అంశాలను పక్కనబెట్టి, రోగి రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియగానే అత్యవసరంగా రెండు అంచెల్లో చికిత్స అందించాల్సి ఉంటుంది. మొదటిది యాంటీబయాటిక్స్ ఇవ్వడం. రెండోది దేహంలోని అంతర్గత అవయవాలను రక్షించడం. ఇందుకోసం కృత్రిమంగా శ్వాస అందిస్తారు. సెలైన్‌తో సహా అవసరమైన ఇతర ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం మొదలుపెడతారు. సెప్సిస్ అని అనుమానించినప్పుడు అందుకు కారణం అయివుంటుందనుకున్న బ్యాక్టీరియాను అదుపు చేసేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్ ఇవ్వడం మొదలుపెట్టేస్తారు. ఆ వెంటనే... సదరు ఇన్ఫెక్షన్కు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేసి, నిర్దిష్టంగా ఆ సూక్ష్మజీవిని నిర్ధారణ చేశాక అందుకు అవసరమైన మందులను మారుస్తారు. రోగి శరీరంలో సెప్సిస్ ఏ భాగం నుంచి వ్యాపించడం ప్రారంభమైందో గుర్తించి వెంటనే దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేస్తున్న కణజాలాన్నీ, వాచిన ప్రాంతంలోని చీమును తొలగించడం మొదలు పెడతారు. ఇందుకోసం అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స చేసిన వారికి ఉపయోగించిన ట్యూబ్స్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తోందని గుర్తించినప్పుడు వాటిని తొలగించడమో చేస్తారు. నివారణ... ఒక అంచనా ప్రకారం దేశ జనాభాలో ప్రతీ ఏటా దాదాపు రెండు శాతం మంది సెప్సిస్ బారినపడుతున్నారు. ఒక ఉజ్జాయింపుగా ప్రతి ఏటా రెండున్నర కోట్ల మందికి సెప్సిస్ సోకుతోంది. కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు. ♦ ఫ్లూ, నిమోనియా వంటివి సోకకుండా ఎప్పుడూ చేతులను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ♦ గాయాలైనప్పుడు లేదా చర్మం గీసుకుపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడుక్కుని గాయం తగ్గే చికిత్స తీసుకోవాలి. ♦ గోళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. డయాబెటిస్ రోగులు శరీరంపై ఎక్కడా పుండ్లు, గాయాలు లేకుండా జాగ్రత్త పడాలి. సెప్సిస్‌ను గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. అది ఇతర కీలకమైన అవయవాలకు చేరితే చాలా ప్రమాదకరమని గుర్తించి జాగ్రత్తపడాలి. సెప్సిస్ లక్షణాలు – ముందస్తు హెచ్చరికలు సెప్సిస్‌కు సంబంధించిన ఈ లక్షణాలను ముందస్తు హెచ్చరికలుగా భావించి, అత్యవసర వైద్యచికిత్స అందించాలి. ఈ లక్షణాలను గుర్తించడం, ప్రతిస్పందించడం సెప్సిస్ ఏర్పడిన వ్యక్తిని రక్షించుకోవడంలో చాలా కీలక భూమిక వహిస్తాయి. ♦ జ్వరం వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. లేదా కొంతమందిలో దేహ ఉష్ణోగ్రత చాలా తక్కువకు పడిపోయి చలితో వణికిపోతూ ఉంటారు. ♦ గుండె అధిక వేగంతో కొట్టుకుంటుంది. ♦ శ్వాసవేగమూ విపరీతంగా పెరిగిపోతుంది. ♦ విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ♦ చర్మంలోని చిన్న రంధ్రాల నుంచి రక్తస్రావమై దద్దుర్లు ఏర్పడతాయి. ♦ రోగి మానసిక స్థితిలోనూ తీవ్రమైన మార్పులు వస్తాయి. నిద్రమత్తు ఆవరిçస్తుంది. రోగి అయోమయానికి గురవుతాడు. ప్రతి విషయంలోనూ నిరాసక్తత. ♦ సెప్సిస్ మరింత తీవ్రంగా మారినప్పుడు ఇంకా ప్రమాదకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది సెప్టిక్ షాక్ స్థితి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు తక్షణం రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఆ వ్యక్తికి ఇటీవలై ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉన్నా, లేదా శస్త్రచికిత్సలేమైనా జరిగినా, ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సెప్సిస్ చికిత్సకి ముందుగానే డాక్టరుకు ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి. -
రక్తానికి ఇన్ఫెక్షన్
సెప్టిసీమియా... వైద్య పరిభాషలో ఉపయోగించే ఈ మాట కాస్త కొత్తగా ఉండవచ్చు. కానీ మన శరీరంలో ఏ భాగమైనా అనారోగ్యకరమైన రీతిలో విషపూరితంగా అయిపోవడాన్ని ‘సెప్టిక్’ కావడం అని వ్యవహరించడం మామూలే. అలాగే రక్తం కూడా ఇన్ఫెక్షన్కు గురై, విషపూరితమై పోవడాన్ని సెప్టిసీమియా అనుకోవచ్చు. ఇది ఇన్ఫెక్షన్ తాలూకు చాలా ప్రమాదకరమైన, తీవ్రమైన పరిణామం. ఇటీవల సెప్టిసీమియా కేసులు పెరుగుతున్న సందర్భంలో ‘సెప్టిసీమియా’ అంటే ఏమిటి, దాని లక్షణాలేమిటి, దాన్ని అధిగమించడం ఎలా... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. సెప్టిసీమియా అంటే... మన సాధారణ అవగాహన కోసం చెప్పుకోవాలంటే... మన శరీర భాగాలకు ఇన్ఫెక్షన్ సోకినట్లుగానే... అది కాస్తా రక్తానికీ వ్యాపించి శరీరాన్ని పూర్తిగా విషమయం చేయడం అని అనుకోవచ్చు. ఇది దేనివల్లనైనా జరగవచ్చు. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు. అలాగే ఒక్కోసారి మన శరీరంలోకి ఏవైనా పరాన్న జీవులు ప్రవేశించడం, అవి మన శరీరంలోకి విషపూరితమైన వ్యర్థాలను విసర్జించడం వల్ల శరీరంలోని ఆ భాగం విపూరితమవుతుంది. క్రమంగా అది శరీరమంతటికీ పాకుతుంది. సెప్టిసీమియాకు మరికొన్ని కారణాలు కేవలం పైన పేర్కొన్నవి మాత్రమేగాక మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా ఆల్కహాల్‌కు బానిస అయిపోవడం, డయాబెటిస్ (మధుమేహం)తో దీర్ఘకాలంగా బాధపడుతుండటం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, మన శరీర కణాలకు విషపూరితంగా పరిణమించే కొన్ని రకాల మందులు దీర్ఘకాలికంగా వాడుతుండటం, మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే కొన్ని రకాల మందులు (ఇమ్యునో సప్రెసెంట్స్ వంటివి) వాడుతుండటం కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. యాంటీబయాటిక్స్‌ను విచక్షణరహితంగా వాడటం వల్ల... మన శరీరంలో చేరిన రకరకాల హానికరమైన సూక్ష్మజీవులు వాటి ప్రభావాన్ని తట్టుకునే శక్తిని పుంజుకుంటాయి. దాంతో అవి ఆ సూక్ష్మక్రిములపై ఎలాంటి ప్రభావం చూపకుండా నిర్వీర్యం అయిపోతాయి. ఈ దశలో సెప్టిసీమియా రావడానికి ఆస్కారం ఎక్కువ. ఏయే ఇన్ఫెక్షన్లలో ఎక్కువంటే..? గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందిన తర్వాత సెప్టిసీమియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఉదాహరణకు గుండెజబ్బులకు చికిత్స పొందిన హృద్రోగుల్లో 40 నుంచి 60 శాతం మంది 30 రోజుల్లోగా సెప్టిసీమియాకు గురై మరణించడం మామూలే. అందుకే ఇలాంటి సందర్భాల్లో రోగి పరిస్థితిని సత్వరం గుర్తించి ఆసుపత్రికి చేర్చి చికిత్స చేయించడం అవసరం. ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వారిలో 41 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీసే అవకాశం ఉంది. ప్రధానంగా నిమోనియా వచ్చిన సందర్భాల్లో ఇది ఎక్కువ. ఏదైనా కారణంతో పొట్ట (అబ్డామిన్)లో ఇన్ఫెక్షన్ వచ్చిన 32 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారి తీసే అవకాశం ఉంది. ప్రధానంగా పెరిటోనైటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భంలో లేదా పొట్ట మొదలుకొని, జీర్ణకోశ వ్యవస్థలో పేగు వరకు ఏ భాగానికైనా రంధ్రం పడటం (పెర్ఫొరేషన్) జరిగినప్పుడు పొట్టలోని స్రావాలు శరీరంలోకి ప్రవేశించి క్రమంగా శరీరమంతా విషపూరితంగా మారిపోవచ్చు. అల్సర్స్ వల్ల పేగుకు రంధ్రం పడినప్పుడు అది సెప్టిసీమియాకు దారితీసే ప్రమాదం మరింత ఎక్కువ. మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాగా పరిణమించవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్ అనే మూత్రపిండాల వ్యాధి వచ్చిన వారిలో లేదా మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) వచ్చిన వారిలో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చర్మానికి లేదా చర్మంలోని మృదుకణజాలానికి వచ్చే ఇన్ఫెక్షన్ కూడా సెస్టిసిమియా దిశగా మారవచ్చు. ఇలా చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో 5 శాతం కేసుల్లో అది సెస్టిసీమియాకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సెల్యులైటిస్ అనే వ్యాధిగ్రస్తుల్లో ఈ ప్రమాదం ఎక్కువ. ప్రైమరీ బ్యాక్ట్టిరీమియా కేసుల్లో మూడు శాతం మందిలో ఇలాంటి ప్రమాదం ఉంది. మెనింజైటిస్ వంటి మెదడు ఇన్ఫెక్షన్ సోకిన వారిలో మూడు శాతం కేసులు సెప్టిసీమియా దిశగా పరిణమించే అవకాశం ఉంది. ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్ సోకిన వారిలో రెండు శాతం మందికి అది సెప్టిసీమియాగా మారే ప్రమాదం ఉంది. నిర్ధారణ పరీక్షలు సెప్టిసీమియాతో బాధపడే రోగుల్లో చాలా మందికి తొలుత ఏదో ఒక అవయవానికి ఇన్ఫెక్షన్ వచ్చి, అది ప్రభావితమవుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ఏ భాగం ప్రభావితమైందో... అంటే ఉదాహరణకు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె లేదా మెదడు... ఇలా ఏ భాగానికి తొలుత ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలుసుకోవాలి. కొన్నిసార్లు అన్ని అవయవాలూ ప్రభావితమైపోయి, అవన్నీ విఫలమయ్యే అవకాశం ఉంది. దీన్నే ‘మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్’ అంటారు. ఈ లక్షణాల ఆధారంగా సెప్టిసీమియాను అనుమానించడం, గుర్తించడం జరుగుతుంది. ఇక చాలా సందర్భాల్లో రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్-రే, అల్ట్రాసౌండ స్కానింగ్, సీటీ స్కానింగ్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో కూడా సెప్టిసీమియాను తెలుసుకోవడంతో పాటు దాని తీవ్రతను కూడా అంచనా వేసే అవకాశం ఉంది. ఇలాంటి పరీక్షల ఆధారంగా తదుపరి చేయాల్సిన చికిత్సను కూడా నిర్ణయిస్తారు. చికిత్స: సెప్టిసీమియా రోగులకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. అన్ని వసతులు, సదుపాయాలు ఉన్న పెద్ద ఆసుపత్రుల్లో దీనికి సమర్థమైన చికిత్స అందే అవకాశం ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రక్రియలు రోగికి అందిస్తారు. రోగికి రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్ ఫ్లుయిడ్స్) రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ (ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్) రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే వాసోప్రెస్సార్ సపోర్ట్ అందించడం. ఆక్సిజన్ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్ వంటి యంత్రాల సహాయంతో శ్వాస అందించడం. కిడ్నీ రోగుల విషయంలోనైతే రక్తాన్ని శుద్ధి చేసే డయాలసిస్ ప్రక్రియతో చికిత్స చేయడం. అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్‌ను ఎక్కించడం) రోగి డయాబెటిస్తో బాధపడుతుంటే అవసరాన్ని బట్టి రక్తనాళం ద్వారా ఇన్సులిన్ అందించడం (ఇంట్రావీనస్ ఇన్సులిన్ ఇవ్వడం). రోగికి అవసరమైన పోషకాహార పదార్థాలను రక్తనాళం ద్వారానే అందించడం (ఇంట్రావీనస్ న్యూట్రిషనల్ సపోర్ట్). పైన పేర్కొన్న సంప్రదాయ చికిత్సలతో పాటు ఇప్పుడు సెప్టిసీమియా రోగులకు ‘రీ కాంబినెంట్ యాక్టివేటెడ్ ప్రోటీన్-సి’ అనే ఇంజెక్షన్లు, ఎండోటాక్సిన్ యాంటగానిస్ట్ (ఎరిటోరాన్), గ్రాన్యులోసైట్ మ్యాక్రోఫేజ్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్‌తో పాటు రక్తనాళం ద్వారా ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అందించడం ద్వారా చికిత్స చేస్తున్నారు. సెప్టిసీమియా నివారణ మనం బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహారం, నీరు, పీల్చే గాలి వల్ల నేరుగా రోగకారక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించవచ్చు. అందుకే పరిశుభ్రమైన ఆహారాన్ని, స్వచ్ఛంగా ఉండే నీటిని, కాలుష్యం లేని గాలిని పీల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ కింద పేర్కొన్న కొన్ని అంశాలు కూడా సెప్టిసీమియా నుంచి రక్షించుకోడానికి దోహదపడతాయి. అవి... నీటిని కాచి, చల్లార్చి తాగాలి లేదా వాటర్ ఫిల్టర్ ద్వారా పరిశుభ్రమైన నీటినే తాగుతుండాలి. బయట లభించే కలుషితమైన నీటిని తీసుకోకూడదు. అప్పుడే వండిన పదార్థాలు వేడివేడిగా ఉండగానే తినేయాలి. వీలైనంత వరకు ఇంటి భోజనాన్నే తీసుకోవడం మంచిది. హోటళ్లలో బాగా చల్లారిపోయిన పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పాచిపోయిన ఏ పదార్థాన్నయినా పారేయాలి. వృథా అవుతుందేమోననే భావనతో ఎలాగైనా ఉపయోగంలోకి తేవాలనే అభిప్రాయంతో దాన్ని తినకూడదు. వండటానికి ముందుగా ధారగా పడే నీటిలో అన్ని రకాల కూరగాయలను శుభ్రంగా కడగాలి. పండ్లను కూడా బాగా శుభ్రంగా కడిగే తినాలి. ఏదైనా ఆహార పదార్థాలను తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మల, మూత్ర విసర్జనల తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా తొలగిపోవాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ముక్కుకు అడ్డుగా ఫేస్‌మాస్క్ ధరించి మాట్లాడాలి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి పాకకుండా జాగ్రత్త పడవచ్చు. వయోవృద్ధులు, ఇమ్యునోసప్రెసెంట్స్ మందులు వాడుతున్నవారు, డయాబెటిస్తో బాధపడుతున్న వారు గుంపులుగా మనుషులు సంచరించే చోట్లకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాదరక్షలు, బూట్లు వంటి వాటిని ఇంట్లోకి తీసుకెళ్లకూడదు. వాటిని బయటే విడవాలి. అలాగే బయట నడవాల్సి వస్తే పాదరక్షలు లేకుండా నడవడం మంచిది కాదు. ఇంటిలో నడవడానికి స్లిప్పర్స్ అందుబాటులో పెట్టుకోవాలి. నిమోనియా, ఇన్ఫ్లుయెంజా వంటి జబ్బులకు ఇప్పుడు వ్యాక్సిన్స్ లభ్యమవుతున్నాయి. స్తోమతను బట్టి పెద్దలు వాడాల్సిన వ్యాక్సిన్స్‌ను తీసుకోవడం మంచిది. పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వంటి మందులను విచక్షణ రహితంగా వాడకూడదు. మధుమేహం వంటి జబ్బులు ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మంచి పోషకాహారాన్ని వేళకు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. - నిర్వహణ: యాసీన్ లక్షణాలు ఒక వ్యక్తి సెప్టిసీమియాకు గురైనట్లుగా గుర్తించడానికి అవకాశమిచ్చే లక్షణాలివే... =చలితోపాటు వచ్చే జ్వరం (ఫీవర్ విత్ చిల్స్) =ఊపిరి సరిగా అందకపోవడం (బ్రెత్‌లెస్‌నెస్) =గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్ హార్ట్‌బీట్) =అయోమయానికి గురికావడం / మూర్ఛ (ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ / సీజర్స్) =మూత్రం విసర్జించే పరిమాణం గణనీయంగా తగ్గడం (ఆలిగ్యూరియా) =దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం =పొట్టలో నొప్పి / వాంతులు / =నీళ్ల విరేచనాలు =కామెర్లు (జాండీస్) డాక్టర్ జె.ఎం. గురునాథ్ సీనియర్ జనరల్ ఫిజీషియన్ యశోదా హాస్పిటల్, సికింద్రాబాద్