breaking news
Senior journalist Gauri Lankesh
-
'మతచాందసవాదులు రెచ్చిపోతున్నారు'
కడప: దేశంలో మతచాందసవాదులు ప్రభుత్వ అండతో రెచ్చిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణహత్యకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో బిల్బప్ సర్కిల్లో ఈ రోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దేశంలో మతచాందసవాదుల ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయన్నారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నెలరోజుల పాటు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. -
జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్య
-
జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య
బెంగళూరులో మంగళవారం రాత్రి దారుణం ► ఇంటిముందే గుర్తుతెలియని వ్యక్తుల తూటాల వర్షం ► కన్నడ పత్రిక ‘గౌరీ లంకేశ్ పత్రికె’కు ఈమె ఎడిటర్ ► హత్యను ఖండించిన నేతలు, జర్నలిస్టులు, సాహితీవేత్తలు సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ (55) దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని రాజరాజేశ్వరనగర్లోని నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ఈమెపై అతిసమీపం నుంచి కాల్పులు జరపటంతో అక్కడికక్కడే మరణించారు. కన్నడ పత్రిక ‘గౌరీ లంకేశ్ పత్రికె’కు ఈమె ఎడిటర్. పలు పబ్లికేషన్లనూ నిర్వహిస్తున్నారు. తనపై ఎవరెన్ని కేసులు పెట్టినా వెరవని సాహసోపేత జర్నలిస్టుగా, సామాజిక వేత్తగా గౌరీ శంకర్ సుప్రసిద్ధురాలు. గౌరీ రాత్రి 8 గంటల ప్రాంతంలో రాజరాజేశ్వరి నగరలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటి ముందు కారును పార్క్ చేసి తలుపులు తెరుస్తుండగానే, బైక్పై వచ్చిన దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. ఏడు రౌండ్ల కాల్పుల్లో నాలుగు ఇంటి ప్రహరీ గోడకు తగలగా మరో మూడు బుల్లెట్లు ఆమె తల, ఛాతీలోకి చొచ్చుకుపోవడంతో మరణించారు. దుండగులు బెంగళూరు దాటి వెళ్లకుండా నగరం అంతటా గస్తీని ముమ్మరం చేసినట్లు కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, పశ్చిమ బెంగాల్, కేరళ సీఎంలు సహా పలువురు నేతలు, పాత్రికేయలు, సాహితీవేత్తలు హత్యను ఖండించారు. కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప ధ్వజమెత్తారు. కల్బుర్గి హత్యలాగే! రెండేళ్ల క్రితం ప్రముఖ సాహితీవేత్త ఎంఎం కల్బుర్గి హత్యకు, మంగళవారం నాటి గౌరీ లంకేశ్ హత్యకు సారూప్యత ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన తీరును బట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి గౌరి లంకేశ్ విశేషంగా కృషి చేశారు. ఈ క్రమంలో కొంతమంది నుండి ఆమెకు ప్రాణహాని ఉన్నట్లు సమాచారం. ఎవరీ గౌరీ లంకేశ్? బెంగళూరుకు చెందిన లంకేశ్, ఇందిరల మొదటి కుమార్తె గౌరి లంకేష్. తండ్రి లంకేష్ తనపేరుతోనే ‘లంకేశ్’ అనే పత్రికను నడిపారు. చిన్నప్పటినుంచే జర్నలిజంపై ఆసక్తి కనబరిచారు. పలు ఇంగ్లీష్, కన్నడ పత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై కథనాలను అందించారు. తండ్రి లంకేశ్ చనిపోయాక తన పేరుతోనే పత్రికను స్థాపించి ఒక్క ప్రకటన కూడా లేకుండా నడిపారు. మావోల సానుభూతిపరురాలిగా పేరుంది. మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే గౌరి.. దేవాలయాల్లో జరిగే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ఎన్నో కథనాలు ప్రచురించారు. దీంతో› ఓ వర్గం నుండి వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వచ్చింది. 2008లో పలువురు హిందుత్వ నాయకులపై రాసిన కథనాలకు గానూ.. రెండు పరువునష్టం కేసు (ఎంపీ ప్రహ్లాద్ జోషి, బీజేపీ నేత ఉమేశ్ దోషిలు వేసిన)ల్లో కోర్టు ఈమెను దోషిగా పేర్కొంది. ఇందుకు గానూ ఆర్నెల్ల జైలుశిక్షకు ఆదేశించింది. అయితే, అదేరోజు కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.