సుజలం... త్వరలోనే సుఫలం
కుళాయి తిప్పగానే నీళ్లు జలజలా పారుతున్నా వారికి తెలియదేమోగానీ.... ఈ భూమ్మీద దాదాపు 80 కోట్ల మంది గుక్కెడు మంచినీటికి అల్లల్లాడిపోతున్నారు. సముద్రం పక్కనే ఉన్నా మంచినీటికి కటకటలాడే వారు కోకొల్లలు. అంత ఇబ్బందెందుకు... సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే టెక్నాలజీని వాడేయవచ్చుకదా అంటున్నారా? నిజమే గానీ... ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం. మరి పరిష్కారం ఏమిటి? మేము అభివృద్ధి చేసిన సరోస్ యూనిట్లు వాడటమే అంటోంది ఎకోహెచ్2ఓ సంస్థ. ఫొటోలో కనిపిస్తున్నవి సరోస్ యూనిట్ల చిత్రాలే. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కారొలీనా విద్యార్థులు కొందరు చేపట్టిన ప్రాజెక్టు చివరకు ఇలా ఒక కంపెనీగా మారి నీటి సమస్య పరిష్కారానికి మార్గమవుతోంది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీతో పోలిస్తే సగం ధరకే తాము సముద్రపునీటిని మంచినీటిగా మార్చగలమని, సముద్రపు అలల ద్వారా పుట్టే శక్తినే వాడటం దీనికి కారణమని అంటోంది ఎకోహెచ్2ఓ. ఫొటోలో చూపిన సైజు యూనిట్ ద్వారా రోజుకు దాదాపు 6 వేల లీటర్ల నీటిని ఉత్పత్తి చేయవచ్చునని, కాలుష్య కారకమైన బ్రైన్ (మంచినీటిని వేరు చేయగా మిగిలిపోయే ఉప్పునీరు) కూడా అతితక్కువ మోతాదులోనే విడుదలవుతుందని సంస్థ ప్రతినిధులు క్రిస్ మాథ్యూస్, జస్టిన్ సోనెట్ అంటున్నారు. సరోస్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ చాలా సులువని, సముద్రతీర ప్రాంతాలు, చిన్న చిన్న దీవుల్లోని వారికి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు మేలైన మార్గమని వారు అంటున్నారు. ఇప్పటికే నమూనాలను సిద్ధం చేసిన ఎకోహెచ్2ఓ సంస్థ వాణిజ్యస్థాయి ఉత్పత్తి కోసం నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాదిలోపు ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఇక్కడ కనిపిస్తున్నవి అంబుధి నుంచి అమృత సమానమైన నీటిని చిలికేందుకు అవసరమైన యంత్రసామగ్రి
ఉప్పునీళ్లను మంచినీటిగా మార్చేందుకు ఉపయోగించే యూనిట్‌ను తరలిస్తున్న టెక్నాలజిస్ట్‌లు