breaking news
SB Singh
-
ఎస్బీ సింగ్‌ను కస్టడీకి అప్పగించండి
ప్రత్యేక కోర్టును కోరిన సీఐడీ.. 24కు కేసు వాయిదా.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీ సింగ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టును సీఐడీ కోరింది. లీకేజీలో ఎస్బీ సింగ్‌ను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించింది. ‘లీకేజీకి ఎవరు కుట్రపన్నారు. ఇందుకు సహకరించిన వారెవరు. విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధం ఉందా?’ అనే విషయాలు రాబట్టేందుకు ఎస్బీ సింగ్‌ను కస్టడీలో విచారించాల్సి ఉందని సీఐడీ తరఫు న్యాయవాది నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈనెల 24న వెలువరిస్తానని పేర్కొన్నారు. యూనివర్సిటీ నిర్లక్ష్యంపై నివేదిక ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో జేఎన్టీయూ నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదికివ్వాలని సీఐడీ భావిస్తోంది. 2005 నుంచి ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకైన విషయం తెలుసుకోకుండా ప్రింటింగ్‌కు ఇవ్వడంపై ప్రభుత్వానికి నివేదించాలని సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ భావిస్తున్నారు. -
బహదూర్ చిక్కాడు..
ఎంసెట్ లీకేజీ కేసులో కీలక నిందితుడు అరెస్ట్ - ఎస్బీ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ - ఢిల్లీలో నాలుగు రోజుల పాటు ఆపరేషన్ సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక నిందితుడు ఎస్బీ సింగ్(బహదూర్‌సింగ్)ను ఎట్టకేలకు సీఐడీ అరెస్ట్ చేసింది. నాలుగు రాష్ట్రాల్లో ఆరు నెలల పాటు వేట సాగించిన సీఐడీ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఓ గెస్ట్‌హౌస్‌లో సింగ్‌ను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ శివారులోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి రెండు సెట్ల ప్రశ్నపత్రాలను బయటకు తీసుకువచ్చిన ఎస్బీ సింగ్ కోసం నాలుగు రోజల పాటు ఆపరేషన్ సాగించిన సీఐడీ ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేసింది. యూపీకి చెందిన ఓ పార్టీ నేతలు ఎస్బీ సింగ్ అరెస్ట్‌ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. దీంతో సీఐడీ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి సంబంధిత నేతలతో సింగ్ అరెస్ట్ విషయంపై చర్చించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడని, అరెస్ట్ చాలా కీలకమైనదని, చార్జిషీట్ దశలో ఉన్న కేసులో ఎస్బీ సింగ్‌ను తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు. దీంతో సింగ్ ఆచూకీ చెప్పారని, ఢిల్లీలో షెల్టర్ తీసుకున్న గెస్ట్‌హౌస్‌పై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామని సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక చార్జిషీట్‌కు రంగం సిద్ధం.. గతేడాది ఆగస్టులో మొదలైన విచారణలో బ్రోకర్లు, కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీఐడీ ఇక చార్జిషీట్ దాఖలుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు కీలక నిందితుడిగా ఉన్న ఎస్బీ సింగ్ విచారణ పూర్తి చేసి, ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ బయటకు ఎలా తెచ్చారు? ఆ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నపత్రాలు ముద్రిస్తు న్న విషయం ఎవరి ద్వారా తెలుసుకున్నారు? మొత్తం డీల్ విలువ ఎంత? యూనివర్సిటీ అధికారుల పాత్ర ఉందా? అన్న అంశాలపై క్లారిటీ తీసుకోనున్నారు. సింగ్ విచారణలో వెల్లడించిన అంశాలను బట్టి ఎఫ్ఐఆర్లో నిందితుల వరుస క్రమాన్ని మార్చాల్సి ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు. వారం పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 61 మంది బ్రోకర్లు.. లీకేజీ కేసు అనేక మలుపులు తిరిగినా సీఐడీ ముందు నుంచి ఒకే దూకుడును ప్రదర్శించింది. తమ పిల్లల సీట్ల కోసం బేరానికి వెళ్తే ఏకంగా ప్రశ్నపత్రాలనే ఇచ్చి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్‌ను కటకటాల్లోకి నెట్టింది. ప్రశ్నపత్రాలపై శిక్షణ ఇచ్చిన కమిలేశ్ కుమార్ సింగ్‌తో పాటు మొత్తం 61 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసింది. అయితే విచారణలో గుండెపోటుతో కమిలేశ్ కుమార్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతరం కీలక నిందితుడైన ఎస్బీ సింగ్ కోసం వేట సాగించిన సీఐడీ ఎట్టకేలకు అరెస్ట్ చేయగలిగింది. -
ఎంసెట్ కీలక నిందితుడి కోసం వేట
ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలో సీఐడీ విస్తృత గాలింపు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక నిందితుడు ఎస్బీ సింగ్ కోసం సీఐడీ ముమ్మరంగా వేట సాగిస్తోంది. ఢిల్లీ శివారులోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి రెండు సెట్ల ప్రశ్నపత్రాలను ఎస్బీ సింగ్ బయటకు తీసుకువచ్చాడని, ఆ ప్రశ్నపత్రాలతో తాను ఆరు క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చానని సీఐడీ కస్టడీలో మృతిచెందిన కమలేష్కుమార్సింగ్ వాంగ్మూలం ఇచ్చాడు. రెండున్నర నెలల నుంచి ప్రధాన నిందితుడు ఎస్బీ సింగ్ పరారీలో ఉంటూ.. సీఐడీని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎస్బీ సింగ్ తలదాచుకున్నట్టు సీఐడీ దర్యాప్తు బృందాలు గుర్తించాయి. దీంతో అతడిని పట్టుకునేందుకు మూడు బృందాలను రంగంలోకి దించామని, పక్కా సమాచారంతో తమ బృందాలు ఛత్తీస్‌గఢ్, ఢిల్లీకి వెళ్లాయని ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సీఐడీ బృందాలు రెండు ప్రాంతాల్లో ఎస్బీ సింగ్ కోసం వేట సాగిస్తున్నాయి.