breaking news
Saint Peter
-
వేడుకల్లో రోమ్ నగరం..
క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు మహోన్నత వ్యక్తులు సెయింట్ పీటర్, సెయింట్ పాల్ల సంస్మరణార్థం జూన్ 29న నిర్వహించుకునే ‘ఫీస్ట్ ఆఫ్ సెయింట్స్ పీటర్ అండ్ పాల్’ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమవుతున్నాయి. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో వీరిద్దరూ చూపిన అచంచలమైన విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఈ వేడుకలను జరుపుకొంటారు.రోమ్ నగరంలో వేడుకలుపీటర్, పాల్ల పండుగను రోమ్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వాటికన్ లోని సెయింట్ పీటర్స్ బెసిలికా ఈ వేడుకలకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. సెయింట్ పీటర్ వారసుడిగా ప్రస్తుత పోప్ ఈ చరిత్రాత్మక వేడుకలకు నేతృత్వం వహిస్తారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఆర్చ్బిషప్లకు ‘పాలియం’ అందజేస్తారు. అయితే ఈ పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, క్రీస్తు ప్రేమను, రక్షణ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు పీటర్, పాల్లు చూపిన ధైర్యాన్ని, నిబద్ధతను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అలవరచుకోవాలని ఈ వేడుక గుర్తు చేస్తుంది. ఈ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది యాత్రికులు, పర్యాటకులు రోమ్ నగరానికి పోటెత్తుతారు. ఈ వేడుకలను కేవలం రోమ్ నగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు చర్చిలలో జరుపుకొంటారు.త్యాగానికి ప్రతిరూపం పీటర్, పాల్యేసుక్రీస్తు ఎంపిక చేసుకున్న పన్నెండు మంది ముఖ్య శిష్యులలో పీటర్ ఒకరు. ఒక సాధారణ జాలరి అయిన పీటర్‌ను, యేసుక్రీస్తు మానవ హృదయాలను గెలుచుకునే ‘మనుష్యులను పట్టు జాలరి’గా మార్చారు. రోమన్ల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదురైనప్పటికీ, ఆయన తన విశ్వాసాన్ని వీడలేదు. క్యాథలిక్ క్రైస్తవులు ఈయన్ను మొదటి పోప్‌గా, రోమ్ చర్చి వ్యవస్థాపకుడిగా భావిస్తారు. అలాగే మొదట్లో క్రైస్తవులను తీవ్రంగా హింసించిన సెయింట్ పాల్, దమస్కు మార్గంలో యేసుక్రీస్తును దర్శించుకున్న తర్వాత పూర్తిగా మారిపోయారు. ఆ తర్వాత ‘పాల్’గా మారిన ఆయన, మధ్యప్రాచ్యం, ఐరోపా అంతటా క్రైస్తవ మతాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. నూతన నిబంధనలో ఆయన రాసిన లేఖలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.చారిత్రక ఆధారాల ప్రకారం పీటర్, పాల్– వీరిద్దరూ రోమ్ నగరంలోనే దైవసాన్నిధ్యం చెందారని విశ్వసిస్తారు. రోమ్‌లోని ప్రసిద్ధ ‘సెయింట్ పీటర్స్ బెసిలికా’, ‘సెయింట్ పాల్స్ ఔట్‌సైడ్ ది వాల్స్’ ప్రార్థనా మందిరాల్లో వీరిద్దరి సమాధులు ఉన్నాయి. చర్చి క్యాలెండర్లో వీరిద్దరి పేరుమీద ప్రత్యేకమైన రోజులున్నప్పటికీ రోమ్ నగరంలో వారు పొందిన అమరత్వాన్ని స్మరించుకుంటూ జూన్ 29ని ‘ఫీస్ట్ ఆఫ్ సెయింట్స్ పీటర్ అండ్ పాల్’గా నిర్వహిస్తున్నారు. - రమా జంబుల -
క్రీస్తు శిష్యుడి జన్మస్థలం వెలుగులోకి..
ఇజ్రాయెల్: ఏసు క్రీస్తుకు మొదటి శిష్యుల్లో ఒకరిగా భావించే సెయింట్ పీటర్ జన్మించిన ప్రాంతాన్ని అమెరికా, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని గలిలీ అనే సముద్రం ఒడ్డున ఈ పురాతన గ్రామాన్ని వెలికి తీసింది. సెయింట్ పీటర్‌తో మరో ఇద్దరు శిష్యుల్లో కూడా ఇదే నగరంలో జన్మించినట్లు ప్రతీతి అని ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త మోర్డెచాయ్ అవియం తెలిపారు. ఈయన గలిలీయాన్ ఆర్కియాలజీ ఇనిస్టిట్యూట్‌లో పురాతత్వశాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మొదటి శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్ చెప్పిన ప్రకారం జులియస్ అనే నగరం క్రీశ 30వ శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరాన్ని బెత్సయిదా అనే గ్రామ శిథిలాలపైనే నిర్మించారని, ఈ గ్రామంలోనే పీటర్ జన్మించినట్లు జాన్ సువార్త తెలుపుతోందన్నారు. మత్స్యకారుడైన పీటర్‌ను క్రైస్తవులంతా కూడా జీసస్‌ను అనుసరించిన తొలితరం శిష్యుడిగా గుర్తిస్తారు. ఆయనను ఇప్పటికే కేథలిక్ చర్చి తొలిపోప్గా గుర్తించిన విషయం తెలిసిందే. అయితే, పీటర్‌తోపాటు ఫిలిప్, పీటర్ బ్రదర్‌గా చెప్పే ఆండ్రూ కూడా ఇదే గ్రామంలో జన్మించి ఇక్కడే జీవించినట్లు కూడా క్రైస్తవులు నమ్ముతారు. చాలాకాలంగా జూలియస్ నగరం మొత్తాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు మూడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుండగా తాజాగా బెత్సయిదా వెలుగులోకి వచ్చినట్లు పురాతత్వశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే తాము పలు మట్టిపాత్రలు, నాణాలు, స్నానపు వాటికలు వెలుగులోకి తెచ్చామని, అవన్నీ కూడా ఇది చిన్న గ్రామమే అని నిరూపించేలా ఉన్నాయని, తమకు ఉన్న అంచనా ప్రకారం ఇదే బెత్సయిదానని, పీటర్ జన్మస్థలం అని తెలిపారు.


