breaking news
Sabsidi seeds
-
రైతుల ఆందోళన!
సాక్షి, పత్తికొండ(కర్నూలు) : సబ్సిడీ వేరుశనగ సరఫరా చేయడంలో ఆయిల్‌ఫెడ్ అధికారులు విఫలం అయ్యారు. వేరుశనగ కోసం రైతులు మంగళవారం పత్తికొండలో ఆందోళన నిర్వహించారు. ఇప్పటివరకు సరఫరా అయిన వేరుశనగ స్టాకు అయిపోవడంతో 5 రోజుల క్రితం పంపిణీ నిలిపివేశారు. స్టాకు వచ్చిన తర్వాత మళ్లీ పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రతిరోజు వ్యవసాయ కార్యాలయం చుట్టూ, గోడౌన్ చుట్టూ తిరుగుతున్నారు. స్టాకు లేక నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. మంగళవారం పత్తికొండ, తుగ్గలి మండలాల రైతులు స్థానిక ఏడీఏ కార్యాలయం వద్దకు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. పంపిణీ చేయలేమని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై అర్ధనగ్నంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరకొరగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని, రైతులందరికీ వేరుశనగ పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా సీపీఐ, సీపీఎం రైతుసంఘం నాయకులు రంగారెడ్డి, రాజాసాహెబ్, సిద్దయ్య తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. -
‘మంద’ గమనమే!
నేలకొండపల్లి: ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెల మందకు సంబంధించి బీమా గడువు ముగియగా..దీని కొనసాగింపు, రెన్యూవల్‌పై స్పష్టత లేక జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి ప్రభుత్వమే రెన్యూవల్ చేస్తుందేమోనని గొల్ల, కురమలు భావిస్తుండగా..లబ్ధిదారులే చేయించుకోవాలని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే..ఈ మేరకు క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసేలా ప్రచారం చేయకపోవడం, అవగాహన కల్పించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏదైనా జరిగి జీవాలకు ప్రాణనష్టం కలిగితే చివరకు పరిహారం సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. గొల్ల, కురమల అభివృద్ధికి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై జీవాలను పంపిణీ చేసిన విషయం విదితమే. వాటికి సంబంధించి సర్కారు చేయించిన బీమా పాలసీ గడువు తాజాగా తీరిపోయింది. 2017లో ప్రభుత్వం గొల్ల, కురమలకు మెదటి విడతగా 15,500 యూనిట్లు పంపిణీ చేసింది. గొర్రెలు కొనుగోలు చేసినప్పటి నుంచి ఏడాది వరకు బీమా వర్తించేలా సదరు కంపెనీతో ఒప్పందం కదుర్చుకుని ప్రభుత్వమే అప్పట్లో పాలసీ చేయించింది. ఇప్పటి వరకు దాదాపు 80శాతానికి పైగా యూనిట్ల పాలసీ గడువు ముగిసింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పాలసీని రెన్యూవల్ చేస్తుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. రాయితీ గొర్రెల పథకం కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేశారు. యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా ఇందులో 75 శాతం రాయితీ వర్తించింది. లబ్ధిదారులు తమ వాటాగా రూ.31,250ని డీడీ రూపంలో చెల్లించారు. జీవాలను కొనుగోలు చేసిన సమయంలో యూనిట్‌కు రూ.2,830తో ప్రభుత్వం బీమా చేయించింది. తద్వారా పెంపకందారులకు ఎంతో లబ్ధి కలిగింది. ప్రమాదవశాత్తూ జీవాలు మృత్యువాత పడితే పరిహారం అందింది. గతేడాది ఇచ్చిన వాటిలో 1400 జీవాలు చనిపోయాయి. ఇప్పటి వరకు 1200 జీవాలకు నష్టపరిహారం అందించారు. ఆడ జీవాలకు రూ.5,200, మగ జీవాలకు రూ.7 వేల చొప్పున నష్ట పరహారం సొమ్మును ఇచ్చారు. అయితే..ఇప్పుడు పాలసీ రెన్యూవల్ చేయించుకోవడంపై అధికారులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయట్లేదు. అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో..ఈ రెన్యూవల్ ప్రక్రియ మందగమనంగా సాగుతోంది. జీవాలు చనిపోతే..నష్టపరిహారం అందక వీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా బాధ్యులు స్పందించి..గొర్రెల బీమా పాలసీ రెన్యూవల్ చేయించుకునే విధానంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరముంది. లబ్ధిదారులేమో..ఈ సారి కూడా ప్రభుత్వమే తమ జీవాలకు రెన్యూవల్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వమే బీమా చేయించాలి.. సబ్సీడీ గొర్రెలను కొనుగోలు చేసేటప్పడు ప్రభుత్వం ఆ యూనిట్లకు బీమా చేయించింది. గడువు ముగిసిన అనంతరం కూడా మళ్లీ చేస్తే బాగుంటుంది. అలా అయితే..మాకు మరింత ప్రోత్సాహకం ఇచ్చినట్లవుతుంది. – చిర్రా బాబు, లబ్ధిదారుడు, అనాసాగారం పథకం పట్ల నిర్లక్ష్యం వద్దు.. యాదవులకు అందించిన గొర్రెల యూనిట్ల పథకం పట్ల నిర్లక్ష్యం తగదు. చనిపోయిన గొర్రెలకు చాలా వరకు నష్టపరిహారం అందించలేదు. రెండో విడతలో నేటి వరకు పంపిణీ చేయలేదు. ఇబ్బందులు లేకుండా చూడాలి. – యడ్ల తిరపరావు, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా నాయకులు -
జూన్‌లోనే రుణాలు అందజేయాలి
రైతు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకుమార్ జన్నారం : జూన్‌లోనే రుణాలు అందజేసి రైతులకు చేయూతనివ్వాలని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు చంద్రకుమార్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని తిమ్మాపూర్‌లో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ పూర్తిగా చేస్తేనే బ్యాంకర్లు రుణాలిస్తామని షరతులు విధిస్తున్నందున ప్రభుత్వం జూన్‌లోనే రుణాలందేలా చర్యలు చేపట్టాలన్నారు. సబ్సీడి విత్తనాలు కూడ రైతులకు జూన్‌లోనే అందేలా చూడాలన్నారు. సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి కే. రాజన్న, సర్పంచులు అల్లం వెంకటరాజం, వెంకటస్వామి, నాయకులు ప్రకాశ్‌నాయక్, ప్రభుదాస్, బాపన్న, వెంకట్ పాల్గొన్నారు.