breaking news
Sabrimala
-
శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా
సాక్షి శబరిమల: శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమల పరిసరాల్లో నకిలీ పత్రాలతో.. గుర్తింపు కార్డులతో సేవకు వచ్చే వారి కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంపాబేస్ నుంచి సన్నిధానం వరకు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచినట్లు వెల్లడించారు.అలాగే భద్రత దృష్టా అధికారులు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో సహా తాత్కాలిక ఉద్యోగుల పత్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయా వ్యక్తుల కోసం పోలీసులు, బోర్డు సమాచారాన్ని పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాని చెప్పారు. అయితే ఒక్కోసారి నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితి దృష్ట్యా సాధారణంగా ప్రశ్నించి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, శబరిమల అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నాయి. "రద్దీ పెరిగినప్పుడు దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు , యాచకులు తరచుగా శబరిమలకు వస్తారు. వారు పోలీసులను, అటవీ శాఖను పట్టించుకోకుండా శబరిమల మార్గంలోని అడవుల్లోనే ఉంటారు. అలాంటివారు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలతో వస్తారు. వారి రాక భద్రతా ముప్పుని సృష్టిస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. అయ్యప్ప భక్తులను మోసగించి రద్దీ సమయాల్లో అడవిలోకి ప్రవేశించడం వారి నేరశైలి అని తెలిపారు. ఈ నేపథ్యంలో నీలిమల, అప్పచిమేడు, శరణ్గుత్తి తదితర ప్రాంతాల పరిసర అడవులలో డ్రోన్ నిఘాను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పోలీసుల రిజిస్టర్లలో నమోదుకాని కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంపా, సన్నిధానంలో రెవెన్యూ శాఖ స్క్వాడ్, పోలీసు షాడో బృందం 24 గంటలు మోహరించి ఉంటాయని వెల్లడించారు.(చదవండి: శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే) -
శబరిమలలో హైదరాబాద్ స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి
తిరువనంతపురం: హైదరాబాద్ నుండి కేరళ వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. పంబా వెళ్తున్న క్రమంలో ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడిపోవడంతో ప్రమాదం జరిగింది. పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప స్వాములను ఉప్పర్గూడకు చెందిన వారిగా గుర్తించారు. -
అలా చేయడానికి ఆచారాలు ఒప్పుకోవు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి మహిళా భక్తులను అనుమతించకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. శబరిమల ఆలయ బోర్డు మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని పేర్కొంది. శబరిమలకు మహిళల నిరాకరణపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పలు పశ్నలు సంధించింది. లైంగికత ఆధారంగా వివక్ష చూపిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించింది. వివక్ష చూపకుండా ఆలయ ప్రతిష్ఠను కాపాడాలని సూచించింది. అయితే ఆలయ పవిత్రతను కాపాడేందుకే మహిళలను అనుమతించడం లేదని, వందల ఏళ్ల క్రితం మొదలైన ఆచారాలను కొనసాగిస్తున్నామని న్యాయస్థానానికి ఆలయ బోర్డు తెలిపింది. మహిళలకు విధించిన నిబంధనలను పురుషులకు ఎందుకు విధించరని కోర్టు ప్రశ్నించింది. స్త్రీ, పురుషులకు సమానంగా నిబంధనలు వర్తింపచేయలేమని ఆలయబోర్డు స్పష్టం చేసింది. మహిళలు రుతుక్రమంలో ఉంటారని, ఆ సమయంలో ఆలయంలో వారు పూజలు చేయడానికి ఆచారాలు ఒప్పుకోవని తెలిపింది. పవిత్రతను రుతుక్రమంతో ముడిపెడతారా, మహిళల దేహంలో చోటుచేసుకునే జీవక్రియ కారణంగా వారిపై వివక్ష చూపిస్తారా అని న్యాయస్థానం సూటిగా నిలదీసింది.


