breaking news
SAARC meet
-
'గేటు వద్ద కూడా ఉండొద్దు..'
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు. -
ద్వైపాక్షిక సమావేశాలు లేనట్లే..
ఇస్లామాబాద్: సార్క్ సమావేశాల సందర్భంగా భారత్-పాక్ ల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సమావేశాలు ఉండబోవని హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి గురువారం ప్రకటించారు. 7వ సార్క్ సమావేశాల కోసం భారత హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ సమస్యాత్మకంగా భావిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, బోర్డర్లో ట్రెర్రరిజం తదితర అంశాలను రాజ్ నాథ్ సార్క్ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు. ఇరుదేశాల మంత్రులు చౌదరి నిసార్ అలీ ఖాన్, రాజ్ నాథ్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు సంప్రదింపులు జరిగినా అవి విఫలమయ్యాయని మహర్షి చెప్పారు. సమావేశం కొరకు ఇస్లామాబాద్ బయల్దేరే ముందు టెర్రరిజం, కుట్రపూరిత నేరాలపై చర్చలు జరిపేందుకు సిద్ధమని రాజ్ నాథ్ చెప్పారని తెలిపారు. సమావేశం ద్వారా ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఈ-తోయిబా, జైషే-ఈ-మహమ్మద్ లకు పాక్ స్పాన్సర్ షిప్ ను ఆపాలని కోరనున్నట్లు చెప్పారని వెల్లడించారు. హిజ్బుల్ మొజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వానీ కాల్చివేత అనంతరం భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆగిపోయాయి. సార్క్ సమావేశాల కారణంగా తిరగి ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావించారు. వానీ మరణం అనంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అతనిపై ప్రశంసలు కురిపించారు. కశ్మీర్ ఏదో ఒక రోజు పాకిస్తాన్ లో అంతర్భాగం అవుంతుందని వ్యాఖ్యనించారు. షరీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ షరీఫ్ కశ్మీర్ పాక్ లో అంతర్భాగం కాదని ధీటుగా సమాధానం ఇచ్చారు.