'ఆయనకు ఏకలవ్య శిష్యుడిని'
రాజమండ్రి : తాను దర్శకత్వం వహించిన ఢమరుకం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందని ప్రముఖ సినీ దర్శకుడు సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రావులపాలెంలోని స్నేహితుడు పడాల రామిరెడ్డి ఇంటికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
*జిల్లాలోని బలభద్రపురం మా స్వస్థలం. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలో స్థిరపడ్డాం. ఇలా ఉభయ గోదావరి జిల్లాలతో నాకు మంచి అనుంబంధం ఉంది.
*1984లో సినీరంగ ప్రవే శం చేశాను. చాలామంది డెరైక్టర్ల వద్ద అసిస్టెంటుగా పని చేశాను.
*పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరానికి చెందిన స్నేహితులు ఆనందరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి నిర్మాతలుగా.. 1996లో తొలిసారి ఆలీ హీరోగా ఆషాఢం పెళ్ళికొడుకు చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు.
*ఇప్పటివరకూ తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం చేశాను. ఆషాఢం పెళ్ళికొడుకు; సుమన్, భానుప్రియలతో ఫిబ్రవరి 14 నెక్లస్ రోడ్; శివాజీ, లయలతో అదిరిందయ్యా చంద్రం; శివాజీ, కృష్ణభగవాన్, లయలతో టాటా బిర్లా మధ్యలో లైలా; శ్రీకాంత్, వేణు మీరాజాస్మిన్లతో యమగోల మళ్ళీ మొదలైంది; అల్లరి నరేష్, ఫర్జానాలతో బొమ్మన బ్రదర్స్ - చందన సిస్టర్స్; కుబేరులు వీళ్ళకి అన్ని అప్పులే; నాగార్జున, అనుష్కలతో ఢమరుకం; ఇటీవల మామ మంచు అల్లుడు కంచు చిత్రాలకు దర్శకత్వం వహించాను.
*నాగార్జునతో చేసిన ఢమరుకం చిత్రం మంచి పేరు తెచ్చింది. నాగార్జున కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమాకోసం మూడేళ్లు కష్టపడి స్క్రిప్ట్ వర్క చేశాం.
*త్వరలో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. ఢమరుకం స్థాయిలో ఒక భారీ బడ్జెట్ మూవీ కూడా ఉంటుంది. వివరాలు త్వరలో తెలుస్తాయి.
*దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటరీలను రూపొందించే అవకాశం నాకు కలిగింది. దానికోసం సినిమాలను వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ అంటే నాకు అంత అభిమానం.
*రావులపాలేనికి చెందిన పడాల రామిరెడ్డి, మేడపాటి రామిరెడ్డి నాకు మంచి మిత్రులు. అక్కాబావలది పక్కనే ఉన్న కొమరాజులంక గ్రామం.
*ఈవీవీ సత్యనారాయణ నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయనతో కలసి పని చేసే అవకాశం రాలేదు కానీ ఆయనను గురువుగా భావిస్తాను. ఒకరకంగా చెప్పాలంటే నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని.