breaking news
Russian billionaire
-
భలే మంచి చౌక బేరము
అమాడెయా.. ఓ భారీ విలాసవంతమైన పడవ. దీనిని అమెరికా ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. వాస్తవ ధర సుమారు రూ.3 వేల కోట్లు కాగా, అనేక కారణాలతో దీనిని సుమారు రూ.వెయ్యి కోట్లకే ఇవ్వాలనుకుంటోంది. రష్యాకు చెందిన చమురు వ్యాపారి, అపర కుబేరుడు సులేమాన్ కెరిమోవ్ మోజుపడి తయారు చేయించుకున్న పడవ ఇది. 2017లో నిర్మించిన ఈ పడవలో 6 డెక్కులున్నాయి. ఆధునిక వసతులతో కూడిన ఎనిమిది భారీ గదులు, జిమ్, సినిమా థియేటర్, లాబ్‌స్టర్ ట్యాంక్, పియానో రూం, స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక మసాజ్ సెంటర్‌తోపాటు హెలిప్యాడ్ కూడా అమాడెయాలో ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన వేళ ఆ దేశంపై అమెరికా మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. తమ దేశాల్లోని రష్యా ప్రభుత్వ, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రముఖుల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని అమ్మేసి, ఆ డబ్బును ఉక్రెయిన్‌కు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం క్లెప్టోక్యాప్చర్ టాస్క్‌ఫోర్స్‌ను 2022లో ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలిసిన రష్యా చమురు వ్యాపారి సులేమాన్ కెరిమోవ్ తన అమాడెయా అనే భారీ పడవను సుదూరంగా ఉన్న ఫిజీలోని మారుమూల దీవిలో దాచి ఉంచాడు. అమెరికా నిఘా సంస్థలు, క్లెప్టో క్యాప్చర్ టాస్క్‌ఫోర్స్ దీని జాడను కనిపెట్టాయి. ఫిజీ నుంచి దీనిని అమెరికాకు తీసుకువచ్చాయి. ఇది సుమారు మూడేళ్ల క్రితం ఘటన. అప్పటి నుంచి అమాడెయా శాన్‌డియాగో తీరంలో ఉంది. ఫిజీ నుంచి తరలింపు, నిర్వహణ తదితరాలకే అమెరికా ప్రభుత్వం దీనిపై 3.2 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. స్వాధీనం చేసుకున్న సమయంలో దీని విలువను సుమారు రూ.2,000 కోట్లుగా నిర్థారించారు. అయితే, ప్రస్తుత విలువ రూ.700 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నట్లు నిపుణులు మదింపు చేశారు. ప్రపంచంలోని 50 మంది నుంచి 100 మంది వరకు ఉన్న అత్యంత ధనవంతులకే ఇలాంటి బోట్‌ను కొనగలిగే సత్తా ఉందని అంచనా వేశారు.న్యాయ వివాదం..అమాడెయా వాస్తవ యజమాని ఎవరనే విషయమై మూడేళ్లుగా న్యాయపోరాటం సాగుతోంది. ఇది తమదేనంటూ అసలు యజమాని, రష్యా బిలియనీర్ అయిన సులేమాన్ కెరిమోవ్తోపాటు రష్యా ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ మాజీ అధికారి ఎడ్వర్డ్ ఖుదైనటోవ్, మిల్లిమారిన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ న్యూయార్క్ కోర్టులో పిటిషన్లు వేశాయి. అయితే, కెరిమోవ్ అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఈ పడవ యాజమాన్య హక్కులు అమెరికాకే ఉంటాయని 2023 మార్చిలో న్యూయార్క్ సర్క్యుట్ కోర్టు జడ్జి డేల్ హో ప్రకటించారు. దీంతో, అమెరికా ప్రభుత్వం ఇటీవల దీనిని వేలానికి పెట్టింది. వేలం పాటలో పాల్గొనే వారు కోటి డాలర్లను డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, క్లెప్టోక్యాప్చర్ టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్న అమాడెయా వంటి అనేక పడవలు, విమానాలు, విలాసవంతమైన ఆస్తుల్లో చాలావరకు ప్రస్తుతం న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎడ్వర్డ్ ఖుదైనటోవ్ మాత్రం అమెరికా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. న్యూయార్క్ సర్క్యూట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేశామని, నవంబర్‌లో తీర్పు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తీర్పు తమకు అనుకూలమైతే అమాడెయా పూర్తి విలువను అమెరికా ప్రభుత్వం చెల్లించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓ పెళ్లి ఖర్చు రూ. 6,800 కోట్లు
మాస్కో: ఎవరైనా విలాసవంతంగా వివాహం జరిపిస్తే ఆకాశమంత పందిరివేసి, భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా చేశాడంటాం అతిశయోక్తిగా. అదే తరహాలో కజక్‌లో పుట్టి రష్యాలో ప్రపంచ చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగిన మిహాయిల్ గుత్సరీవ్ తన 28 కుమారుడి పెళ్లిని అంతకంటే వైభవోపేతంగా జరిపించారు. మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్, సఫియా బాంక్వెట్ హాల్లో పుష్పాలంకృత భారీ వేదికపై శనివారం జరిగిన ఈ పెళ్లికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయన్నది ఓ అంచనా. వజ్రాలు పొదిగిన పెళ్లి కూతురు శ్వేతవర్ణపు వెడ్డింగ్ డ్రెస్కే 16.20 లక్షల రూపాయలట. ప్రముఖ డిజైనర్ నేసిన దీన్ని పారిస్ నుంచి తెప్పించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 28 ఏళ్ల గుత్సరీవ్, 20 ఏళ్ల విద్యార్థి ఖదీజా ఉజకోవ్లు పెళ్లి చేసుకున్నారు. జెన్నీఫర్ లోపెజ్, ఎన్రిగ్ ఇగ్లేసియాస్ లాంటి సెలబ్రిటీలు ఆహుతులను అలరించారు. ఇంతవైభవంగా పెళ్లి జరిపించిన చమురు దిగ్గజం మిహాయిల్కు 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. -
కంచికి చేరిన ఖరీదైన బ్రేకప్!
జెనీవా: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసు ఎట్టకేలకు ఒక అంగీకారానికి వచ్చింది. దాదాపు 4.2 బిలియన్ డాలర్లు (రూ. 27,358 కోట్ల) భరణం చెల్లించాలంటూ ఈ కేసులో కోర్టు 2014లో తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ప్రమేయం లేకుండా వీడిపోయేందుకు సదరు భార్యభర్తలు అంగీకరించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా పేరొందిన ఈ కథేమిటంటే! రష్యన్ కుబేరుడు దిమిత్రి రిబోలోవ్లెవ్, ఆయన భార్య ఎలెనా 23 ఏండ్లు కలిసి కాపురం చేసి.. 2008లో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. అప్పటినుంచి భరణం ఎంత చెల్లించాలనే విషయమై ఇద్దరి మధ్య వివాదం న్యాయస్థానాల్లో నలుగుతున్నది. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్లబ్ యాజమాని, బిలియనీర్ అయిన రిబోలోవ్లెవ్ సంపదను లెక్కగట్టే విషయంలో ప్రధానంగా చిక్కుముడి తలెత్తింది. రిబోలోవ్లెవ్ 2005లో తన కంపెనీ వాటాలన్నింటినీ ఓ ట్రస్టుకు బదలాయించారు. ఆ తర్వాత మూడేళ్లకు వాటిని అమ్మారు. అయితే రిబోలోవ్లెవ్ సంపదను 2005 వాటాల ప్రకారం లెక్కించారని, 2008లో పెరిగిన వాటాల విలువ ప్రకారం ఆయన సంపదను గణించాలని ఎలెనా తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కోర్టు ఎలెనాకు నాలుగు బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (4.2 బిలియన్ డాలర్ల) భరణం చెల్లించాలని 2014 మేలో ఆదేశాలు ఇచ్చింది. రిబోలోవ్లెవ్ సంపదలో ఇది సగానికి సమానం. ప్రపంచంలోనే ఆల్‌టైమ్ ఖరీదైన విడాకులు కేసుగా ఇది అప్పట్లో పేరొందింది. దీంతో ఆయన గత ఏడాది జూన్‌లో అప్సీల్స్ కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు ఆదేశాలను ఈ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలపైనా ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ మాజీ భార్యాభర్తలు విడాకుల నిబంధనల విషయంలో ఒక అంగీకారానికి వచ్చినట్టు మంగళవారం ప్రకటించారు. విడాకుల ఒప్పందానికి సంబంధించిన నియమనిబంధనలపై ఒక అంగీకారానికి వచ్చామని, దీంతో ఈ విషయమై న్యాయస్థానాల్లో జరుగుతున్న కేసులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నమని వారు ప్రకటించారు. అయితే విడాకుల భరణంగా ఎంతమొత్తం చెల్లించనున్నది ప్రకటించలేదు. తమ విడాకుల వ్యవహారంలో ఇక కోర్టు ప్రమేయం ఉండబోదని వారు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. అత్యంత సంపన్నుడైన రిబోలోవ్లెవ్కు పెయింటింగ్ కళాకండాలను సేకరించే అలవాటు ఉంది. అయితే పికాసో, డెగాస్, పాల్ గౌగ్విన్ వంటి కళాకారుల పెయింటింగ్‌లను తనకు అధిక ధరకు విక్రయించినట్టు స్విస్ ఆర్ట్ డీలర్ య్వెస్ బౌవియర్పై విమర్శలు చేసి.. ఇటీవల ఆయన మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు.


