భలే మంచి చౌక బేరము | US to auction 325 million dollers Russian superyacht | Sakshi
Sakshi News home page

భలే మంచి చౌక బేరము

Sep 13 2025 6:24 AM | Updated on Sep 13 2025 6:24 AM

US to auction 325 million dollers Russian superyacht

రూ.3 వేల కోట్ల పడవ రూ.1,000 కోట్లకే అమ్మకానికి పెట్టిన అమెరికా ప్రభుత్వం

రష్యాపై ఆంక్షల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న అమాడెయా

అమాడెయా.. ఓ భారీ విలాసవంతమైన పడవ. దీనిని అమెరికా ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. వాస్తవ ధర సుమా­రు రూ.3 వేల కోట్లు కాగా, అనేక కారణా­లతో దీనిని సుమారు రూ.వెయ్యి కోట్లకే ఇవ్వాలనుకుంటోంది. రష్యాకు చెందిన చ­ము­రు వ్యాపారి, అపర కుబేరుడు సులే­మాన్‌ కెరిమోవ్‌ మోజుపడి తయారు చేయించుకున్న పడవ ఇది. 2017లో నిర్మించి­న ఈ పడవలో 6 డెక్కులున్నాయి. ఆధు­నిక వసతులతో కూడిన ఎనిమిది భారీ గ­దు­లు, జిమ్, సినిమా థియేటర్,  లాబ్‌స్టర్‌ ట్యాంక్, పియానో రూం, స్విమ్మింగ్‌ పూల్, అత్యాధునిక మసాజ్‌ సెంటర్‌తోపాటు హెలిప్యాడ్‌ కూడా అమాడెయాలో ఉంది. 

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొ­దలుపెట్టిన వేళ ఆ దేశంపై అమెరికా మిత్ర­దేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. తమ దేశాల్లోని రష్యా ప్రభుత్వ, బడా పారి­శ్రా­మిక వేత్తలు, వ్యాపార ప్రముఖుల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని అమ్మేసి, ఆ డబ్బును ఉక్రెయిన్‌కు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం క్లెప్టోక్యాప్చర్‌ టాస్క్‌ఫోర్స్‌ను 2022లో ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలిసిన రష్యా చమురు వ్యా­పారి సులేమాన్‌ కెరిమోవ్‌ తన అమాడెయా అనే భారీ పడవను సుదూరంగా ఉన్న ఫిజీ­లోని మారుమూల దీవిలో దాచి ఉంచా­డు. 

అమెరికా నిఘా సంస్థలు, క్లెప్టో క్యాప్చర్‌ టాస్క్‌ఫోర్స్‌ దీని జాడను కనిపెట్టాయి. ఫిజీ నుంచి దీనిని అమెరికాకు తీసుకు­వచ్చాయి. ఇది సుమారు మూడేళ్ల క్రితం ఘటన. అప్పటి నుంచి అమాడెయా శాన్‌­డియాగో తీరంలో ఉంది. ఫిజీ నుంచి తరలింపు, నిర్వహణ తదితరాలకే అమెరికా ప్రభుత్వం దీనిపై 3.2 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. స్వాధీనం చేసుకున్న సమయంలో దీని విలువను సుమారు రూ.2,000 కోట్లుగా నిర్థారించారు. అయితే, ప్రస్తుత విలువ రూ.700 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నట్లు నిపుణులు మదింపు చేశారు. ప్రపంచంలోని 50 మంది నుంచి 100 మంది వరకు ఉన్న అత్యంత ధనవంతులకే ఇలాంటి బోట్‌ను కొనగలిగే సత్తా ఉందని అంచనా వేశారు.

న్యాయ వివాదం..
అమాడెయా వాస్తవ యజమాని ఎవరనే విషయమై మూడేళ్లుగా న్యాయపోరాటం సాగుతోంది. ఇది తమదేనంటూ అసలు యజమాని, రష్యా బిలియనీర్‌ అయిన సులేమాన్‌ కెరిమోవ్‌తోపాటు రష్యా ఇంధ­న సంస్థ రోస్‌నెఫ్ట్‌ మాజీ అధికారి ఎడ్వర్డ్‌ ఖుదైనటోవ్, మిల్లిమారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ న్యూయార్క్‌ కోర్టులో పిటిషన్లు వేశా­యి. అయితే, కెరిమోవ్‌ అమెరికా ఆంక్షల­ను ఉల్లంఘించినందుకు ఈ పడవ యాజ­మాన్య హక్కులు అమెరికాకే ఉంటాయని 2023 మార్చిలో న్యూయార్క్‌ సర్క్యుట్‌ కోర్టు జడ్జి డేల్‌ హో ప్రకటించారు. దీంతో, అమెరికా ప్రభుత్వం ఇటీవల దీనిని వేలా­నికి పెట్టింది. 

వేలం పాటలో పాల్గొనే వారు కోటి డాలర్లను డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉం­టుంది. కాగా, క్లెప్టోక్యాప్చర్‌ టాస్క్‌ ఫో­ర్స్‌ ద్వారా స్వాధీనం చేసుకున్న అమాడె­యా వంటి అనేక పడవలు, విమానాలు, విలాసవంతమైన ఆస్తుల్లో చాలావరకు ప్ర­స్తు­తం న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటు­న్నాయి. ఎడ్వర్డ్‌ ఖుదైనటోవ్‌ మాత్రం అమె­రికా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరో­పిస్తున్నారు. న్యూయార్క్‌ సర్క్యూట్‌ కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేశామని, నవంబర్‌లో తీర్పు వచ్చే అవకాశముందని చెబుతు­న్నా­రు. తీర్పు తమకు అనుకూలమైతే అమా­డెయా పూర్తి విలువను అమెరికా ప్రభుత్వం చెల్లించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement