breaking news
Rushikonda it park
-
విశాఖలో ఇన్ఫోసిస్ 28న ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కార్యకలాపాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రుషికొండ ఐటీ పార్క్ హిల్ నం.2లో భారీ భవన నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ సన్నద్ధమవుతోంది. గతంలో శాటిలైట్ ఆఫీస్ పెడతామని ప్రకటించిన ఇన్ఫోసిస్.. ఇప్పుడు డెవలప్మెంట్ సెంటర్‌గా అభివృద్ధి చేసింది. తొలివిడతలో 650 మంది సామర్థ్యంతో సేవలకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే 1000 మందితో సెంటర్ నడిపేందుకు సిద్ధమవుతోంది. తమ క్యాంపస్‌కు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న అభ్యర్థుల్ని ఇప్పటికే ఇన్ఫోసిస్ ఆహ్వానించినట్లు సంస్థ అధికారులు ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులో తెలిపారు. (ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?) రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేస్తుండటంతో దిగ్గజ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. దీంతో సాగరనగరం విశాఖపట్నం సరికొత్త కళ సంతరించుకుంటోంది. రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన సాగించనున్నట్లు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మే 3వ తేదీన విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేశారు. రూ.14,634 కోట్లతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల దాదాపు 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా మారనుంది. విప్రో, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. అతి త్వరలోనే విశాఖపట్నం ఐటీ హబ్‌గా అవతరించనుందని ఐటీ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ ) -
ఆశలన్నీ విశాఖ ‘ఐటీ’ పైనే
సాక్షి, విశాఖపట్నం: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడి వనరుల్ని ఉపయోగించుకుని ఐటీ పరిశ్రమ ఎదిగేలా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై విశాఖలోని రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ (రిట్పా), విశాఖ అభివృద్ధి మండలి (వీడీసీ) ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. ఈ ప్రణాళికను కాబోయే ముఖ్యమంత్రికి ఇవ్వనున్నట్లు ఈ సంఘాల ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ చెప్పారు. ఇక్కడ 70 ఐటీ కంపెనీలు, నాలుగు ఎస్ఈజెడ్లు ఉన్నాయి. 10,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్న విశాఖ ఐటీరంగ వార్షిక వ్యాపారం రూ.1,450 కోట్లు. ఇప్పటివరకు ఇక్కడ ఐటీ రంగం నిర్లక్ష్యానికి గురైంది. ఐటీ కంపెనీలు, ఉద్యోగుల బ్యాంకింగ్, ఇతర సమావేశాల నిర్వహణ కోసం 2012లో ఐటీ మంత్రి పొన్నాల రూ.23 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి విశాఖలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ అది పునాదుల దశ దాటలేదు. రెండో ఇంక్యుబేషన్ సెంటర్‌కు ఎస్టీపీఐ రూ.16 కోట్లు ఇచ్చినా ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు. ప్రసుత్తం విశాఖలోని 70 కంపెనీల్లో 20 వరకే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. నాలుగు సెజ్‌లలో రెండే నడుస్తున్నాయి. దీంతో 2014-2015కి రూ.5 వేల కోట్లు దాటాల్సిన టర్నోవర్ రూ.1,450 కోట్ల వద్ద, 70 వేలు దాటాల్సిన ఉద్యోగుల సంఖ్య 10,200 వద్ద ఆగిపోయాయి. ఎస్ఈజెడ్కు వచ్చిన కంపెనీలు బ్యాంకు రుణాలు తెచ్చుకునేందుకు నిబంధనలు అడ్డంకిగా మారాయి. విశాఖకు రూ. 50 వేల కోట్లతో ఐటీఐఆర్ ప్రకటించారు. దీనికోసం 10 వేల ఎకరాల భూముల సేకరణకు హడావుడి చేసినా ప్రస్తుతం దాని ఊసే లేదు. అన్నింటికిమించి వేసవిలో అధిక విద్యుత్ వాడకం పేరుతో ఐటీ కంపెనీల నుంచి యూనిట్‌కు రూ.50 చొప్పున ట్రాన్స్‌కో వసూలు చేయటం మరింత ఇబ్బందిగా మారింది. కొత్త రాష్ట్రంలో అయినా విశాఖలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని నిపుణులు ఆశిస్తున్నారు. రిట్పా, వీడీసీ రూపొందించిన ప్రణాళికలోని కీలకాంశాలు * ప్రస్తుతమున్న ఐటీ ఎస్ఈజెడ్లను డీ నోటిఫై చేయాలి. తద్వారా ఖాళీగా ఉన్న సెజ్‌ల్లోకి కొత్త కంపెనీలు వస్తాయి. ఠ చాలా ఐటీ కంపెనీలు నిర్మాణాలు పూర్తిచేసి రకరకాల అనుమతుల సమస్యలతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. వాటిల్లో ఏవైనా కొత్త కంపెనీలు ప్రారంభించేలా నిబంధనలు మార్చితే సీమాంధ్రలో 25 నుంచి 40 వరకు వరకు కొత్త ఐటీ కంపెనీలు రావచ్చు. * వైజాగ్, విజయవాడ, తిరుపతి, కాకినాడ నగరాల్లో 10 లక్షల నుంచి 25 లక్షల ఎస్ఎఫ్టీతో కూడిన ఐటీ పార్కులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. సత్వరమే అనుమతులు మంజూరయ్యేలా సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ప్రవేశపెట్టాలి. ఉన్నతాధికారులను నియమించి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అండగా నిలబడాలి. కొత్త ఐటీ పార్క్‌లను అభివృద్ధి చేసుకునే వారికి రెండువారాల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి అనుమతులు ఇచ్చేలా చూడాలి. * కంపెనీలు ప్రారంభించే యాజమాన్యాలు ఆర్థికంగా నిలదొక్కుకునేవరకు మూడేళ్లపాటు మున్సిపల్, ఇతర పన్నులు లేకుండా చూడాలి. ఒక్కో ఐటీ పార్క్‌లో తక్కువ ఖర్చుతో గుజరాత్ తరహాలో ప్రభుత్వం ఉచిత బ్యాండ్‌విడ్త్ సౌకర్యం తీసుకురావాలి. * సాఫ్ట్వేర్ లెసైన్స్‌లు లేకుండా చేసి బదులుగా ఒక్కో కంపెనీ కనీసం 50 మందికిపైగా ఉద్యోగులను అదనంగా చేర్చుకునే విధానం తేవాలి. * ఐటీ కంపెనీలకు నిరంతర విద్యుత్ అవసరం. ఐటీ ప్రగతిబాటలో పయనించడానికి ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో సోలార్‌పవర్ వాడకానికి అనుమతులు ఇవ్వాలి. * 10 లక్షల ఎస్ఎఫ్టీతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఐటీ పార్క్ నిర్మించి హైటెక్‌సిటీ తరహాలో కంపెనీలకు కేటాయించాలి. వరుసగా మూడేళ్లు 50 శాతం అద్దె రాయితీ ప్రకటిస్తే కొత్త కంపెనీలను ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని అనేక కంపెనీలు ఇక్కడకు తొందరగా వచ్చి కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తిచూపుతాయి. * వీటన్నింటి ద్వారా రూ.1,500 కోట్లకుపైగా ఐటీ వ్యాపారం జరగడమేకాకుండా ప్రత్యక్షంగా 15 వేలమందికి ఐటీ ఉద్యోగాలు, పరోక్షంగా 45 వేలమందికి ఉపాధి కల్పించవచ్చు. భారీగా అనుబంధ రంగాలు వృద్ధిచెందుతాయి.