breaking news
Ruqia Hassan
-
25ఏళ్లలో 2300మంది జర్నలిస్టుల మృతి
బ్రస్సెల్స్: ప్రపంచంలో గడచిన పాతికేళ్ల కాలంలో జర్నలిస్టులు, ఇతర మీడియా సిబ్బంది కనీసం 2,297 మంది విధి నిర్వహణలో మరణించారు. ఏదో మూల జరుగుతున్న యుద్ధం, తిరుగుబాటు, నేరాలు ఘోరాలు, రాజకీయ, సామాజిక అవినీతికి సంబంధించిన వార్తలను వారు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడమే వారు చేసిన పాపం. హంతకులు మాత్రం శిక్షలు పడకుండా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. 1990 సంవత్సరంలో 40 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో మరణించగా, 2010 నుంచి ఆ సంఖ్య వందకు దాటిందని, అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య 1990లో ఏర్పడిందని, అప్పటి నుంచే విధి నిర్వహణలో హత్యలకు గురైన జర్నలిస్టుల వివరాలను సమాఖ్య సేకరిస్తూ వచ్చిందని, గత దశాబ్దకాలంలో మాత్రం జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా తయారైందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆంతోని బెల్లాంగర్ నివేదికలో తెలిపారు. 2006 సంవత్సరంలోనైతే ఏకంగా 155 మంది జర్నలిస్టులు అంతర్జాతీయంగా హత్యలకు గురయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 39 మంది జర్నలిస్టులు బలయ్యారని, వారిలో 22 మంది ఒక్క ఇరాక్‌లోనే మరణించారని నివేదిక తెలిపింది. సిరియాలో అంతర్యుద్ధ పరిస్థితులను కవర్ చేయడానికి వెళ్లిన అమెరికా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జేమ్స్ ఫోలే హత్యతో సిరియా, ఇరాక్లలో జర్నలిస్టుల హత్యాకాండ ప్రారంభమైంది. ఇస్లామిక్ టైర్రరిస్టులు జేమ్స్ ఫోలే తల నరికి చంపేసి ప్రపంచానికి ఆ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పటి వరకు సిరియా, ఇరాక్లలో 39 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోగా కేవలం పది కేసుల్లో మాత్రమే విచారణ జరిగిందని, అందులోనూ సగం కేసుల్లోనూ నేరస్థులకు శిక్షలు పడలేదని నివేదిక పేర్కొంది. సంఘర్షణలు జరుగుతున్న దేశాల్లో కొనసాగుతున్న ప్రొఫెషనల్ జర్నలిస్టుల హత్యలపై బ్రిటన్ పార్లమెంట్లో సోమవారం చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో నివేదికలోని కొన్ని అంశాలను మాత్రమే తాము విడుదల చేస్తున్నామని బెల్లాంగర్ మీడియాకు తెలిపారు. మరో 15 రోజుల్లో పూర్తి నివేదికను విడుదల చేస్తామని చెప్పారు. ఒక్క సంఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతాల్లోనే కాకుండా రాజకీయ అవినీతి కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చిన జర్నలిస్టులు కూడా కిడ్నాప్‌లకు గురై హతమవుతున్న సంఘటనలు ఉన్నాయని బెల్లాంగర్ తెలిపారు. మెక్సికోలో మాదక ద్రవ్యాల వ్యాపార ముఠాలు కూడా ఆ దేశంలో 120 మంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకున్నాయని ఆయన వివరించారు. -
మహిళా జర్నలిస్టును చంపేసిన ఐఎస్ఐఎస్
సిరియాలోని రక్కా ప్రాంతంలో పౌర జర్నలిస్టుగా పనిచేస్తూ.. స్థానిక విషయాలను ప్రపంచానికి వెల్లడిస్తున్న ఓ మహిళను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు అమానుషంగా ఉరి తీసింది. ఐఎస్ఐఎస్ చంపేసిన తొలి మహిళ ఆమెనని సిరియా మీడియా తెలిపింది. రుఖియా హసన్ మరణంతో గత అక్టోబర్ నుంచి ఐఎస్ఐఎస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన విలేకరుల సంఖ్య ఐదుకు చేరిందని సిరియన్ జర్నలిస్టు సంస్థ 'సిరియా డైరెక్ట్' తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ అండ్ లెవాంట్ అధీనంలో ఉన్న రక్కా ప్రాంతంలో మానవ దైనందిన జీవితం గురించి రుఖియా హసన్ నిసాన్ ఇబ్రహీం పేరుతో ఫేస్బుక్లో నిత్యం వార్తలు అందించేది. స్వతంత్ర జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆమెను ఉరితీయడాన్ని సిరియా మానవ హక్కుల సంస్థ (ఆర్బీఎస్ఎస్) ధ్రువీకరించింది. 'నేను రక్కాలో ఉన్నాను. నన్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఐఎస్ఐఎస్ నన్ను అరెస్టుచేసి చేసి చంపేయవచ్చు. అయినా ఫర్వాలేదు. ఐఎస్ఐఎస్ అవమానాల మధ్య జీవించడం కంటే హుందాగా చనిపోవడం మేలు' అని ఆమె చివరి వ్యాక్యాలను ఆర్బీఎస్ఎస్ స్థాపకుడు అబు మహమ్మద్ శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. రఖ్కా నగరంలో వై-ఫై హాట్స్పాట్లను ఐఎస్ఐఎస్ నిషేధించడాన్ని తన చివరి ఫేస్బుక్ పోస్టులో హసన్ తీవ్రంగా తప్పుబట్టింది. వై-ఫై, ఇంటర్నెట్ సేవలను ఇస్లామిక్ స్టేట్ నిలిపివేసినా.. తమ సందేశాలను మోసుకెళ్లే పావురాళ్లను ఏమీ చేయలేదని పేర్కొన్నారు. హసన్ గత ఏడాది జూలై 21 నుంచి కనిపించడం లేదు. గూఢచర్యం ఆరోపణలపై ఆమెను ఉరితీసినట్టు మూడురోజుల కిందట హసన్ కుటుంబసభ్యులకు ఐఎస్ఐఎస్ సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.