breaking news
in road accident
-
రెప్పపాటులో ఘోరం..
విజయనగరం టౌన్ : రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. స్కూల్ నుంచి తిరిగొచ్చి ఇంటి వద్ద హాయిగా ఆడుకుంటున్న ఆ చిన్నారి అప్పుడే రోడ్డుమీదకు సైకిల్ పట్టుకుని వచ్చాడు. ఇంతలోనే రాంగ్రూట్లో అతి వేగంతో వచ్చిన లారీ ఆ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదానికి సంబంధించి ట్రాఫిక్ ఎస్సై రాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అశోక్ నగర్లో నివాసముంటున్న ఎర్రయ్య, లక్ష్మి దంపతులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. చిన్నవాడైన గనగల చిన్న (12) సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. సుమారు ఆరు గంటల ప్రాంతంలో సైకిల్ తీసుకుని ఇంటి నుంచి రోడ్డుపైకి వస్తుండగా, కొత్తపేట వాటర్‌ట్యాంక్ నుంచి రింగురోడ్డు మీదుగా దాసన్నపేట వైపు రాంగ్రూట్లో వస్తున్న ఇసుక లారీ చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చూసిన చిన్న అన్నయ్య లక్ష్మణ వెంటనే పరుగు పరుగున వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. మృతిచెందిన చిన్న స్థానిక అశోక్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
-మరొకరికి తీవ్రగాయాలు ఒంగోలు క్రైం : రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు రోడ్డుపై ఒంగోలు–పేర్నమిట్ట మధ్య పాలకేంద్రం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మోటారు సైకిల్‌ను టిప్పర్ ఢీకొన్న ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్న కురిచేడు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన మాలెపాటి మహేష్ (26) అక్కడికక్కడే మృతిచెందగా, బొల్లేపల్లి శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వీరిద్దరూ ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించిన వాయిదాకు ఒంగోలులోని కోర్టుకు హాజరవుతుండగా ప్రమాదం జరిగింది. వీరితో పాటు మరో ఆరుగురు ఇదే కేసు వాయిదా కోసం ఆటోలో ఒంగోలు వచ్చారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మిగతావారంతా కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ పెయ్యల రమేష్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రమేష్‌బాబు తెలిపారు. వివాహమైన మూడు నెలలకే మృతి... కురిచేడు: కోర్టుకు హాజరవుతూ టిప్పర్ ఢీకొని మరణించిన మాలెపాటి మహేష్‌కు వివాహమై మూడు నెలలే గడిచింది. కాళ్ల పారాణి ఆరకముందే భర్త మరణించడంతో భార్యతో పాటు ఎదిగిన కుమారుని మృతి తో తల్లిదండ్రులు, చెల్లెలు విలవిల్లాడారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలవడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.