
విజయనగరం టౌన్ : రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. స్కూల్ నుంచి తిరిగొచ్చి ఇంటి వద్ద హాయిగా ఆడుకుంటున్న ఆ చిన్నారి అప్పుడే రోడ్డుమీదకు సైకిల్ పట్టుకుని వచ్చాడు. ఇంతలోనే రాంగ్‌రూట్‌లో అతి వేగంతో వచ్చిన లారీ ఆ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదానికి సంబంధించి ట్రాఫిక్ ఎస్సై రాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అశోక్ నగర్‌లో నివాసముంటున్న ఎర్రయ్య, లక్ష్మి దంపతులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
వీరికి ఇద్దరు కుమారులున్నారు. చిన్నవాడైన గనగల చిన్న (12) సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. సుమారు ఆరు గంటల ప్రాంతంలో సైకిల్ తీసుకుని ఇంటి నుంచి రోడ్డుపైకి వస్తుండగా, కొత్తపేట వాటర్‌ట్యాంక్ నుంచి రింగురోడ్డు మీదుగా దాసన్నపేట వైపు రాంగ్‌రూట్‌లో వస్తున్న ఇసుక లారీ చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ సంఘటన చూసిన చిన్న అన్నయ్య లక్ష్మణ వెంటనే పరుగు పరుగున వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. మృతిచెందిన చిన్న స్థానిక అశోక్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.