breaking news
Reuters/Ipsos poll
-
యుద్ధంతో ప్రయోజనమే లేదు
ఇరాన్‌తో అమెరికా మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. యుద్ధ సమయంలో ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఇరాన్ ముగించింది. దీంతో హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. ఇరు దేశాలు శాశ్వత శాంతి కోసం కృషి చేస్తున్నాయి. ఇంతా చేసి ఈ నాలుగు నెలల యుద్ధంలో అమెరికా సాధించిందేమిటి? అగ్ర రాజ్యానికి 40 బిలియన్ డాలర్ల నష్టం మిగిల్చిన ఈ యుద్ధానికి తగిన ఫలితం వచ్చిందా? ఇదే విషయంపై రాయిటర్స్/ఇప్సోస్ జూన్ 18–22 మధ్య అమెరికాలో సర్వే నిర్వహించింది. ఇంతా చేస్తే అసలు ఈ సంఘర్షణకు విలువే లేదంటున్నారు సర్వేలో పాల్గొన్న సగం మంది అమెరికన్లు. యుద్ధానికి అయిన ఖర్చుకు తగిన ఫలితం సాధించిందని పావు వంతు అమెరికన్లు మాత్రమే నమ్ముతున్నారు. మరో పావు వంతు మాత్రం ఏమీ చెప్పలేమంటున్నారు. అమెరికా అగ్రరాజ్యం అంటే... ప్రపంచానికి పెద్దన్న పాత్ర. అలాంటి దేశానికి అధ్యక్షుడంటే ఎంతటి ప్రజామోదం ఉండాలి. కానీ.. యుద్ధ కాంక్షతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ తగ్గింది. రెండో పదవీకాలంలో అత్యల్ప స్థాయికి వచ్చింది. ఆయన ఆమోద రేటింగ్ 34%కి పడిపోయింది. ఇక, ప్రజల జీవన వ్యయంపై ట్రంప్‌కు ఆమోదం 22 శాతంగా ఉంది, ఇది ఆయన అధ్యక్ష పదవీకాలంలోనే అత్యల్ప స్థాయి. అంతేకాక, వైట్‌హౌస్‌లో ఆయనకు ముందున్న డెమొక్రటిక్ అధ్యక్షుడు జో బైడెన్ తన అధ్యక్ష పదవీకాలం చివరిలో పొందిన రేటింగ్ కంటే కూడా ఇది తక్కువ. బలహీన స్థితిలో అమెరికా ఇరాన్‌పై దాడులకు ఆదేశించడానికి ముందు ఉన్న దానికంటే అమెరికా ఇప్పుడు మరింత బలహీనమైన స్థితిలో ఉందని 35% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అయితే, యుద్ధానికి ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇరాన్‌తో అమెరికా మరింత బలమైన స్థితిలో ఉందని కేవలం 23% మంది అమెరికన్లు మాతమ్రే నమ్ముతున్నారు. వీరిలో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్‌కి చెందినవారు సగం మంది మాత్రమే ఉండటం గమనార్హం. శాంతి ఒప్పందం నిలవదు.. మరి ఈ మధ్యంతర శాంతి ఒప్పందంపై మెజారిటీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒప్పందమైనా ఎక్కువ కాలం నిలస్తుందా అంటే? కష్టమేనంటున్నారు. ఇక, ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం జరిగే అవకాశం లేనే లేదని 63% మంది అమెరికన్లు చెబుతున్నారు. రిపబ్లికన్లలో దాదాపు సగం మంది, డెమొక్రాట్లలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే.. శాశ్వత శాంతి సాధ్యమవుతుందని 18 శాతం మంది నమ్ముతున్నారు. దీనిని విశ్వసించే వారిలో 34 శాతం రిపబ్లికన్లు, వీరిలో 10 శాతం డెమొక్రాట్లు ఉండటం గమనార్హం. పెరిగిన ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని, ఖరీదైన విదేశీ యుద్ధాలకు అమెరికాను దూరంగా ఉంచుతానని వాగ్దానం చేసి ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. కానీ, మే నెలలో అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం రేటు 4.2 శాతం పెరిగింది. 2023 తర్వాత ఇదే అత్యధికం. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలే జీవన వ్యయ పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. మధ్యంతర శాంతి ఒప్పందం ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గినా.. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ముందున్న ధరతో పోలిస్తే, గ్యాసోలిన్ ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఒక గ్యాలన్ సాధారణ పెట్రోల్ సగటు ధర 4.50 డాలర్లకు పైగా ఉన్న స్థాయి నుంచి 3.93 డాలర్లకు పడిపోయింది. అయితే, యుద్ధం ప్రారంభమవ్వడానికి ముందున్న ధరతో పోలిస్తే మాత్రం ఇది అధికమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: హారిస్‌కు మొగ్గు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మరోసారి స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆమెకు ఒక శాతం మొగ్గున్నట్టు మంగళవారం వెలువడ్డ రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వేలో తేలింది. శుక్రవారం నుంచి ఆదివారం దాకా జరిపిన ఈ మూడు రోజులు హారిస్‌కు 44 శాతం, ట్రంప్‌కు 43 శాతం మంది మద్దతిచ్చారు. 975 మంది నమోదైన ఓటర్లతో కలిపి మొత్తం 1,150 మంది అమెరికా పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఎకానమీ, నిరుద్యోగం, ఉపాధి వంటి అతి కీలకమైన అంశాల్లో ఏకంగా 47 శాతం మంది ట్రంప్‌కే ఓటేశారు. హారిస్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 37 శాతం మాత్రమే. మరో కీలకాంశమైన వలసల విషయంలో కూడా ట్రంప్ 48 శాతం మంది వైఖరిని సమర్థిస్తే హారిస్‌ను 33 శాతం మందే సమర్థించారు. కచ్చితంగా ఓటేస్తామన్న వారిలో 47 శాతం హారిస్‌ను, 46 శాతం ట్రంప్‌ను బలపరిచారు. హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి సర్వేలన్నీ ఆమెకే మొగ్గున్నట్టు తేల్చడం విశేషం. -
హిల్లరీ ఆధిక్యానికి 'ట్రంప్' గండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు తప్పవన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా రాయిటర్స్ వార్తా సంస్థ సంచలన సర్వే ఫలితాలను వెల్లడించింది. ప్రముఖ మార్కెటింగ్, సర్వే సంస్థ ఇప్సోతో కలిసి రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యానికి భారీగా గండికొట్టినట్లు తేలింది. ఎన్నికల్లో అక్రమాలు(రిగ్గింగ్) జరుగుతున్నాయంటూ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని అమెరికన్లు అర్థం చేసుకుంటున్నారని శుక్రవారం విడుదలైన రాయిటర్స్-ఇప్సో సర్వే ఫలితాల్లో వెల్లడైంది. అక్టోబర్ 14 నుంచి 20 మధ్య కాలంలో ట్రంప్ తన ఆధిక్యతను 40 శాతం నుంచి 44 శాతానికి పెంచుకున్నారని, అదే సమయంలో హిల్లరీ ఆధిపత్యానికి భారీగా తగ్గించగలిగారని సర్వేలో పేర్కొన్నారు. అక్టోబర్ 7-13 మధ్య హిల్లరీకి 44 శాతం, ట్రంప్ కు 37 శాతం మద్దతు దక్కింది. నిజానికి జాతీయ సరాసరిలో ఇప్పటికీ ట్రంప్ పై హిల్లరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ట్రంప్ కు 41.9 శాతం మద్దతు లభిస్తే అతని కంటే 6.2 శాతం ఎక్కువ అంటే, 48.1 శాతం ఆధిక్యత హిల్లరీకి ఉంది. పోలింగ్ కు ఇంకా రెండు వారాలు గడువుండటంతో ఆ మాత్రం తేడాను కూడా ట్రంప్ అధిగమిస్తాడనే అభిప్రాయం వ్యక్తమైంది. ట్రంప్ చేస్తోన్న రిగ్గింగ్ ఆరోపణలను సొంత పార్టీ కార్యకర్తలు కూడా క్రమంగా సమర్థిస్తున్నారని, ఒకవేళ హిల్లరీ గెలిచినా అది రిగ్గింగ్ వల్లే జరుగుతుందని 70 శాతం మంది రిపబ్లికన్లు నమ్ముతున్నట్లు సర్వే పేర్కొంది. ఇక ట్రంప్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు వాస్తవమేనని 62 శాతం మంది అమెరికన్లు నమ్ముతున్నట్లు సర్వే తెలిపింది. అయితే 'గతంలో ఆయన ఏం చేశారనేదానికంటే.. అధ్యక్షుడిగా ఏం చేస్తారనేదే ప్రధాన విషయం'అని ఓటర్లు వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్ తెలిపింది. 'గడిచిన వారంలో ట్రంప్ తన మద్దతును భారీగా పెంచుకున్నారు. పోలింగ్ తేదీకి మరో రెండు వారాలు సమయం ఉంది. ఈ లోపు జాతీయ సరాసరిలోనూ ఆయన హిల్లరీని అధిగమించడం ఖాయం'అని రిపబ్లికన్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ సర్వే అమెరికన్ల ఆకాంక్షకు అద్దం పట్టేలా ఉన్నదని ఆ పార్టీ అభిప్రాయపడింది. రిపబ్లికన్ పార్టీకే చెందిన మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్.. బానిసత్వం రద్దుచేసిన సందర్భంగా ఏ వేదికపై నుంచి మాట్లాడారో.. పెన్సిల్వేనియాలోని అదే గెట్టీస్ బర్గ్ లో డోనాల్ట్ ట్రంప్ కీలక ప్రసంగం చేయనున్నారు.


