breaking news
rembarsment fees
-
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం వద్దు
కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్: అనంతపురం అర్బన్:విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల చెల్లింపులో జా ప్యం చేయవద్దని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన తన చాంబర్లో బుధవారం సంక్షేమ శాఖల అధికారులుతో సమావేశమయ్యారు. ఫీజురీయిబర్స్‌మెంట్, ఉపకార వేతనాల చెల్లింపు ప్రక్రియపై సమీక్షించారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ (2013-14 సంవత్సరం) బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.30.28 కోట్లు నిధులను మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు నూరు శాతం చెల్లింపులు పూర్తి అయ్యాయన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి రూ.7.5 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.16 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ కు రూ.678 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖల కమీషనర్లతో మాట్లాడారు. బకాయిలను విడుదల చేసినట్లు వారు కలెక్టరుకు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి విద్యార్థులకు బకాయిలను చెల్లించాలని సూచించారు. 2014-15 సంవత్సరాలకు రెన్యూవల్, నూతన ఉపకార వేతనాలు పొందేందుకు ఈ నెల 30లోపు తమ అడ్మిషన్ల వివరాలను విద్యార్ధులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన నాలుగు జతల యూనిఫాంలు, బెడ్ షీట్స్, కార్పెట్లు, నోట్ బుక్స్, వర్క్ బుక్క్‌లను, కాస్మాటిక్ చార్జీల పంపిణీని శాఖ వారీగా సమీక్షించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చక్రపాణి, మైనారిటీ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటాడుతున్న ప్రభుత్వం
షరతుల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలామ్ బాబు నెల్లూరు (సెంట్రల్): విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సలామ్‌బాబు ధ్వజమెత్తారు. ఎలాంటి షరతుల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. సలామ్‌బాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎలాంటి షరతుల్లేకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారన్నారు. ఈ పథకంపై ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్‌పై టీడీపీ ప్రభుత్వం దెబ్బకొడుతోందని మండిపడ్డారు. ఆధార్‌కార్డు, పాన్‌కార్డు తదితర షరతులతో లబ్ధిదారులను తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పథకాన్ని దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలు సమయానికి అందడం లేదన్నారు. గడువును నెల రోజులు పెంచాలని కోరారు. విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల జారీకి తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికలకు ముందు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని బీరాలు పలికిన చంద్రబాబు తనకు అధికారం చేతికి రాగానే విద్యార్థులపై కక్ష సాధింపు ధోరణితో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం జేసీ రేఖారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్, నాయకులు, ఎస్.విశ్వ, బి.సత్య, హరి, పి.అకిల్, ఎస్కే హాజీ, శివ, బి శివ, ఎస్కే కరిముల్లా, జగదీష్, తులసి, నికిల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.