పిండిప్రోలు లో రాయల అంత్యక్రియలు
తిరుమలాయపాలెం: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో గురువారం జరిగారుు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నేతలు, ప్రజల సందర్శనార్థం సుభాష్‌చంద్రబోస్ మృతదేహాన్ని ఉంచిన నాయకులు సాయంత్రం పిండిప్రోలుకు తీసుకొచ్చారు. చిన్నతనంలోనే అజ్ఞాతంలోకి వెళ్లిన బోస్‌ని కడసారి చూసేందుకు పలు గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానాలు భారీగా తరలివచ్చారు. అంత్యక్రియల్లో సీపీఐ ఎంఎల్ కేంద్ర కమిటీ కార్యదర్శి డాక్టర్ యతీంద్రకుమార్ , కేంద్రకమిటీ సభ్యులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ చంద్రబోస్ ఆకస్మిక మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, ఆపార్టీ నేతలు డాక్టర్ కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, న్యూడెమోక్రసీ నేతలు చంద్రన్న, సాది నేని వెంకటేశ్వరరావు, కె.గోవర్దన్ సంతాపం తెలిపారు. రాయల మృతిపట్ల బీసీ సంక్షేమ సంఘంనేతలు కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ సంతాపం తెలిపారు.