breaking news
Ramesh nayak
-
మళ్లీ ఆడబిడ్డ పుడుతోందని..
ఉరవకొండ: మూడో సంతానంగానూ ఆడబిడ్డే పుడుతోందన్న కారణంతో ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని షేక్షానుపల్లి తండాలో జరిగింది. షేక్షానుపల్లి తండాకు చెందిన రమేష్ నాయక్, సుంకమ్మ దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికే ఐదేళ్లు, మూడేళ్లు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సుంకమ్మ ఆరు నెలల గర్భిణి. వారం క్రితం రమేష్ నాయక్ తన భార్యను కర్నూలులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించాడు. అక్కడ స్కానింగ్ చేసిన వారిని సుంకమ్మ ఆత్రుతగా తన కడుపులో ఉన్నది ఏ బిడ్డ అని అడిగింది. ఆడపాప అని చెప్పడంతో తీవ్ర ఆందోళన చెందింది. మూడో సంతానం కూడా ఆడబిడ్డ అయితే ముగ్గురి పోషణ భారంగా మారుతుందని, అబార్షన్ చేయించుకుంటానని చెప్పింది. ఏదైనా కానీ ఆందోళన చెందవద్దంటూ భర్త సముదాయించాడు. కానీ లోలోపలే కుమలిపోయిన సుంకమ్మ బుధవారం రాత్రి ఇంటి ఆవరణలోని చెట్టుకు ఊరేసుకుంది. గమనించి భర్త, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఒకే కాన్పులో ముగ్గురు జననం.. తల్లి మృతి
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి మండలం బత్తలపల్లి తండాకు చెందిన గౌరీ బాయి ఐదవ కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి.. తనువు చాలించింది. పిల్లలు (ఇద్దరు మగ, ఒక ఆడ) ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కొడుకు కావాలనే కోరికతోనే ఆమె ఐదవ కాన్పు వరకు వేచి చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బత్తలపల్లితండాకు చెందిన డ్రైవర్ రమేష్నాయక్కు కర్ణాటక రాష్ర్టం గౌరీబిదనూరు తాలూకా ఎల్లోడు పంచాయతీలోని శెట్టికుంట తండాకు చెందిన గౌరీబాయి (30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు నాలుగు కాన్పుల్లో ఆడ పిల్లలు పుట్టారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా, సారిక(7), సాత్విక (5) ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కొడుకు కావాలన్న కోరికతో ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలో ఐదవసారి గర్భం దాల్చింది. ఐదు రోజుల కిందట పురిటినొప్పులు రావడంతో బాగేపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెంగళూరులోని వాణివిలాస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ తీయించగా ముగ్గురు బిడ్డలు ఉన్నట్లు తేలింది. శుక్రవారం ఉదయం సిజేరియన్ ద్వారా ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన గౌరీబాయి.. పిల్లలను తనివితీరా చూసుకుని, వారికి ముర్రుపాలు పట్టించింది. సాయంత్రం ఆమె అస్వస్థతకు గురై మృతి చెందింది. శనివారం బత్తలపల్లి తండాలో ఆమెకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.


