breaking news
RAMAKRISHNAPURAM
-
Sagubadi: హోమియోతో చీడపీడలకు చెక్!
వరి, మిరప వంటి పంటలతో పాటు మామిడి తదితర పండ్ల తోటల్లోనూ పురుగులు, తెగుళ్ల యాజమాన్యానికి హోమియో మందులు అత్యంత ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని ఈ రంగంలో పదిహేనేళ్లుగా విశేష కృషి చేస్తున్న ప్రముఖ రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు జిట్టా బాల్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని తన పరిశోధనా క్షేత్రంలో అగ్రి హోమియోపతిపై బాల్‌రెడ్డి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తొలుత తన క్షేత్రంలో వాడి, మంచి ఫలితాలు కనిపించిన తర్వాత ఆయన ఈ మందులను రైతులకు సూచిస్తున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెప్పే లక్ష్యంతో ‘అమేయ కృషి వికాస కేంద్రం’ పేరిట యూట్యూబ్ చానల్ ద్వారా వీడియోలను కూడా ఆయన రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. హోమియో మందులతో వ్యవసాయంపై ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..మిరపలో చీడపీడలకు హోమియో మందులునల్లపేను (వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్)– ఆర్నేరియా డయాడెమా 30; రింగ్ స్పాట్ వైరస్ (బొబ్బర) – నెట్రమ్ సాలిసికమ్ 30, సాలిసిక్ ఆసిడ్ 30; ఎల్లో మొజాయిక్ వైరస్– జింజింబర్ 30, వాలెరినా 30; బూడిద తెగులు, కొమ్మెండు తెగులు– కూప్రమ్ మెటాలికమ్ 30; వేరుకుళ్లు, కాయకుళ్లు, కాండంకుళ్లు– బావిస్టా 30; తెల్లదోమ, పచ్చదోమ– కోక్సినెల్లా 30, సోరినమ్ 30; తుప్పు తెగులు, కాయ మచ్చ– బెల్లడోనా 30, కాల్కేరియాకార్బ్ 30; మెగ్నీషియం లోపం– మ్యాగ్ఫాస్ 30; జింక్ లోప నివారణ– జింకమ్మేట్ 30; బోరాన్ లోప నివారణ– బోరాన్ 30; లద్దె పురుగు– నక్స్‌వామికా 30, అజారిక్టా ఇండికా 30; తెల్ల లద్దె పురుగు, జపానీస్ బీటిల్– తూజా 30; పూత రాలటం– బావిస్టా 30; పూతరాలటం, వాతావరణ మార్పు– పెర్రంమేట్ 30; ఎదుగుదల లోపం, గిడసబారటం– కార్బోవెజ్ 30; దెబ్బతిన్న పంట కోలుకోవడానికి– బయోవేరా డిప్యూజా 30; పూత రాలకుండా– సికిల్ కార్ 30; పూత రావడానికి– అస్పగరిస్ 30 మందులను పిచికారీ చేసుకోవాలి.మామిడిమామిడి పూత రావటానికి – కాలి నైట్రికం 30, పల్సటిల్ల 30; పిందె రాలిపోకుండా – బావిస్టా 30; పచ్చదోమ/తెల్లదోమ నివారణకు – కోక్సినెల్లా 30, సోరినం 30 లేదా కోక్సినెల్లా 30, సల్ఫర్ 30 లేదా సోరినం 30, సల్ఫర్ 30; కాయ పెరుగుదలకు, తీపికి – ఆక్సాలిక్ ఆసిడ్ 30; సూటి మోల్డ్– సోరినం 30; బ్యాక్టీరియా మంగు– నాట్రం సాలిసికం 30, సాలిసిక్ ఆసిడ్ 30; పిందె దశలో త్రిప్స్, మైట్స్ నియంత్రణకు– తూజ 30; కాయకు కవరు కట్టే ముందు– సల్ఫర్ 30, సోరినం 30 వేర్వేరుగా పిచికారీ చేయాలి.కొబ్బరి కొబ్బరిలో కాపు తెప్పించటానికి, కాయ రాలకుండా నిలబెట్టుకోవటానికి రెండు కొత్త హోమియో మందులను తయారు చేసుకొని వాడాం. పూతలో 3 వంతుల కాపును నిలబెట్టుకున్నాం. కొబ్బరి చెట్లకు రెండు రకాల మందులు వాడుకోవాలి. గెలలు రావటానికి ఒకటి, కాయలు రాలకుండా కాపాడుకోవటానికి మరొకటి వేర్వేరుగా వాడుకోవాలి. 30 లీటర్ల నీటిలో 30 ఎం.ఎల్. మందు కలిపి వాడాలి. గడ్డపారతో చెట్టు చుట్టూ 4,5 నేలలో బొరియలు చేసి, వాటిలో పోయాలి. పది రోజులకోసారి వరుసగా 3 నెలలు వాడితే మంచి ఫలితం వస్తుంది. 6 నెలల తర్వాత మళ్లీ ఇవ్వొచ్చు. ఈ రెండు మందులు బయట దొరకవు. వీటితోపాటు 15 రోజులకోసారి పేడ ద్రావణం కూడా పోస్తున్నాం. తెల్లదోమ నివారణకు కోక్సినెల్లా 30, రెండు రోజులకు సల్ఫర్ 30, వారంలోగా సెమ్సిఫోగా 30, సల్ఫర్ 30 పిచికారీ చేసుకోవాలి.నత్తల నివారణకు..అధిక వర్షాల నేపథ్యంలో వరి, అనేక కూరగాయలు, బొప్పాయి తదితర పండ్ల తోటలకు కూడా ఆఫ్రికా నత్త బెడద ఏర్పడింది. నత్తల నివారణకు 20 లీటర్ల నీటిలో 2.5 ఎం.ఎల్. హెలిక్స్ టోస్టా 30 మందును కలిపి పిచికారీ చెయ్యాలి. ఒక స్ప్రే సరిపోతుంది. మరీ అవసరమైతే 10 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేస్తే చాలు.వరి20 లీటర్ల నీటిలో 2.5 ఎం.ఎల్. శైలీషియా 30 మందును కలిపి వరి విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టిన తర్వాత మైకోరైజా పట్టించి మండె కట్టి నారు పోసుకోవాలి. ఇనుప ధాతువు లోప నివారణకు– ఫెర్రంమెట్ 30; నారు ఎర్రబారినప్పుడు– కార్బొవెజ్ 30; నాటేసిన మొక్క నిలదొక్కుకోవటానికి కాలెండుల్లా 30; వేరుకుళ్లుకు– బావిస్ట 30; మొగి పురుగు, తెల్లకంకి నివారణకు– నాటేసిన 20 రోజులకు ఒకసారి, చిరుపొట్ట దశలో మరోసారి తూజ 30; పాముపొడ, పచ్చ పురుగు– నక్స్ వామిక 30; దోమపోటు– కోక్సినెల్ల 30 ( మరీ అవసరమైతే సింసిఫ్యూగ 30, సోరినమ్ 30 వేర్వేరుగా వాడాలి); పోషకాల లోపనివారణ– పేడ ద్రావణం, డీఏపీకి బదులు– అమ్మోనియా ఫాస్ 30, యూరియాకు బదులు– యూరియా పోరిక 30; పొటాష్కోసం– కాలిమూర్ 30; జింక్ లోప నివారణకు– జింకం మేట్ 30; స్మట్ – తూజా 30, అగ్గితెగులు–బెల్లడోనా 30, కాల్కేరియా కార్బ్ 30 పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.పంటలకు హోమియో మందులను 30కన్నా తక్కువ పొటెన్సీలోనే వాడాలిద్రవ రూప హోమియో మందులు ప్రత్యేక హోమియో దుకాణాలలో లభిస్తాయి. ఒకే హోమియో మందు అనేక పొటెన్సీలలో అందుబాటులో ఉంటుంది. పంటలకు సూచించిన హోమియో మందులను 6 లేదా 12 లేదా 30 పొటెన్సీ కలిగినవి మాత్రమే వాడుకోవాలి. 6 లేదా 12 పొటెన్సీలు అందుబాటులో లేనప్పుడు 30 పొటెన్సీ హోమియో మందులు వాడుకోవటం ఉత్తమం. అంతకన్నా ఎక్కువ పొటెన్సీ గల మందులు వాడకూడదు. అవసరం కూడా లేదు. హోమియో మందులు ఏ రెంటినీ కలిపి చల్లకూడదు. దేనికి దానికే వాడుకోవాలి. మోతాదు కూడా 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. మాత్రమే వాడాలి. అంతకు మించి వాడితే దుష్ఫలితాలు వస్తాయి. హోమియో మందుల వల్ల సాధారణంగా ఎటువంటి దుష్ఫలితాలు రావటం ఉండదు. ఇతర వివరాలకు నా యూట్యూబ్ చానల్ అఝ్ఛy్చ జుటజీటజిజీ Vజీజ్చుట్చ జ్ఛుnఛీట్చఝ లో వీడియోలు చూడవచ్చు. పంటలకు హోమియో మందులను కొత్తగా వాడే రైతులు ముందు ఒక ఎకరంలో వాడి చూసుకొని ముందుకు వెళ్లాలని సూచన. 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. మందు చాలుద్రవ రూపంలో ఉండే హోమియో మందులు పంటలపై పిచికారీ చేసుకునేందుకు ప్రత్యేక పద్ధతిని పాటించటం అవసరం. ఒక లీటరు మంచినీటి సీసా తీసుకొని శుభ్రంగా కడిగి, సగానికి నీరు పోయాలి. ఎంపిక చేసుకున్న మందు 2,5 ఎంఎల్‌ను కొలిచి ఆ సీసాలోని నీటిలో కలిపి గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత సీసాను కిందికి పైకి లెక్కపెట్టి మరీ 50 సార్లు గిలక్కొట్టినట్టు ఉపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని 20 లీటర్ల థైవాన్ స్పేయర్ ట్యాంక్‌లో పోసుకొని, నీటిని నింపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. కంటే ఎక్కువ మందు వాడవద్దు. అలా చేస్తే మందు పనిచేయదు. స్ప్రేయర్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత హోమియో మందుల పిచికారీకి వాడితేనే ఫలితాలు వస్తాయి. వేడి నీటితో కడిగి పైపులు శుభ్రం చేయాలి. వేడి నీటితో శుభ్రం చేసి నీడలో పంపును, స్పేయర్‌ను, బాటిళ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడే ఈ మందులు పనిచేస్తాయి. వీలుంటే హోమియో మందును పిచికారీ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్ప్రేయర్‌ను వాడుకుంటే మంచిది. సూచించిన మందులను ఒక్కసారి (సింగిల్ డోస్) పిచికారీ చేస్తే చాలు సమస్య పరిష్కారం అవుతుంది. మరీ అవసరమైతే రెండోసారి చాలు. – జిట్టా బాల్‌రెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం, రామకృష్ణాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా -
యువతిపై ఏఎస్సై చేయి చేసుకున్నారని..
ఆదిలాబాద్: ఓ యువతిపై ఏఎస్సై చేయి చేసుకున్నారని ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా రామక్రిష్ణాపురం పట్ణణ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఓ బ్యూటీపార్లర్‌లోని వస్తువులు దొంగిలించిందనే నెపంతో లావణ్య (23) అనే యువతిని ఏఎస్సై రామయ్య విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు. విచారణ చేస్తున్న సమయంలో ఏఎస్సై తనను కర్రతో కొట్టారని యువతి చెప్పుతుంది. దీంతో ఆమె బంధువులతో కలిసి స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. -
మహిళ అనుమానాస్పద మృతి
రామక్రిష్ణాపురం (ఆదిలాబాద్) : రామక్రిష్ణాపురం పట్టణంలోని శిశుమందిర్ స్కూల్ పక్కనున్న చెట్లపొదల్లో శుక్రవారం ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. మృతిచెందిన మహిళను రామక్రిష్ణాపురానికి చెందిన సుద్దాల శైలజ(24)గా గుర్తించారు. మహిళ ఒంటిపై రక్తపు మరకలు ఉండటంతో బాగా దెబ్బలు కొట్టడం వల్ల మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
చిత్తూరులో స్వల్ప భూప్రకంపనలు
సోమల: చిత్తూరు జిల్లాలో బుధవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలోని సోమల మండలం రామకృష్ణాపురం వద్ద ఐదు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. గ్రామంలోని దాదాపు 20 ఇళ్లు బీటలువారాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పోస్ట్‌మేన్ నిర్లక్ష్యం ఖరీదెంత?
చిత్తూరు: జీవితంలో చాలా మందికి తమ గ్రామ, తమ ప్రాంత పోస్ట్ మేన్ గుర్తు ఉంటాడు. ఎందుకంటే అతను అన్ని రకాల సమాచారాలు మనకు చేరవేస్తుంటాడు. ఇంటర్వ్యూ లెటర్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు, ప్రేమలేఖలు, శుభకార్యాలతోపాటు అశుభకార్యాల సమాచారం చేరవేస్తుంటాడు. పోస్ట్ మేన్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడినది. అటువంటి పోస్ట్ మేన్ నిర్లక్ష్యం వహిస్తే, ఆ నిర్లక్ష్యం ఖరీదు ఎంత? ఆ ఖరీదు చెప్పడం సాధ్యంకాదు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామ పరిధిలోని రామకృష్ణాపురం పంచాయతీ పోస్ట్ మేన్ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది జీవితాలు చిందరవందర అయ్యాయి. ఆధార్ కార్డులు - బ్యాంకు చెక్కులు, డిడిలు - ఇంటర్వ్యూ లెటర్లు - అపాయింట్మెంట్ ఆర్డర్లు, లేఖలు.....ఇలా అన్నిటి బట్వాడా నిలిచిపోయింది. దాదాపు మూడేళ్లుగా గ్రామస్తులకు ఎటువంటి సమాచారం అందలేదు. పోస్ట్‌మేన్ నిర్లక్ష్యం వల్ల ఈ గ్రామస్తులు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన పోస్ట్‌మేన్ గత మూడేళ్లుగా వచ్చిన సమాచారాన్ని గాలికొదిలేశాడు. ఒకటేమిటి అన్నీ రకాల ముఖ్యమైన సమాచారాన్ని గమ్యస్థానానికి చేర్చకుండా దాచేశాడు. గోనె సంచిలో వేసి మిద్దపై పడేశాడు. దీంతో అవి ఎండకు ఎండి, వానకు తడిసి పనికిరాకుండా పోయాయి. అనుకోకుండా అవి నిన్నబయటపడడంతో విషయం వెలుగుచూసింది. వందలాదిగా గ్రామస్తులు వచ్చి తమకొచ్చిన లేఖలను, కవర్లను ఏరుకున్నారు. విధి నిర్వహణ పట్ల అడ్డగోలుగా వ్యవహరించి, తమకు అన్యాయం చేసిన పోస్ట్‌మ్యాన్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులేక చాలా మందికి పెన్షన్ మంజూరుకాలేదని తెలిపారు. చాలా మంది యువకులకు ఉపాధికి సంబంధించిన లేఖలు అందక వారు చాలా నష్టపోయారని తెలిపారు. -
చూపున్న పాట...
మిణుగురు సమాజానికి దివిటీలు ఇరవై తొమ్మిదేళ్ల ఆమోసు ను కలిసినప్పుడు అతను దీక్షగా మునివేళ్లతో కీ బోర్డు మీద సుస్వరాలు పలికిస్తూ కనిపించాడు. ఆ స్వరఝరి వెంబడి నేనూ కాసేపు ప్రయాణించాను. అతనితో మాట్లాడుతున్నంతసేపూ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలననే నమ్మకం, సాధించగలననే ఆత్మవిశ్వాసం ప్రతి మాటలోనూ కనిపించింది. పట్టుదల, దీక్షతో సహవాసం చేసిన ఇన్నాళ్ల అతని ప్రయాణం వైకల్యాన్ని ఎలా వెనక్కి నెట్టగలిగిందో తెలుసుకున్నాను. చీకటి-వెలుగుల రంగూ రూపు తెలియకపోయినా జీవితాన వెలుగులు నింపుకుంటున్న ఆమోసుతో కాసేపు ముచ్చటిస్తే యువత మదిలో అధైర్యం పుట్టనే పుట్టదు అనిపించింది. హైదరాబాద్ రామకృష్ణాపురంలో ఉంటున్న ఆమోసును కదిపితే తన జీవన ప్రయాణాన్ని ఒక ప్రవాహంలా వినిపించాడు. అమ్మనాన్నలే చూపు... ‘‘నా పూర్తిపేరు ఆమోసు ప్రకాశ్. అమ్మ హైమావతి, నాన్న జయప్రకాశ్. రెండు కళ్లూ లేకుండా పుట్టిన నన్ను చూసి అమ్మానాన్నా చాలా బాధపడ్డారట. ఎలా పెరుగుతానో, ఏమౌతానో అని వారి బెంగ. నా కంటే ముందు పుట్టిన అన్నకు చూపు బాగానే ఉంది. నాకే ఇలా! విధికి తలవంచక తప్పదు. ఇచ్చిన బిడ్డనే కంటికి రెప్పలా సాక్కోవాలి. అలా అమ్మానాన్నలే నాకు చూపయ్యారు. చిన్నప్పటి నుంచి ‘చూపు’ లేదని నా పై చాలామంది జాలిచూపే వారు. అసలు చూపు అంటే ఏంటి?! ఇదో పెద్ద సందేహం నాకు. అయినా దాని గురించి ఏనాడూ చింత లేదు. సంగీతం అంటే పిచ్చి. ఎక్కడ పాటలు విన్నా అక్కడే ఆగిపోయేవాడిని. చేతికి అందిన వస్తువులను తడుతూ, ఆ శబ్దాలలో గమకాలను వింటూ ఆనందించేవాణ్ణి. అది చూసి అమ్మానాన్నా చిన్న చిన్న సంగీత వాద్యపరికరాలు కొనిచ్చేవారు. అవే నాకు నేస్తాలయ్యాయి. కాస్త పెద్దయ్యాక అంధుల పాఠశాలలో చేర్చారు. నా పనులు నేనే చేసుకోవడం, చదువుకోవడంతో అమ్మకు కాస్త బాధ తగ్గించినవాడినయ్యాను. నాన్న అయితే, ‘నీకు ఏది ఇష్టమో దానిపైనే పూర్తి శ్రద్ధ పెట్టు’ అని వెన్నుతట్టారు. ఆ మాటలు నాకు ఎక్కడలేని ధైర్యాన్నిచ్చాయి. అలా చదువుకుంటూనే, లైట్ మ్యూజిక్‌నీ వొంటపట్టించుకున్నాను. నా ఆలోచన ఒకటే ఎవరి మీదా ఆధారపడకూడదు. నేనుగా ఎదుగుతూనే నాలాంటి వారికి చేయూతనివ్వాలి. రేయింబవళ్లూ సాధన... పాఠశాల స్థాయిలోనే కీ బోర్డ్ నేర్చుకున్నాను. అసలు ఆ పరికరం ఎలా ఉంటుందో తెలియదు. ఏ మీట నొక్కితే ఏ రాగం వస్తుందో తెలియదు. సాధన.. రేయింబవళ్లూ సాధన. తెలియని రాగాలను వేళ్లతోనే తెలుసుకున్నాను. ఏ మీట నొక్కితే ఏ రాగం వస్తుందో మనసులో ముద్రవేసుకున్నాను. అలా సాధనలో ఉండగానే మా స్కూల్‌కి ఒకసారి సంగీతదర్శకులు రామాచారి గారు వచ్చి ‘త్రివేణి సంగమం’ అనే సంగీత కార్యక్రమం చేస్తున్నాం. అందులో మీ పాఠశాల నుంచి ప్రావీణ్యం గలవారు కావాలన్నారు. ఆ విధంగా శిల్పకళా వేదికలో మా స్నేహితులతో కలిసి ప్రముఖుల ముందు ప్రోగ్రామ్ చేశాను. ఆ ప్రశంసలు నన్ను మరింతగా కృషి చేసేందుకు తోడ్పడ్డాయి. మ్యూజిక్ కంపోజింగ్... కీ బోర్డ్‌తో పాటు ఫ్లూట్, రిథమ్ప్యాడ్, శాక్స్ఫోన్, తబలా, జాజ్, ఢోలక్, కాంగో.. ఇలా తొమ్మిది వాద్యపరికరాలను మంద్రస్థాయిలో మోగించే నైపుణ్యాన్ని అలవరచుకున్నాను. గాత్రంలో శభాష్ అనిపించుకున్నాను. ఇందుకోసం కొన్నేళ్లు పట్టింది. అయినా వదల్లేదు. విజువల్లీ చాలెంజ్డ్ వ్యక్తులైన మాధవి అక్క, సురేంద్ర, ఏసుబాబు, నరేశ్, విక్టర్, రవీంద్ర..లను కలిశాను. వారూ సంగీతాభిలాష కలవారే! మేమంతా కలిసి ‘యువతరమా మేలుకో... ’ అనే కాన్సెప్ట్‌తో ‘లీడ్ ఇండియా 2020’ అనే ఆల్బమ్‌ని తయారుచేశాం. ఆ ఆల్బమ్‌కి నేనే సంగీత సారథ్యం వహించాను. అలాగే ‘శ్రీ బాబా మనసా స్మరామి’ అనే భక్తి మాలికలోని ఆరు పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశాను. సంగీత దర్శకత్వం కల... డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. సంగీత దర్శకుడిగా ఎదగాలనేది నా కల. ఇప్పటికే వేదికల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్న మా స్నేహ బృందంతో ఆ కల నెరవేర్చుకోవాలని కృషి చేస్తున్నాను. భుక్తి కోసం నా ఆదాయాన్ని నేను సంపాదించుకుంటున్నాను. నేను పుట్టినప్పుడు కళ్లు లేని నన్ను చూసి నా తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారట. ఇప్పుడు నన్ను చూసి చాలా సంతోషపడుతుంటారు’’ అని తెలిపాడు ఆమోసు. వీరి చూపుకు కొన్ని రంగులు, ఇంకొందరి హంగులు.. తెలియకపోవచ్చు. కానీ, ఈ సమాజంలో ఎదగగలమనే నిండైన ఆత్మవిశ్వాసం మాత్రం గుండెల నిండా ఉంది. ఆమోస్ లాంటివారికి కావల్సింది జాలి కాదు, కాస్త సహకారం... మరికాస్త ప్రోత్సాహం. సమాజం నుంచి ఈ రెండూ అందే బాధ్యతను మనమంతా తీసుకుందాం. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పాఠకులకు గమనిక పేరుకు ఇది ‘మిణుగురులు’ శీర్షికే అయినా, ఇందులో వచ్చే వ్యక్తుల ఆదర్శవంతమైన జీవితాలు సమాజానికి దివిటీల వంటివి. చీకటిని తిడుతూ కూర్చోక, అమోస్లా చిరుదివ్వెలు వెలిగించుకున్న వారెవరైనా మీకు తారసపడితే వారి వివరాలు మాకు తెలియజేయండి. అంధులలో స్ఫూర్తి నింపడానికి మీ వంతు కర్తవ్యంగా ముందుకు రండి. మా చిరునామా మిణుగురులు, ఫ్యామిలీ, సాక్షి దినపత్రిక, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.


