చెత్త ఏరుకునే కుటుంబం నుంచి.. భారత క్రికెటర్‌గా
అతడిది నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణ కోసం అతడి తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటారు. పదమూడు మంది సంతానంలో అతడు ఒకడు. కడుపేద కుటుంబంలో దివ్యాంగుడిగా జన్మించిన అతడి కల మాత్రం పెద్దది.క్రికెటర్‌గా రాణించాలనే ఆశయంతో ఎన్నో సవాళ్లకు ఎదురునిలిచాడు. తన సంకల్ప బలంతో ఆటంకాలు అధిగమించి భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ఓపెనర్ స్థాయికి ఎదిగాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఆగష్టు 5- 19 వరకు జరిగే టీ20 టోర్నమెంట్లో అతడు పాల్గొనబోతున్నాడు.ఇంతకీ అతడు ఎవరంటారా?.. రాజేశ్ కన్నూర్. కర్ణాటకకు చెందిన ఈ 27 ఏళ్ల క్రికెటర్.. మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత్ తరఫున తొలి సెంచరీ బాదిన దివ్యాంగ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. విజయాపురలోని మురికివాడలో జన్మించాడు రాజేశ్. అతడి కుటుంబం గుడిసెలో నివాసం ఉంటుంది. వారి గుడిసెకు విద్యుత్ సౌకర్యం కూడా లేదు.అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, ఆత్మవిశ్వాసంతో క్రికెటర్‌గా ఎదిగాడు రాజేశ్ కన్నూర్. అయితే, ఆటగాడిగా గుర్తింపు వచ్చినప్పటికీ అతడి ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. దివ్యాంగ భారత క్రికెట్ మండలి (DCCI) ఇప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో భాగం కాకపోవడమే ఇందుకు కారణం. డీసీసీఐని బీసీసీఐ ఇంతవరకు అనుబంధ సంస్థగా గుర్తించలేదని సమాచారం.కాబట్టి రాజేశ్ కన్నూర్ మ్యాచ్‌ల కోసం తన సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్నేహితులు, ఇతర దాతల సాయంతో అతడు కెరీర్‌ను నెట్టుకొస్తున్నాడు. ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..పదమూడు మంది సంతానంలో‘‘మా అమ్మానాన్న కాశీబాయి, చిన్నప్ప. విజయపురలో వాళ్లు చెత్తు ఏరుకుంటారు. మేము పదమూడు మందిమి సంతానం. ఏడుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు. పేదరికం కారణంగా నా చదువు పదో తరగతిలోనే ఆగిపోయింది.అయితే, చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న కోరిక నా మనసులో బలంగా నాటుకుపోయింది. కానీ దివ్యాంగుడినైందున నాతో ఎవరూ ఆడేవారు కాదు. గల్లీ క్రికెట్ ఆడుతున్న సమయంలో కొంతమంది స్నేహితులు దివ్యాంగులకు క్రికెట్ కోచింగ్ ఇచ్చే సెంటర్ గురించి చెప్పారు.అదే నా కెరీర్లో టర్నింగ్ పాయింట్అది హుబ్బలిలో ఉంది. 2018లో నేను అక్కడ చేరాను. 2-3 ఏళ్ల పాటు అక్కడే ఆడాను. అయితే, కర్ణాటక దివ్యాంగ జట్టులో చేరిన తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది. కానీ ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ప్రయాణం చేసే సమయంలో నిధులు నేనే సమీకరించుకోవాల్సి వచ్చేది. నేను ఎప్పుడూ రైలులోనే ప్రయాణం చేసేవాడిని.అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం విమానంలో ప్రయాణిస్తా. ఇందుకు నా స్నేహితుడు విశ్వనాథ్ రాథోడ్ సాయం చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతాను కాబట్టి నాకు ఆదాయం వస్తుందని అంతా అనుకుంటారు. కానీ నేను ఇప్పటికీ సరైన క్రికెట్ కిట్ కొనుక్కోలేకపోయాను.సాధారణ క్రికెట్ మాదిరే ప్రజలు దివ్యాంగ క్రికెట్‌ను ఆదరించాలి. ప్రభుత్వం కూడా మాకు నిధులు కేటాయిస్తే బాగుంటుంది. కాగా రాజేశ్ కన్నూర్ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై హాఫ్ సెంచరీలు చేశాడు. చదవండి: మంచి సెలక్షన్.. వాషీ కంటే అతడే బెటర్