‘భెల్’.. మన్నవరం టు మహారాష్ట్ర
– మన్నవరం నుంచి మహారాష్ట్రకు తరలిపోనున్న భారీ ప్రాజెక్ట్
– రెండేళ్ల నుంచి నిలిచిపోయిన పరిశ్రమ పనులు
– నిధులు కేటాయించని కేంద్రం
– పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
– వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడవడమే లక్ష్యం
శ్రీకాళహస్తి రూరల్:
‘మన్నవరం భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ పరిశ్రమ.. బతికున్నంతకాలం ఈ పరిశ్రమ తన ‘గుండెకాయ’ అంటూ ఆత్మభావాన్ని ఆవిష్కరించేవారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆ గుండెకాయను నిలువునా చీల్చి ఇతర రాష్ట్రాల ప్రయోజనాల కోసం తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కుటిల పన్నాగాన్ని రచిస్తోంది. తాము బలంగా ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రాజెక్టులోని సింహ భాగాన్ని తీసుకెళ్లే దిశగా చర్యలను వేగవంతం చేసింది. దీంతో పరిశ్రమపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిరుద్యోగుల ఆశలు కుప్పకూలాయి. ఇంతజరుగుతున్నా రాష్ట్రంలోని పాలకులు నోరుమెదపకపోవడం వారి మనసును మరింత గాయపరుస్తోంది.
చిత్తూరు జిల్లా ఎంతో వెనుకబాటుకు గురైందని భావించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.6 వేల కోట్లతో ఎన్టీపీసీ–భెల్ ప్రాజెక్ట్‌ను స్థాపించేందుకు మన్నవరాన్ని ఎంచుకున్నారు. 753 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నాడు కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తన సొంత రాష్ట్రం తమిళనాడులో స్థాపించాలని, మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్‌సింగ్, మహారాష్ట్ర మంత్రులు శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్ తమ రాష్ట్రానికి ‘భెల్’ పరిశ్రమ కావాలని పట్టుబట్టారు. అయితే వైఎస్ఆర్ భెల్ పరిశ్రమ తమ రాష్ట్రానికి కావాలని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో ఏపీలో నెలకొల్పడానికి కేంద్రం సిద్ధమైంది. అనంతరం 2009 సంవత్సరంలో వైఎస్ఆర్ అకాల మరణం పాలయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఎట్టకేలకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, నాటి ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్ర, రాష్ట్ర మంత్రులు వైఎస్ఆర్ ప్రథమ వర్ధంతి(2010 సెప్టెంబర్1)న ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ 2014 నాటికి నాలుగు దశల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తులు వచ్చేలా చూడడం ప్రాజెక్టు లక్ష్యమని అన్నారు. ఇక్కడ ప్రాజెక్టు ఏర్పడడంతో దివంగత వైఎస్ఆర్ కల నెరవేరుతుందని తెలిపారు. దీనివలన ప్రత్యక్షంగా 6 వేల మందికి, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. 2012లో ఢిల్లీలో ఉన్న (ఎన్బీపీపీఎల్) ప్రధాన కార్యాలయాన్ని మన్నవరంలోని వైఎస్ఆర్ పురానికి మార్చారు.
కక్షగట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు భెల్ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ పరిశ్రమను అభివృద్ధి చేస్తే దివంగత నేత వైఎస్ఆర్కు పేరు వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. జిల్లావాసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడంతో ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజలు ఆశపడ్డారు. పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రంతో చర్చించిన దాఖలాలు లేవు. పరిశ్రమ కోసం ఇప్పటి వరకు ఎదురు చూసిన నిరుద్యోగ యువతకు ప్రాజెక్టు పనులు ఆగిపోవడంతో నిరాశే మిగిలింది. ప్రస్తుతం పరిశ్రమనే ఇతర రాష్ట్రాలకు తరలించాలనే యోచనలో కేంద్రం ఉందనే వార్తలు వస్తుండడం సీమవాసులను అయోమయానికి గురి చేస్తోంది. ప్రాజెక్టు తరలింపనకు యత్నిస్తే సీమవ్యాప్తం భారీ ఉద్యమం తప్పదనే భావన జనంలో వ్యక్తమవుతోంది.
పరిశ్రమను తరలిస్తే ఊరుకోం
మన్నవరం నుంచి భెల్ పరిశ్రమను తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుటిల పన్నాగం విరమించుకోవాలి. లేకపోతే పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజలు, నిరుద్యోగ యువతతో కలసి ఆందోళనలు చేపడుతాం. రాయలసీమ వ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని చేపడుతాం. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటాం.
– బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త, శ్రీకాళహస్తి
రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం
రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతోనే కేంద్ర ప్రభుత్వం మన్నవరం ప్రాజెక్టును తరలించడానికి ప్రయత్నాలు చేసుకుంటోంది. ఈ ప్రయత్నాన్ని వెంటనే నిలుపుదల చేసేటట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఉద్యమాలు తప్పవు.
– జనమాల గురవయ్య, సీపీఐ ఏరియా కార్యదర్శి, శ్రీకాళహస్తి
ఎన్నో ఆశలు పెట్టుకున్నాం
మన్నవరంలో భెల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పటికి çపూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవటంతో నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి పరిశ్రమ తరలించడానికి ప్రయత్నించడం బాధగా ఉంది. వైఎస్ఆర్ బతికి ఉంటే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకునేవి కాదు.
– పవన్‌కుమార్‌రెడ్డి, ఎంబీఏ, గొల్లపల్లి