అభిమానులపై ఆగ్రహం
ఏ అంశం అయినా హద్దుల్లో ఉంటేనే ముద్దు. అది ప్రేమ అయినా, అభిమానం లేక ఇంకేమైనా. లేకపోతే ఆగ్రహాన్నే చవిచూడాల్సి వస్తుంది. నటి ప్రియమణి విషయంలో ఇలాంటి సంఘటనే జరిగింది. కన్నాళ్ ఖైదు చెయ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన కేరళ కుట్టి ప్రియమణి. పరుత్తివీరన్ చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న ఈ అమ్మడు ఆ తరువాత తమిళంతో పాటు తెలుగు, తదితర ఇతర దక్షిణాది భాషల్లోనూ మంచి నటిగా గుర్తింపు పొందారు. అలా పలు చిత్రాల్లో నటించిన ప్రియమణికి ప్రస్తుతం ఏ భాషలోనూ అవకాశాలు లేవు. దీంతో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియుడు ముస్తఫ్ రాజ్‌తో ఏడడుగులు వేయడానికి ఇరు వర్గాల పెద్దలు ఆమోద ముద్ర వేయడంతో ఇటీవలే బెంగళూర్‌లో వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ప్రియమణి ఫొటోలు సహా బహిరంగపరచారు.ఆల్ హ్యాపీ ఇక వివాహమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ప్రియమణికి అభిమానుల నుంచి తలనొప్పి మొదలైందట. ఆమె వివాహ నిశ్చితార్థం గురించి అభిమానులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారట. అవి ప్రియమణిని తీవ్ర మనస్తాపానికి గురి చేశాయట.
దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ప్రియమణి తన ఫేస్బుక్లో అభిమానుల్ని దులిపేశారు. ఆమె పేర్కొంటూ ఇది నా జీవిత పయనం. మీ శుభాకాంక్షలు,ఆశీస్సులు కావాలనే నా వివాహ నిశ్చితార్థం అంశాన్ని బహిర్గతం చేశాను. ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేశాను. అయితే మీ విరుద్ధమైన అభిప్రాయాలు నన్ను చాలా అసంతృప్తికి గురి చేశాయి.అభిమానులూ మీరు ఇంకా చాలా ఎదగాలి. అయినా నా వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాన్ని సహించను. ఈ విషయంలో నా తల్లిదండ్రులకు, నా జీవిత భాగస్వామికి మినహా ఇతరులకెవరికీ బదులివ్వాల్సిన అవసరం నాకు లేదు అని ప్రియమణి తన ఫేస్బుక్లో ఘాటుగా పోస్ట్ చేశారు.