breaking news
Rabindra Nath Tagore
-
నోబెల్ శిఖరమెక్కిన జాణపదం!
విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్ గీత రచనలో ప్రదర్శించిన ప్రతిభకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు 1913 నవంబర్ 13న స్వీడిష్ ఎకాడెమీ ప్రకటించింది. ‘ప్రగాఢమైన మార్దవమూ, నవనవలాడే తాజాదనమూ, ముగ్ధమోహన సౌందర్యమూ నిండిన కవిత’గా టాగోర్ గీతరచనను అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.పరిపూర్ణమైన కౌశలంతో నిండివుండే టాగోర్ కవితావేశం ఆయన (ఆంగ్ల) గీతాలను పాశ్చాత్య సాహితిలో భాగంగా మార్చిందని స్వీడిష్ ఎకాడెమీ తన ప్రకటనలో పేర్కొంది. నాటికి నూట మూడేళ్ళు మరో పదమూడు రోజుల్లో పూర్తి అవుతాయనగా– 2016, అక్టోబరు 13న– మరో గీతరచయిత బాబ్ డిలాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్లు అదే ఎకాడెమీ ప్రకటించింది. ‘మహత్తరమైన అమెరికన్ గీతరచన సంప్రదాయ పరిధిలోనే కొనసాగుతూ, సరికొత్త కవితాత్మక భావప్రకటనలు చేసినందుకు’ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు స్వీడిష్ ఎకాడెమీ తన అభినందన సందేశంలో ప్రకటించింది. అలా, నూరేళ్ళ తర్వాత, గీతరచనకు రెండోసారి నోబెల్ పురస్కారం సంపాదించిపెట్టిన వాగ్గేయకారుడిగా బాబ్ డిలాన్ చరిత్ర సృష్టించాడు.కెనడా సరిహద్దుల్లో వుండే అమెరికన్ స్టేట్ మిన్నెసోటా. అక్కడి ఆదివాసుల జానపద గీతాలు చరిత్రప్రసిద్ధాలు. పద్దెనిమిదో శతాబ్ది చివర్లో, జంతువుల చర్మాల కోసం ఇక్కడికి వచ్చే ఫ్రెంచ్ యాత్రికులు తమ గీతాల బాణీలతో ఇక్కడి స్థానిక గీతాలను మేళవించి కొత్తరకం జానపద గీతాల సంప్రదాయం సృష్టించారంటారు. బాబ్ డిలాన్ కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది ఈ జానపద గీతాలు పాడే! సాధారణంగా జానపద బాణీలో రాసిన గీతాలనగానే, మనకి విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలూ’, నండూరి ‘ఎంకి పాటలూ’, కొనకళ్ళ ‘బంగారిమామ పాటలూ’ గుర్తుకురావడం సహజం.అయితే, బాబ్ డిలాన్ గీతసాహితి ఆ బాపతు కాదు. 1960 దశకం మొదట్లో, 22 యేళ్ళ బాబ్ ‘ఉత్తరాది పల్లెటూరి పడుచు పిల్లా’, ‘కుండపోతగా వాన కురవనుంది పిల్లా’ లాంటి పాటలు రాసి పాడకపోలేదు. కానీ బాబ్ డిలాన్ బాణీకి పేరుతెచ్చిపెట్టినవి అలాంటి పాటలు కావు. అమెరికాలో యుద్ధ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న తరుణంలో బాబ్ పాడిన ‘పెనుగాలి వీస్తోంది’, ‘కాలం మారుతోంది’ లాంటివే బాబ్ డిలాన్ బాణీ ఇలాంటిదనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ పాటల్లో డిలాన్ లేవనెత్తిన ప్రశ్నలు, ఆ రోజుల్లో సామాన్య పౌరులందరి మనస్సులనూ కలవరపరుస్తున్నవే! వాటికి ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదనే విమర్శ లేకపోలేదు. అయితే, అది కవిగారి పని కాదనే వాదన కూడా వినవచ్చింది! పాయింటేమిటంటే, అప్పట్లో– 1965 నాటికి– బీజప్రాయంగా మాత్రమేవున్న ‘ప్రత్యామ్నాయ సంస్కృతి’ (కౌంటర్ కల్చర్) చాయలు ఆ పాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించాయి. అదీ అసలు విశేషం! బాబ్ డిలాన్ అనేది కవిగారి పెట్టుపేరు– రాబర్ట్ యాలెన్ జిమ్మెర్మన్ అతగాడి పుట్టుపేరు. దాన్నిబట్టి, బాబ్ యూదు మతాన్ని అనుసరించే కుటుంబంలో పుట్టి పెరిగాడని అర్థమవుతుంది. అతని తండ్రి రష్యన్ జాతీయుడు కాగా, తల్లి లిథువేనియా జాతీయురాలు. (ఈ రెండు జాతులూ 1918 మొదలుకొని 1990 వరకూ సోవియెట్ యూనియన్‌లో భాగంగా వున్న సంగతి ఆధునిక రాజకీయ చరిత్ర తెలిసినవారికి వేరే చెప్పనవసరంలేదు! ఆ తర్వాత అవి తిరిగి ‘స్వతంత్ర’ దేశాలుగా ఆవిర్భవించాయి) రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో బాబ్ తల్లితండ్రులు అమెరికా చేరి అక్కడే మనువాడారు. మతానికి సంబంధించి, బాబ్ డిలాన్ అభిప్రాయాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1970–’80 మధ్యకాలంలో బాబ్ క్రైస్తవమతంలోకి మారి, కొద్దికాలానికే తిరిగి యూదుమతంలోకి మారిపోయారు. దీనికి సంబంధించిన కథనాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి– వాటినలా వదిలేయండి!దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర, అమెరికన్ జానపద– రాక్ సంగీత సంప్రదాయానికి చెందిన ఈ వాగ్గేయకారుడి సొంతం. పన్నెండున్నర కోట్ల రికార్డులను అమ్మి, బాబ్ డిలాన్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. అమెరికాకు పన్నెండో నోబెల్ సాహిత్య పురస్కారం సంపాదించి పెట్టిన అతగాడు. (అమెరికన్ రచయిత్రి లూయీజ్ గ్లిక్ –2020లో– పదమూడోసారి ఇదే పురస్కారాన్ని గెల్చుకున్న సంగతి చదువుకున్న మిత్రులకు తెలిసిన విషయమే!) ‘ప్రామాణిక సాహిత్యం అందించే మేధాసంపదతో సమృద్ధమైన సంస్కారం కలిగినవాడు బాబ్ డిలాన్. ఆయన 1960 దశకంలోనే, అమెరికన్ జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశార’ని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా శ్లాఘించింది. 85 సంవత్సరాల వయసున్న ఈ సుప్రసిద్ధ వాగ్గేయకారుణ్ణి, ఆధునిక పాఠక–శ్రోతలకు ఇప్పుడు పరిచయం చేయాలనుకోవడం దుస్సాహసమే!- మందలపర్తి కిషోర్ -
ఆ హక్కును కోల్పోయిన బిగ్ బీ
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు రీల్ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనూ కోపం వచ్చింది. ట్విటర్‌ను వేదికగా చేసుకుని ఆ కోపాన్ని ప్రదర్శించారు. ఇంతకు బిగ్ బీకి అంత కోపం తెప్పించిన అంశం ఏంటంటే ఆయన తండ్రి ప్రముఖ రచయిత హరివంశరాయ్ బచ్చన్ రచనల మీద 1957 కాపీ హక్కుల చట్టం మేరకు అమితాబ్‌కు ఉన్న హక్కులను కోల్పోనున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన అనంతరం ఆ వ్యక్తి రచనల మీద అతని వారసులకు కేవలం 60 ఏళ్ల వరకే హక్కులు ఉంటాయి. తర్వాత ఆ రచనలను ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఈ విషయంలో అమితాబ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 60 ఏళ్లే వారసులకు హక్కులు ఉంటాయని ఎవరూ నిర్ణయించారు. అయినా 60 ఏళ్లే ఎందుకు ఉండాలి, 61 ఏళ్లనో, శాశ్వతంగానో ఎందుకు ఉండకూడదు అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ‘కాపీ హక్కు చట్టాలను చెత్తగా వర్ణిస్తూ అసలూ ఈ మేథోపరమైన హక్కులను ఎవరూ నిర్ణయించారు. నా తండ్రికి నేను వారసున్ని, ఆయన రచనల మీద కూడా నాకే పూర్తి హక్కు ఉంటుంది. నా తండ్రి మరణించి 60 ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి ఇంక నాకు హక్కు లేదంటే ఎలా కుదురుతుంది. ఇప్పుడు ఎవరైనా వారి అవసరాలకోసం నా తండ్రి సాహిత్యాన్ని వారి ఇష్టారీతిగా ఉపయోగించుకోవచ్చా? అలా ఎప్పటికి జరగదు. విలియం షేక్స్పియర్, మిస్టర్ బీథోవెన్, మెస్సర్స్ చోపిన్, చైకోవ్స్కీ మన దేశానికి వస్తే గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్... వీళ్లేవరికి ఈ కాపీరైట్ హక్కు గురించి తెలియదు. వారి రచనలకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేవు. అందువల్ల వారి రచనలను అందరూ వాడుకుంటున్నారు. దానివల్ల వారి నిజమైన వారసులకు నష్టం కలుగుతోంది. నేను మాత్రం ఈ విషయం మీద పోరాడతాను’ అంటూ ముగించారు. హరివంశరాయ్ బచ్చన్ రచనల్లో మధుశాల, అగ్నిపత్, రుకే నా తు, హిమ్మత్ కర్నే వాలోంకి హర్ నహీ హోతి వంటివి కొన్ని ప్రముఖమైనవి. -
తెలంగాణ ఆత్మకు ప్రతీక
- ఠాగూర్ మాదిరి కాళోజీకి విశ్వప్రజాకవి బిరుదు: స్పీకర్ - ఆయన రచనలను నోబెల్‌కు ప్రతిపాదించాలి - ఘనంగా కాళోజీ 102వ జయంతి ఉత్సవం - గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆత్మకు ప్రజాకవి కాళోజీ ప్రతీక అని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రవీంద్ర నాథ్ ఠాగూర్‌కు విశ్వకవి బిరుదు ఎలా ఇచ్చారో అలాగే కాళోజీకి విశ్వప్రజాకవి బిరుదు ఇచ్చేలా కాళోజీ ఫౌండేషన్ వారు కృషి చేయాలని సూచించారు. కాళోజీ రచనలను, వ్యక్తిత్వాన్ని, పోరాటాలను, జీవన విధానాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్నారు. తెలిపారు. ఎక్కడ అవమానం, అణచివేత ఉంటుందో అక్కడ తాను ఉంటానని కాళోజీ తన రచనల ద్వారా నిరూపించాడని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి ఉత్సవం-తెలంగాణ భాషాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌తోపాటు డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడు తూ కాళోజీ పురస్కారానికి గోరటిని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. కాళోజీ రచనలు విశ్వజనితమైనవని, నోబెల్ పురస్కారానికి ఆయన రచనలు పంపే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించాలని సూచిం చారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. 1970 నుంచి కాళోజీతో తమకు పరిచయం ఉందన్నారు. ‘‘మాది తాత, మనవడు అనుబంధం. ఏదైనా నచ్చితే నెత్తికి ఎత్తుకోవడం కాళోజీ తత్వం. నచ్చకపోతే మాత్రం చీల్చి చెండాడుతాడు. ఆయన బతికినంత కాలం తెలంగాణ కోసం పరితపించారు. గోరటి వెంకన్న పాట లు మనుషులు ఉన్నంతవరకు సజీవంగా ఉంటాయి’’ అని అన్నారు. కడియం మాట్లాడుతూ.. కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం, సాహిత్య పురస్కారాన్ని ఇవ్వటం గర్వంగా ఉందన్నారు. వరంగల్‌లో రెండున్నర ఎకరాల్లో రూ.60 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. దీనికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం రూ.15 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కాళోజీ పాటలను సీడీ రూపంలో భావితరాలకు అందించడానికి సాంస్కృతిక శాఖ కృషి చేయాలన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా గోరటి వెంకన్నకు డాక్టరేట్ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాళోజీ 102వ జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకోవడం అదృష్టమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు ఆరాధ్యుడన్న కాళోజీ తెలుగువారందరికీ ఆదర్శప్రాయుడ న్నారు. కాళోజీది ధిక్కార స్వరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు ధిక్కార స్వరం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని వక్తలు కొనియాడారు. శుక్రవారం టీఎన్జీవో భవన్లో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. అన్యాయాన్ని ఎదిరిం చడంలో, అణచివేతను ఎదుర్కోవడం లో కాళోజీ ధైర ్యం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. వరంగల్‌లో ఆయన పేరిట హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, కాళోజీ జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వానికి ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. నా పాట నాన్న భిక్ష: గోరటి కాళోజీ పురస్కార ప్రదాన కార్యక్రమంలో గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తన పాట నాన్న పెట్టిన భిక్ష అని అన్నారు. పురస్కారం అందించిన ప్రభుత్వానికి, సభకు హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. గోరటిని పురస్కారంతో సత్కరించి రూ.1,01,116 నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై తన తల్లి ఈరమ్మకు పాదాభివందనం చేశారు. అనంతరం తన పాటలతో ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు వ ర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, మేయర్ బొంతు రామ్మోహన్, కాళోజీ ఫౌండేషన్ నాగిళ్ల రామ శాస్త్రి మాజీ ఎమ్మల్యే నోముల న ర్సింహయ్య, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.


