వీడు మూడడుగుల బుల్లెట్టూ...
రభాస్(పొట్టి రాంబాబు), నీహా సైరాగోషైన్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘పులి రాజా ఐపీఎస్’. రాఘవ తిరువాయిపాటి దర్శకుడు. మాధవ్ .కె నిర్మాత. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ ఇచ్చారు. పవన్‌కల్యాణ్ ఆరడుగుల బుల్లెట్ అయితే... పొట్టి రాంబాబు మూడడుగుల బుల్లెట్ అని అతిథిగా విచ్చేసిన అలీ వ్యాఖ్యానించారు. ఇంటిల్లిపాదీ చూసి ఆనందించే సినిమా ఇదని నిర్మాత చెప్పారు. ‘‘మూడడుగుల బుల్లెట్ లాంటి కుర్రాడు పోలీసాఫీసర్ అయితే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా. ఇందులో హీరో తండ్రిగా ఎమ్మెస్ నారాయణ నటిస్తున్నారు.
తన కొడుకుని పోలీస్‌గా చూడాలనేది ఆయన కోరిక. ఆ కోరికను అతని కొడుకు ఎలా తీర్చాడనేది ఆసక్తికరమైన అంశం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో హీరోగా నటించడం పట్ల పొట్టి రాంబాబు ఆనందం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, పోసాని, రఘుబాబు తదితరులు నటిస్త్తున్న ఈ చిత్రానికి మాటలు: వెంకట్.టి, కెమెరా: వెంకీ.డి, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఈశ్వర్.ఐ.