సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం
ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
► జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు విభాగం
► మొత్తం 5 ఫిర్యాదుల స్వీకరణ
నిర్మల్ రూరల్ : పోలీస్ శాఖకు సంబంధించిన ప్రజావాణిలో ఫిర్యాదుదారులు విన్నవించిన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో అప్పటికప్పుడు మాట్లాడారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఫోన్లోనే ఆదేశించారు. సామాన్య ప్రజలకు అండగా జిల్లా పోలీసులు ఉంటారని తెలిపారు. సిబ్బంది ప్రజలకు స్నేహపూర్వకంగా ఉండాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలుపర్చాలని సూచించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో గౌరవం పెరిగేలా కార్యక్రమాలను చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజావాణిలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఐదుగురు ఫిర్యాదుదారులు హాజరయ్యారు.