breaking news
P.S. Pradyumna
-
15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ఆఫీస్ సేవలు
విజయవాడ : రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో ప్రధాన శాఖల ఫైళ్లన్నీ మే 15 నుంచి ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కార్యదర్శి పి.ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. 11 జిల్లాల నుంచి వచ్చిన 114 మంది డి.ఎ.ఒ., లోకల్ అడ్మిన్లకు చెందిన సిబ్బందికి గురువారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పూర్తిస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ నిర్వహించారు. ప్రద్యుమ్న మాట్లాడుతూ.. ఈ-గవర్నెన్స్ విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. ఈ-ఆఫీస్ విధానంలో సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శకతతో కూడిన పరిపాలన అందించడం సాధ్యమవుతుందన్నారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో రాష్ట్రస్థాయి ఈ-ఆఫీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. పరిపాలన అటు హైదరాబాద్‌లోను, ఇటు విజయవాడలోను నిర్వహిస్తున్నందున ఫైళ్లను మోసుకెళ్లే భారం లేకుండా ఈ-ఆఫీస్ ద్వారా సమర్ధవంతమైన పరిపాలన అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ-ఆఫీస్ నిర్వహణపై కలెక్టర్ శిక్షణ ప్రాథమిక దశలో ఈ-ఆఫీస్ నిర్వహణ అసాధ్యమని, అయినా కష్టపడితే ఫలితం ఉంటుందని కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. జిల్లాలో అమలవుతున్న ఈ-ఆఫీస్ విధానాన్ని ఆయన శిక్షణ ద్వారా సిబ్బందికి వివరించారు. ప్రతి జిల్లాలో ఆయా శాఖల పరిధిలో ఈ-ఆఫీస్ నిర్వహణకు పది మంది సిబ్బందితో, జిల్లాలో వారి పరిధిలో అన్ని శాఖలకు చెందిన సిబ్బంది, ఆర్గనైజింగ్ యూనిట్ల ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఫైళ్లను సమర్ధంగా నిర్వహించేలా త్వరలో చర్యలు చేపడతామన్నారు. -
జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి
ఇందూరు, న్యూస్‌లైన్ : భారత రాజ్యాంగం దేశానికి వెన్నెముకలాంటిది. అలాంటి రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో బాబూ జగ్జీవన్‌రామ్ ఒకరని జిల్లా కలెక్టర్ పీ.ఎస్. ప్రద్యుమ్న అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ 107వ జయంతి సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం లో రాజకీయ స్వాతంత్య్రం ఉంటే సరిపోదని, ప్రజలకు ఆర్థిక, సామాజిక, సమన్యాయ స్వాతంత్య్రం కావాలని జగ్జీవన్‌రామ్ పోరాడి సాధించారని అన్నారు. ఆయన పోరాట ఫలి తంగానే రాజ్యాంగంలో పలు అంశాలను చేర్చడంతో నేడు మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. బీహార్‌లో జన్మించిన జగ్జీవన్ రామ్ కేంద్రానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. తరువాత వ్యవసాయ మంత్రిగా ప్రజల మేలు కోరి దేశ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలి చారని కొనియాడారు. అయితే ప్రస్తుత తరం దేశ కోసం పోరాడిన మహనీయులను మరిచి పోతోందన్నారు. విద్యార్థులకు మహనీయుల పేర్లు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం చాలా విచారకరమన్నారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. జేసీ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ అంటరాని తనాన్ని రూపు మాపేందుకు పోరాటం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో నడవాలన్నారు. అంటరానితనం అక్కడక్కడా ఇంకా ఉందని,దానిని పూర్తి స్థాయిలో నిర్మూలించేదుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపడుతుందన్నారు. స్థానిక రైల్వే కమాన్ వద్ద పాత అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఖాలేబ్, ఐకేపీ పీడీ వెంకటేశం, ఇన్చార్జి డీఎస్‌డబ్ల్యూఓ అల్ఫోన్స్, ఏఎస్‌డబ్ల్యూ జగదీశ్వర రెడ్డి,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు కలెక్టర్ రైల్వే కమాన్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ నివాళి.. రైల్వే కమాన్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి మాజీ ఎంపీ మధుగౌడ్ యాష్కీ పూల మాలలు వేసి వివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ భవన్‌లోని చిత్ర పటానికి పూల మాలలు వేశారు. సాంఘిక సంక్షేమాధికారులు భోజనాలు ఏర్పాటు చేయగా, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు కలిసి భోజనం చేశారు. కాగా అక్కడున్న ఓ వృద్ధురాలిలో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేసి అందరిని ఆకట్టుకున్నారు.