సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలతో మందగించిన పనులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా సర్వీసు విషయాలు, వేతనాల పెంపు వంటి అంశాలపై గళమెత్తే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇటు తెలంగాణ ఉద్యోగులు, అటు సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు కేవలం రాష్ట్ర విభజన అంశంపైనే మాట్లాడుతున్నారు. వేతనాల పెంపునకు సంబంధించి పదో వేతన సవరణ సంఘం గురించి ఉద్యోగులు అస్సలే పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సమైక్య రాష్ట్రంలో ఉద్యోగుల పీఆర్సీ అమల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ప్రాంత ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుపైనే ఆ ప్రాంత ఉద్యోగులు దృష్టి సారించారు తప్ప పదో వేతన సవరణ సంఘం, మధ్యంతర భృతి గురించి పట్టించుకోవడం లేదు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆందోళనలు, సమ్మెలు చేస్తున్నారు. తొమ్మిదో వేతన సవరణ సంఘం కాలపరిమితి జూన్ నెలాఖరుతో ముగియడంతో జూలై 1 నుంచి పదో వేతన సవరణ సంఘం అమల్లోకి రావాల్సి ఉంది. ఈ మేరకు పదో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారు ఈ సంఘానికి అగర్వాల్‌ను చైర్మన్‌గా కూడా నియమించింది.
తొలుత ఉద్యోగ సంఘాలు తమకు మధ్యంతర భృతి వద్దని వీలైనంత త్వరగా పీఆర్సీనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నవంబర్ కల్లా పీఆర్సీ నివేదికను సమర్పించాలని అగర్వాల్‌కు సూచించింది. అయితే ఇప్పుడు విభజన సెగ పీఆర్సీ పనితీరుపైనా పడింది. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు సెలవు రోజుల్లో కూడా అగర్వాల్‌తో సహా ఇతర సిబ్బంది కూడా పనిచేసేవారు. ప్రకటన వెలువడిన తర్వాత ఉద్యోగుల హాజరు అంతంత మాత్రంగా ఉండటంతో పని మందగించింది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కూడా త్వరలో సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నందున పీఆర్సీ పని పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సమైక్య రాష్ట్రంలో పదో పీఆర్సీ ఏర్పాటు చేసినప్పటికీ విభజన తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.