breaking news
prabhala teertham
-
రాష్ట్ర పండగగా ప్రభల తీర్థం
అంబాజీపేట: మండలంలోని జగ్గన్నతోటలో ఏటా సంక్రాంతికి నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించాలని ఏకాదశ రుద్రాలయాల అర్చకులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయా ఆలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాసినట్టు నిర్వాహకులు తెలిపారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని వారు కోరారు. వ్యాఘ్రేశ్వరం (బాలాత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి), కె.పెదపూడి (పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి), ఇరుసుమండ (బాలాత్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామి), వక్కలంక (అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి), నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి), ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత రాఘవేశ్వర స్వామి), మొసలపల్లి (బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి), పాలగుమ్మి (శ్యామలాంబా సమేత చెన్నమల్లేశ్వర స్వామి), గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత వీరేశ్వర స్వామి), గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి), పుల్లేటికుర్రు (బాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు) జగ్గన్నతోటలో కనుమ రోజున కొలువుదీరుతారు. ఈ తీర్థానికి జాతీయస్థాయి గుర్తింపు రావడంతో 2020లో ఈ ఉత్సవానికి సంబంధించి ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులకు లేఖ రాశారు. అలాగే శృంగేరి పీఠాధిపతులు మరొక లేఖను పంపించారు. రెండేళ్ల క్రితం శివకేశవ యూత్ సభ్యులు, ప్రభల నిర్వాహకులు జగన్నతోట ప్రభల తీర్ధ విశిష్టతను కేంద్ర, రాష్ట్రాలకు లేఖ ద్వారా వివరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలలో ప్రభలతీర్థాన్ని కళాజాతను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏకాదశ రుద్ర ఆలయాలకు నిధులు మంజూరు చేసి ఈ తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించాలని వారు కోరుతున్నారు. -
కోనసీమ ‘ప్రభ’
సాక్షి, అమలాపురం: కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ప్రభల తీర్థం. ఇది సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. దేశ రాజధాని న్యూఢిల్లీలో గతేడాది అట్టహాసంగా జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరిన ఈ ప్రభల తీర్థం భారతీయుల మనస్సులను గెలిచాయి. కోనసీమ ‘ప్రభ’ను నలుదిక్కులా చాటి చెప్పాయి. వివరాల్లోకి వెళితే...డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. తీర్థం జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలకు చెందిన పదకొండు ప్రభలు ఇక్కడకు వస్తాయి. ఇక్కడ జరిగే ప్రభల తీర్థం లోక కల్యాణార్థం అని భక్తుల విశ్వాసం. పెద్దాపురం సంస్థానా«దీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతారు. మహారాజుకు పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రభల తీర్థం నిర్వహించమని కోరారంటారు. అప్పటి నుంచి ఇక్కడ తీర్థం జరుగుతోందని భక్తుల విశ్వాసం. మరో కథలో.. 17వ శతాబ్దంలో పరమ శివభక్తుడు, ఏకసంధాగ్రాహి అయిన విఠలా జగ్గన్న ఇక్కడున్న కౌశిక నది చెంతన శివ పూజ చేసేవారు. ఇందుకు పెద్దాపురం సంస్థానాధీశుడు అభ్యంతరం చెప్పడంతో హైదరాబాద్ నిజాం నవాబును తన ప్రతిభతో మెప్పించి ఇప్పుడు తీర్థం జరిగే జగ్గన్నతోట వద్ద 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా పొందారని చెబుతారు. ఈ కారణంగానే ఇది జగ్గన్నతోటగా పేరొందిందని నమ్మకం. ప్రభల తీర్థాలు జరిగేదెక్కడంటే.. జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ప్రభలు ఉంటాయి. ప్రభలు తయారు చేయడాన్ని యజ్ఞంగా భావిస్తారు. తాటి శూలం, టేకు చెక్క, పోక చెట్ల పెంటిలు, మర్రి ఊడలు, వెదురు బొంగులతో మూడు రోజులపాటు శ్రమించి ప్రభలు తయారు చేస్తారు. రంగురంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వ్రస్తాలతో అందంగా తీర్చిదిద్దుతారు. ప్రభపై పసిడి కుండ ఉంచి చుట్టూ నెమలి పించాలు, జేగంటలు వేలాడదీస్తారు. వరి కంకుల కుచ్చులు, గుమ్మడి, ఇతర కూరగాయలు, పెద్దపెద్ద పూల దండలతో ప్రభకు వేలాడదీస్తారు. వీటిని భక్తులు తమ భుజస్కంధాలపై ఉంచి కిలోమీటర్ల కొద్దీ మోసుకు వస్తారు. కొబ్బరి తోటలు, వరిచేలు, పంట కాలువల మీదుగా సాగే ప్రభల యాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయిలో గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. దీంతో మోదీ తీర్థాన్ని అభినందిస్తూ తిరిగి సందేశం పంపించారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థాన్ని ప్రదర్శించారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గతేడాది ప్రముఖ సినీ నటుడు నాగార్జున నటిస్తున్న ఒక సినిమాలో విజువల్స్ కోసం ప్రభల తీర్థాన్ని చిత్రీకరించారు. యువత ప్రభల తీర్థాలపై పలు లఘు చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ తీర్థానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దీంతో ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేర దాటిస్తే ఊరుకు మంచిదనేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసమని అర్చకుడు చంద్రమౌళి కామేశ్వరశాస్త్రి తెలిపారు. -
రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్‌లో ఏపీ ప్రభల తీర్థ శకటం
ఢిల్లీ: రిపబ్లిక్ డే పరేడ్ డ్రస్ రిహార్సల్స్ల్లో ఏపీ శకటం అలరించింది. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ డ్రస్ రిహార్సల్స్ల్లో ఏపీలోని కోనసీమ ప్రభల తీర్థ శకటం ఆకట్టుకుంది. పరేడ్ అగ్రభాగంలో ఆంధ్రప్రదేశ్ శకటం చూపరులను విశేషంగా అలరించింది. శివపార్వతుల విగ్రహాలతో ప్రభల తీర్థాన్ని పరేడ్ డ్రస్ రిహార్సల్స్‌లో ప్రదర్శించగా, ముందు భాగంగా జోడెడ్ల బండిపై రైతన్న కూర్చొని ఉన్నాడు. -
ప్రారంభమైన ప్రభలతీర్థం
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం పప్పులవారిపాలెం గ్రామంలోని డ్యాం సెంటర్ వద్ద ఘనంగా ప్రభలతీర్థం ప్రారంభమైంది. తరలి వస్తున్న ప్రభలను చూడడానికి ప్రజలు పోటెత్తుతున్నారు. ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కోనసీమలోని జగ్గన్నతోట తదితర ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఎక్కడెక్కడో స్థిరపడినవాళ్లంతా కూడా ఈ పండుగ కోసం వస్తుంటారు.