breaking news
postal ATM centers
-
ఇంటికే డబ్బులు తెచ్చిస్తారు
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు శుభవార్త. ఇకపై వీరంతా నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన పని లేదు. బ్యాంక్ పాస్‌బుక్, విత్ డ్రా ఫామ్, ఏటీఎం కార్డులూ అవసరం లేవు. ఇంట్లో ఉండే నగదు డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటారా?.. మీ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నంబర్ 155299కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే చాలు. మీ ఏరియా పోస్ట్‌మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటికే వస్తారు. ఆయన అడిగిన వివరాలు అందిస్తే చాలు.. అవసరమైన మొత్తాన్ని కనీసం రూ.100 నుంచి రూ.10 వేల వరకు పొందవచ్చు. బ్యాలెన్స్, లావాదేవీల వివరాలూ తెలుసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితమే.. సాక్షి, సిటీబ్యూరో : పోస్టల్ శాఖ ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం కాకుండా.. మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొంటోంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. గతేడాది ‘ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్’ పేరుతో బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన తపాలా శాఖ పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు పోస్టాఫీస్‌కు వెళ్లలేని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన ఐపీపీబీ ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలందిస్తూ వచ్చిన తపాలా శాఖ ఇటీవల వివిధ బ్యాంక్‌ల ఖాతాదారులకు సైతం ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హెడ్, సబ్ పోస్టాఫీసుల ద్వారా కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’ ద్వారా ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించిన తపాలా శాఖ తాజాగా ఇంటి ముంగిటకు ఆధార్ ఏటీఎం పేరుతో సేవలను విస్తరించింది. మొబైల్ మైక్రో ఏటీఎంలు తపాలా శాఖ హైదరాబాద్ నగర పరిధిలోని 950 మంది పోస్ట్మేన్లకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంపై శిక్షణనిచ్చింది. మొబైల్ ఫోన్లలో మైక్రో ఏటీఎం యాప్‌లను డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్లను సైతం అందజేసింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉత్తరాలు బట్వాడా చేసే వీరంతా అవసరమైన వారికి ఆధార్ ఏటీఎంల ద్వారా సేవలందిస్తున్నారు. ఆధార్ ఏటీఎం సేవలు ఇలా.. - 155299 నంబర్‌కు రిక్వెస్ట్ పంపగానే, ఆ ఏరియా పోస్ట్‌మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటి వద్దకు వస్తారు. - పోస్ట్‌మేన్ మీ పేరు, మొబైల్ నంబరు తీసుకుని ఎంటర్ చేయగానే, మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే ఆధార్ నంబర్ అడుగుతుంది. - అది నమోదు చేయగానే కావల్సిన నగదు, బ్యాంక్ పేరు అడుగుతుంది. నగదు మొత్తం ఎంటర్ చేసి, ఖాతా కలిగిన బ్యాంక్ పేరును ఎంపిక చేసుకోవాలి (ఆధార్‌తో ఆ బ్యాంక్ ఖాతా అనుసంధానమై ఉండాలి). - ఆపై బయోమెట్రిక్ అందిస్తే.. అది ఆమోదం కాగానే నగదు విత్ డ్రా, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ విచారణ, ఫుల్ మనీ ఆప్షన్లు వస్తాయి. - ఉదాహరణకు నగదు విత్ డ్రా ఆప్షన్ ఎంచుకుంటే.. నగదు మొత్తం ధ్రువీకరణ కోసం మరోమారు బయోమెట్రిక్ అందించాలి. - ఈ ప్రక్రియ పూర్తి కాగానే, పోస్ట్‌మేన్ ఆ నగదు అందజేస్తారు. ఏరియా పోస్ట్మేన్లను అడిగితే చెబుతారు ఏరియా పోస్ట్మేన్లను సంప్రందించి ఇంటి ముంగిటే ఆధార్ ఏటీఎంల సేవలు పొందవచ్చు. బ్యాంక్, ఏటీఎంలకు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మీ ఏరియా పోస్ట్‌మేన్ అందుబాటులోకి వస్తారు. – జయరాజ్, చీఫ్ పోస్ట్‌మాస్టర్, జనరల్ పోస్టాఫీసు, హైదరాబాద్ -
ఇక పోస్టల్ ఏటీఎం సెంటర్లు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: తపాలా శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇప్పటి వరకు బ్యాంకులకే పరిమితమైన ఏటీఎం సెంటర్లను పోస్టాఫీసుల్లోనూ నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఒంగోలు, కందుకూరు, చీరాలతో పాటు కనిగిరిలో హెడ్ పోస్టాఫీసులున్నాయి. తొలుత కనిగిరి హెడ్‌పోస్టాఫీసులో ఏటీఎం కేంద్రం పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం హైదరాబాద్, విజయవాడ నుంచి సాంకేతిక, ఇంజినీరింగ్ నిపుణుల బృందం వచ్చి కనిగిరి కార్యాలయాన్ని పరిశీలించింది. వచ్చే ఏడాది మార్చిలోపు కనిగిరిలో పోస్టల్ ఏటీఎంను నెలకొల్పేందుకు సాధ్యాసాధ్యాలు బేరీజువేస్తూ ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నారు. ఆ తరువాత వరుసగా కందుకూరు, చీరాల, ఒంగోలుల్లోని హెడ్ పోస్టాఫీసుల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తారు. ఈమేరకు న్యూఢిల్లీలోని తపాలాశాఖ కేంద్ర కార్యాలయం కార్యదర్శి పి.గోపీనాథ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. జిల్లాలో 1.64 లక్షల ఎస్బీ ఖాతాదారులు ప్రకాశం పోస్టల్ డివిజన్ పరిధిలో మొత్తం 1 లక్షా 64 వేల 260 మంది సేవింగ్స్ బ్యాంకు (ఎస్బీ) ఖాతాదారులున్నారు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు ఆ అకౌంట్లో ఎప్పుడైనా నగదు వేసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒంగోలు హెడ్ పోస్టాఫీసు పరిధిలో 58,280 మంది, చీరాలలో 36,680, కందుకూరులో 35,880, కనిగిరిలో 32,420 మంది ఎస్బీ ఖాతాదారులు తపాలాశాఖ నుంచి ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఈ నాలుగు హెడ్పోస్టాఫీసుల పరిధిలో 96 సబ్ పోస్టాఫీసులు, 504 బ్రాంచి పోస్టాఫీసులున్నాయి. ఎస్బీ ఖాతాల పరిశీలన మొదలు ఏటీఎం సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలంటే ప్రాథమికంగా వాళ్ల పరిధిలో ఉన్న ఎస్బీ ఖాతాలను పరిశీలించి వాటి వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని సబ్ పోస్టాఫీసులు తమ కార్యాలయ పరిధిలోని ఖాతాలను తాజాగా లావాదేవీలు జరుపుతున్నట్లు ధ్రువీకరించి సర్టిఫై చేస్తారు. గత సంవత్సరం నుంచి జరుగుతున్న లావాదేవీలను కంప్యూటర్లలోకి ఎక్కిస్తారు. ఈ విధంగా ఆయా సబ్పోస్టాఫీసుల పరిధిలోని బ్రాంచి పోస్టాఫీసుల్లో కూడా ఉన్న ఎస్బీ అకౌంట్లను సైతం పరిశీలించి సర్టిఫై చేస్తున్నారు. అయితే వినియోగదారుల్లో పెద్దగా స్పందన కనపడడం లేదు. పోస్టల్ సిబ్బంది ఎస్బీ ఖాతాలను తెచ్చి వాటిని పరిశీలించుకుని వెళ్లాలని చెప్పినా రావడం లేదు. ఖాతాదారులందరూ త్వరితగతిన పరిశీలించుకుంటే ఏటీఎం ప్రాసెస్ త్వరగా పూర్తవుతుందని జిల్లా పోస్టల్ అధికారులు అంటున్నారు.