breaking news
Port-au-Prince
-
Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ!
ఒక నేర ముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతాబలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణచేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేర ముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తూంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఎ ప్రిన్స్ రాజధానిసహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్‌లకు అసలేం కావాలి?. కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాలవశం కావడంతో స్వదేశం తిరిగిరాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకురావడానికే జనం భయపడుతున్నారు. హైతీలో ప్రధాన గ్యాంగ్‌లు ఎన్ని? హైతీలో దాదాపు 200 వరకు నేరముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ ‘బార్బెక్యూ’ చెరీజియర్ నేతృత్వంలోని జీ9 ఫ్యామిలీ అండ్ అలీస్ అలయన్స్, గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలోని జీపెప్ నేరముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టుకోసం చాన్నాళ్లుగా ఈ రెండు వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు జీ9, జీపెప్ నేరముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్ల లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు గ్యాంగ్‌లు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్దెదింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశాక నేరసామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగేలా చేశారు. 2021 జులైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీ హైతియన్ టెట్ కాలే(పీహెచ్‌టీకే)తో జిమ్మీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో జిమ్మీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసె భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా రెండు ముఠాలు బలీయమయ్యాయి. హింస ఎప్పుడు మొదలైంది? హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ‘పాపా డాక్’ డ్యువేలియర్, అతని కుమారుడు జీన్‌క్లాడ్ డ్యువేలియర్‌ల 29 ఏళ్ల నియంతృత్వ పాలనాకాలంలోనే ఈ గ్యాంగ్‌లు పురుడుపో సుకున్నాయి. డ్యువేరియర్లు ఒక సమాంతర మిలటరీ(టోంటోన్స్ మకౌటీస్)ని ఏర్పాటు చేసి వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని అంతమొందించారు. ‘హైతీలో నేరముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేరముఠాల వైఖరి గతంతో పోలిస్తే దారుణం’ అని వర్జీనియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, హైతీ వ్యవహారాల నిపుణుడు రాబర్ట్ ఫాటన్ విశ్లేషించారు. నేతలనూ శాసిస్తారు బెదిరింపులు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లతో నేరముఠాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించుకు పోయారు. సాయుధముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయపార్టీలు, నేతలనే శాసిస్తున్నాయి. పరిపాలన వాంఛ అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేర ముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసె హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దె దింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీచేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటిచేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. సంకీర్ణ బలగాలు వస్తున్నాయా? కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికాసహా పలుదేశాలు నిర్ణయించాయి. ఐరాస ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాల ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాటు, అన్ని భాగస్వామ్యపక్షాల సంప్రతింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. మన వాళ్లను వెనక్కి రప్పిస్తాం: భారత విదేశాంగ శాఖ హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రతింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పడవ మునిగి 21 మంది మృతి
హైదరాబాద్: పోర్టాప్రిన్స్లో పడవ నీట మునిగి దాదాపు 21 మంది మరణించారు. వివరాలు.. హైతీలోని ఉత్తర కోస్ట్‌లో గురువారం తెల్లవారుజామున ఓ పడవ ప్రయాణికులతో బయలుదేరింది. గురువారం అర్ధరాత్రి తర్వాత పడవ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. పడవ ప్రయాణానికి ప్రతికూల వాతావరణం ఎదురు కావటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. 21 మృతదేహాలను గుర్తించారు. ఇంకా మిగిలిన వారిని వైద్యం కోసం బోర్న నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. -
బస్సు ప్రమాదంలో 23 మంది మృతి
పోర్ట్ - ఏ- ప్రిన్స్ : హైతీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. ప్రమాద స్థలం నుంచి 18 మృతదేహలను వెలికి తీసినట్లు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారని చెప్పారు. బస్సు బ్రేకులు ఫేయిలు కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఉన్నతాధికారులు వెల్లడించారు.