పేదరికంతో అమ్మకానికి పేగు బంధం
తనకల్లు: తన పేదరికం బిడ్డకు శాపం కాకూడదని ఓ తల్లి పేగు బంధాన్ని అమ్మకానికి పెట్టింది. విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ బిడ్డను శిశు విహార్‌కు తరలించారు. వివరాల్లోకెళితే... అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన భూదేవి పూసలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. కొన్ని నెలల క్రితం భర్త భాస్కర్ అనారోగ్యంతో చనిపోయాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయేనాటికే గర్భంతో ఉన్న భూదేవి వారం క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది.
అసలే పేదరికం.. పైగా భర్త తోడు లేకపోవడంతో ఇప్పుడు పుట్టిన బిడ్డ పోషణ భారమైంది. దీంతో తన సమీపబంధువుకు శనివారం ఇటీవల జన్మించిన బిడ్డను ఇచ్చేసి.. అతను ఇచ్చిన కొంత మొత్తాన్ని స్వీకరించింది. ఈ విషయంపై కొందరు గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సీడీపీఓ నాగమల్లేశ్వరి, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు జ్ఞానేశ్వరి, శోభా , కానిస్టేబుల్ సుబ్బయ్య విచారించారు. తల్లిని ప్రశ్నిస్తే బిడ్డను పోషించలేని స్థితిలో ఇచ్చేశానని తెలిపింది. దీంతో ఆ బిడ్డను శిశువిహార్‌కు తరలించారు.