breaking news
polavaram Ordinance
-
వీడనున్న బంధం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉన్న ఒక్క ఆశా... ఆవిరైపోయింది. రాజ్యసభలో అధికార పక్షం సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడయినా పోలవరం ముంపు ఆర్డినెన్స్ ఆగుతుందేమోనని ఆశించిన ఆదివాసీలకు ఇక్కడా భంగమే ఎదురైంది. సోమవారం రాజ్యసభ కూడా ముంపు ఆర్డినెన్స్‌కు మూజువాణీ ఓటుతో ఆమోదం తెలి పింది. దీంతో బిల్లు చట్టబద్ధతకు లైన్‌క్లియర్ అయినట్టయింది. ఇక రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఒక్క సంతకం పెడితే బిల్లుకు చట్టబద్ధత లభిస్తుంది. చట్టబద్ధత లభించిన వెంటనే అధికారికంగా జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తాయి. భద్రాచలం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, వీఆర్ పురం, కూనవరం, బూర్గంపాడు మండలాలను (భద్రాచలం రెవెన్యూ గ్రామం, బూర్గం పాడు 12 గ్రామాలు మినహా) పక్క రాష్ట్రానికి బదలాయిస్తారు. దీంతో పాటు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు, లక్షల ఎకరాల భూమి, అటవీ సంపద, అడవి తల్లి అందాలు, సీలేరు విద్యుత్ కేంద్రం, అన్నింటికీ మించి జిల్లాతో ఆదివాసీలకు అల్లుకున్న అపురూపం బంధం... అన్నీ వీడిపోనున్నాయి. పట్టించుకోని కేంద్రం... వాస్తవానికి ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు ప్రజల మద్దతు లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు మునిగిపోతాయని, మునిగే గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే పునరావాసం సమస్య ఎదురవుతుందనే సాంకేతిక కారణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల గోడు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. తరతరాలుగా గోదారి ఒడిలో బతుకు నావను నడిపిన ఆదివాసీ గిరిజనుల భవిష్యత్తును ఫణంగా పెట్టి బిల్లును ఆమోదించారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో పెట్టిన బిల్లును తెలంగాణ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించారు. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రాంత సభ్యులు మాత్రం మద్దతు తెలిపారు. మరోవైపు తాము తయారుచేసిన ఆర్డినెన్సే కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా బిల్లుకు మద్దతు తెలిపింది. దీంతో సభలో ఓటింగ్ అడిగినప్పటికీ పట్టించుకోని డిప్యూటీ చైర్మన్ కురియన్ మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. స్థానిక సంస్థలు, ప్రతినిధుల సంగతేంటో..? ముంపు ప్రాంతం బదలాయింపునకు చట్టబద్ధత లభిస్తోంది కానీ, ముంపు ప్రాంతంలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, ఇతర సొసైటీల చైర్మన్లు, సభ్యుల పరిస్థితేంటో అర్థం కావడం లేదు. జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్న ఏడు మండలాల్లో ఐదింటికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు. ఇక ఈ ఏడు మండలాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. మరి, ఈ మండలాలు ఉభయగోదావరి జిల్లాల్లో కలిస్తే వీరి పదవులు ఉంటాయా, వీరిని అక్కడి స్థానిక ప్రభుత్వాలలో ఎలా విలీనం చేసుకుంటారన్నది ప్రశ్న. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో జడ్పీచైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. మరి అక్కడి జడ్పీటీసీలను ఏ విధంగా జిల్లా పరిషత్ కౌన్సిల్లో కలుపుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అలా కలుపుకున్నా అక్కడి బలాబలాల్లో కూడా తేడాలు వస్తాయి. మరోవైపు ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో కోర్టు కేసు కారణంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఆ మండలాలు గోదావరి జిల్లాలకు వెళ్లిపోతే అక్కడయినా ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నికలు జరుగుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ముంపు మండలాలను, అందులోని గ్రామాలను జిల్లా పరిషత్ చట్టం ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి ఆంధ్రలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లోనే ఏ మండలాన్ని, ఏ గ్రామాన్ని ఏ డివిజన్లో, ఏ మండలంలో కలుపుతారు అనేది తెలియజేస్తారు. అలా చట్టం ద్వారా సంక్రమించిన అధికారంతో బదలాయించుకున్న స్థానిక ప్రభుత్వాలను అక్కడి స్థానిక ప్రభుత్వాలతో ఎలా కలుపుకుంటారనేది తేలాల్సి ఉంది. మరోవైపు పలు సంక్షేమ పథకాల అమలు, రేషన్, పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఐటీడీఏ బదలాయింపు లాంటి అంశాలన్నింటిలో ఎప్పుడు స్పష్టత వస్తుందో చెప్పలేమని జిల్లా యంత్రాంగం చెబుతుండడం ఆదివాసీలకు ఆందోళన కలిగిస్తోంది. -
అడ్డుకుంటారా? ఓటింగ్ కోరతారా?
పోలవరం ఆర్డినెన్సపై కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్ హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకుని తెలంగాణ ప్రజలపై మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా.. అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కాంగ్రె స్ను సవాల్ చేశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.రాజయ్య యాదవ్‌తో కలిసి తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంద బలం ఉందనే అహంకారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్ణయాన్ని మాత్రమే అమలు చేస్తున్నామంటూ బీజేపీ నేతలు చేస్తున్న వాదనల్లో అర్థం లేదన్నారు. వాటినే అమలు చేయాలనుకుంటే.. ఇక కొత్త ప్రభుత్వం, కొత్తగా ప్రధానమంత్రి ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. లోక్‌సభలో మందబలం ఉన్నా రాజ్యసభలో బీజేపీ బలం తక్కువగా ఉందన్నారు. పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. నోటి మాటలతో, వట్టి ప్రకటనలతో కాంగ్రెస్ నేతలు మాట్లాడితే సరిపోదన్నారు. కాంగ్రెస్‌పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవాలని కేటీఆర్ సవాల్ చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో ఓటింగ్ పెడితే ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, జానారెడ్డికి ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీపై ఒత్తిడి తెచ్చి రాజ్యసభలో ఓటింగ్‌ను కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు చేవగలిగిన నాయకుల్లాగా వ్యవహరిస్తారా, ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా దాసోహమంటారా? అనేది రాజ్యసభలో వారి వైఖరితో తేలిపోతుందన్నారు.